
ఖాతాదారులకు మరో శుభవార్త..!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన నగదు ఇబ్బందులకు త్వరలోనే పూర్తిగా చెక్ పడనుందట. ఏటీఎంల విత్ డ్రాలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నెల చివరి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం ఉపసంహరణ పరిమితులను పూర్తిగా తొలగించనుందని బ్యాంకర్లు తెలిపారు.
ఫిబ్రవరి మాసాంతానికి లేదా మార్చి మొదటి వారానికి నగదు విత్ డ్రా నిబంధనలను పూర్తిగా సడలించనుందని మహారాష్ట్ర బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ కే గుప్తా మీడియాకు తెలిపారు. ఇది పూర్తిగా ఆర్ బీఐ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్నారు. పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తరువాత కేంద్ర బ్యాంకు నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఫిబ్రవరి నాటికి 78-88 శాతం నగదు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి చేరుతుందని ఎస్బీఐ పరిశోధన నివేదించింది. దీంతో రాబోయే రెండు నెలల్లో పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి చేరనుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు ముందే పరిస్థితి పూర్తిగా చక్కబడుతుందని మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ చాలా వేగంగా పరిస్థితిని సమీక్షిస్తోందని.. నగదుకష్టాలు రెండు మూడు వారాల్లో తీరిపోతాయన్నారు.
మరోవైపు ఆర్థికశాఖ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన ఆర్ బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాత్రం దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. రద్దయిన నోట్లలో 60 శాతం వెనక్కి వచ్చిందనీ, రూ.9.2 లక్షల కోట్ల నగదు బ్యాంకులకు తిరిగి చేరిందని ప్రకటించినప్పటికీ, నగదు కష్టాల ఉపశమన పరిస్థితులపై ఎలాంటి సమయాన్ని సూచించకపోవడం గమనార్హం.
కాగా నవంబరు 8న దేశవ్యాప్తంగా రూ.500,1000 పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన సంచలనం రేపింది. దీంతో నగదు కొరతతో ప్రజలు అష్ట కష్టాలుపడ్డారు. అనేక రోజుల పాటు బ్యాంకుల వద్ద, ఏటీఎం సెంటర్ల వద్ద జనం క్యూకట్టారు. ఈ నగదు కష్టాలను అధిగమించేందుకు ఆర్బీఐ విడతల వారీగా అనేక ఉపశమన చర్యలు చేపట్టింది. ఏటీఎం క్యాష్ విత్ డ్రా లిమిట్ పెంపును ప్రకటించింది. తాజాగా పొదుపు ఖాతాదారులకు రోజుకు రూ 10,000 లు, కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ను లక్ష. రూపాయలకు ఉపసంహరణ పరిమితిని పెంచింది. మరోవైపు పాత నోట్ల డిపాజిట్లకు గడువు 2016 డిసెంబర్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే.