అసలు ప్రభుత్వమనేది ఉందా ? : విజయమ్మ
సాక్షి, శ్రీకాకుళం: ‘‘తుపాను సృష్టించిన విలయానికి వేలాది మంది అభాగ్యులుగా మిగిలారు. రైతులు పూర్తిగా నష్టపోయారు. కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. జీడి రైతులూ తీవ్రంగా దెబ్బతిన్నారు. వరి పొలాలూ నీట మునిగాయి. మత్య్సకారుల పరిస్థితి దయనీయంగా మారింది. పడవలు, వలలు దెబ్బతిని ఉపాధి పూర్తిగా కోల్పోయారు. నాలుగు రోజులుగా అల్లాడుతున్నారు. అయినా ఇప్పటివరకూ ప్రభుత్వం స్పందించలేదు. ఇంతవరకు ముఖ్యమంత్రి కనీసం ఏరియల్ సర్వే అయినా చేయలేదు. పరిస్థితి ఏమిటో ఎలా ఉందో కూడా తెలియని దుస్థితిలో ప్రభుత్వం ఉంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘అసలు ప్రభుత్వం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోంది’’ అంటూ ధ్వజమెత్తారు.
తుపాను తాకిడికి దెబ్బతిన్న రైతులు, మత్య్సకారులకు తక్షణ సాయం అందించి ఆదుకోవాలని.. దెబ్బతిన్న పంటలకు పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని.. వారికి ఇప్పటివరకూ ఇచ్చిన అన్ని రకాల రుణాలనూ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని విజయమ్మ డిమాండ్ చేశారు. శనివారం రాత్రి విరుచుకుపడిన పై-లీన్ పెను తుపానుతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలోని తుపాను బాధిత ప్రాంతాల్లో విజయమ్మ బుధవారం విస్తృతంగా పర్యటించారు. కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లోని పలు గ్రామాలు, మారుమూల పల్లెలను సైతం ఆమె సందర్శించారు. ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న తోటలు, పొలాలను స్వయంగా పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటం లేదన్న బాధితులకు తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. వారి తరఫున తమ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం జగతి గ్రామంలో విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. ‘‘తుపాను వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దాన్ని తక్షణం చెల్లించాలి. కొబ్బరి రైతులకు పడిపోయిన చెట్లకు మాత్రమే కాకుండా.. ఎకరా యూనిట్‌గా తీసుకుని పరిహారం ఇవ్వాలి. తుపాను కారణంగా దెబ్బతిన్న రైతులకు కేంద్రం రుణమాఫీ చేయాలి. వరి పొలాలు నీటితో నిండిపోవటంతో నాట్లు పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. అందువల్ల పంట నష్టపరిహారాన్ని వరికి కూడా వర్తింపజేయాలి. మత్స్యకారులకు ఈ రోజుకు కూడా కనీస సాయం అందలేదు. వెంటనే వారి జీవనభృతికి కావాల్సిన బియ్యం, ఇతర సరుకులు ప్రభుత్వం అందించాలి. వరదల్లో వలలు, బోట్లు పూర్తిస్థాయిలో కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి. తుపాను బాధితులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. తుపాను ప్రభావిత గ్రామాలు ఇంకా అంధకారంలో ఉన్నాయి.
వెంటనే కరెంటు సరఫరా పునరుద్ధరించాలి. అలాగే తాగునీరు కూడా సరఫరా చేయాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. తుపాను బాధితుల సాయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర గవర్నర్‌ను, రాష్ట్రపతిని కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారని విజయమ్మ చెప్పారు. విజయమ్మ వెంట వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు, సీజీసీ సభ్యులు కణితి విశ్వనాథం, పాలవలస రాజశేఖరం, ఎం.వి.కృష్ణారావు, సమన్వయకర్తలు పిరియా సాయిరాజ్, కలమట వెంకటరమణ, కిల్లి రామమోహన్‌రావు, బొడ్డేపల్లి మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌రావు, పి.ఎం.జె.బాబు, విశ్వరాయ కళావతి, వై.వి.సూర్యనారాయణ, వరుదు క ళ్యాణి, గొర్లె కిరణ్, వజ్జ బాబూరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతు కిరణ్‌కుమార్, మహిళా విభాగం కన్వీనర్ బల్లాడ హేమమాలినీరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొగ్గు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.