బీజేపీలోకి మాజీ సైన్యాధిపతి | vijay kumar Singh joins BJP, says it is the only nationalist party | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి మాజీ సైన్యాధిపతి

Published Sun, Mar 2 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

బీజేపీలోకి మాజీ సైన్యాధిపతి

బీజేపీలోకి మాజీ సైన్యాధిపతి

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ విజయ్‌కుమార్ సింగ్ (వీకే సింగ్) శనివారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సింగ్‌తోపాటు ఆర్మీ, వాయుసేనకు చెందిన పలువురు ఉన్నతాధికారులకు పార్టీ కండువా కప్పి పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆహ్వానించారు. దేశ ప్రయోజనాల కోసం పాటుపడే ఏకైక జాతీయ పార్టీ బీజేపీయేనని.. అందుకే తాను ఈ పార్టీలో చేరుతునట్లు ఈ సందర్భంగా వీకే సింగ్(63) చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. తన పుట్టిన తేదీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పోరాటం చేసి ఓడిపోయిన వీకే సింగ్ 10 నెలల క్రితం ఉద్యోగ విమరణ చేశారు.

ఇప్పుడు బీజేపీలో చేరడం ద్వారా కాంగ్రెస్‌పై ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. స్థిరమైన, బలమైన కేంద్ర ప్రభుత్వం ఏర్పడేందుకు జాతీయవాద శక్తులను బలపరచాలని విశ్రాంత సైనికులకు పిలుపునిచ్చారు. జాతి నిర్మాణానికి, శక్తిమంతం కోసం బీజేపీతో కలసి అడుగులు వేయనున్నట్లు చెప్పారు. అన్నా హజారే బృందంలో సభ్యుడైన సింగ్ బీజేపీలో చేరడంతో.. అన్నాను వదిలేసినట్లేనా? అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో తానెవరినీ విడిచిపెట్టలేదని సింగ్ స్పష్టం చేశారు. సింగ్‌తోపాటు బీజేపీలో చేరిన విశ్రాంత సైనిక ఉన్నతాధికారుల్లో వీకే చతుర్వేది సహా పలువురు ఉన్నారు.
   
 సైనికుల సంక్షేమానికి కృషి..
 బీజేపీలోకి వీకే సింగ్‌ను సాదరంగా ఆహ్వానించిన రాజ్‌నాథ్‌సింగ్.. తాము అధికారంలోకి వస్తే రక్షణ దళాల ఉద్యోగులు, మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తామని.. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే, ఢిల్లీలో జాతీయ వార్ మెమోరియల్‌ను నిర్మిస్తామని, ఆయుధాల కొనుగోళ్లలో పారదర్శకత తీసుకొస్తామన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ యూపీఏ సర్కారు వైఫల్యాలపై దాడికి దిగారు. యూపీఏ హయాంలో దేశరక్షణ బలహీనపడిపోయిందని విమర్శించారు. చైనా చొరబాట్లు, సరిహద్దుల్లో భారత సైనికుల తలల నరికివేత, పాక్ కాల్పుల ఉల్లంఘనలపై రాజ్‌నాథ్ మండిపడ్డారు. రక్షణ దళాలను యూపీ ఏ సర్కారు నిర్లక్ష్యం చేసిందని.. నేవీలో ఇటీవలి పరిణామాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. సైన్యంలో ఆధునీకరణను విస్మరించారని కేంద్రంపై ధ్వజమెత్తారు.  
 
 పార్టీల్లో చేరకుండా నిషేధించాలి: వీకే సింగ్ బీజేపీలో చేరడంపై పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా స్పందించాయి. ఉన్నతాధికారులు ఉద్యోగ విరమణ అనంతరం రాజకీయ పార్టీల్లో చేరకుండా నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ అధికారులు ఉద్యోగ విరమణ తర్వాత 10 ఏళ్ల వరకు పార్టీల్లో చేరకుండా నిషేధం విధించాలని ఎస్పీ ప్రధాన కార్యదర్శి నరేశ్ అగర్వాల్ కోరారు. జేడీయూ బహిష్కృత ఎంపీ శివానంద్ తివారీ కూడా ఇదేవిధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాత్రం తేలిగ్గా తీసుకుంది. స్వేచ్ఛాయుత దేశంలో ఆయనొక స్వేచ్ఛగలిగిన వ్యక్తి(వీకే సింగ్) అని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వి చెప్పారు.
 
 తర్వాతి ప్రధాని మోడీయే: రాఖీ సావంత్
 బీజేపీలోకి వీకే సింగ్, ఇతరుల చేరిక సందర్భంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో అనుకోని అతిథిలా బాలీవుడ్ ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ ప్రత్యక్షమైంది. బీజేపీలో చేరిన మాజీ సైనికాధికారులకు రాఖీలు కూడా కట్టి ఆమె రాజ్‌నాథ్ సింగ్‌తో సహా అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒప్పుకుంటే ఆయనను మనువాడతానంటూ గతంలో సంచలనం రేపిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తాజాగా తన దృష్టిని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపైకి మళ్లించింది. మోడీని పెళ్లి చేసుకుంటానని అనలేదు కానీ.. దేశానికి తర్వాతి ప్రధాన మంత్రి ఆయనేనని, ఆయన తరఫున వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానని సెలవిచ్చింది. దీంతో రాజకీయాల్లోకి ప్రవేశించాలని రాఖీ భావిస్తున్నారని సంకేతాలు అందినట్లైంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement