మేడపైన.. మట్టిలేకుండా సేంద్రియ సేద్యం! | Organic farming without soil | Sakshi
Sakshi News home page

మేడపైన.. మట్టిలేకుండా సేంద్రియ సేద్యం!

Published Wed, Mar 11 2015 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

మేడపైన.. మట్టిలేకుండా  సేంద్రియ సేద్యం!

మేడపైన.. మట్టిలేకుండా సేంద్రియ సేద్యం!

కొబ్బరి పొట్టు + వర్మీ కంపోస్టు సమపాళ్లలో వాడుకోవచ్చు
కంపోస్టు టీతో చక్కని ఇంటిపంటల దిగుబడి!

 
సాధారణంగా మట్టి లేనిదే పంట లేదని, పండదని అనుకుంటూ ఉంటాం. హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్ వంటి పద్ధతుల జోలికి వెళ్లకుండానే.. గుప్పెడు మట్టి కూడా అవసరం లేకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండించుకోవచ్చని అనుభవ పూర్వకంగా చెబుతున్నారు ఉపేంద్ర సాయినాథ్(98663 76481). హైదరాబాద్ నాగోలులోని తమ మేడపై కుండీలు, మడుల్లో కేవలం కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్టును మాత్రమే సమపాళ్లలో పోసి.. ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. పర్మాకల్చర్ సర్టిఫైడ్ ట్రైనర్ అయిన ఉపేంద్ర వేసవిలో ఇంటిపంటలపై తన అనుభవాలను ‘సాక్షి’కి ఇంకా ఇలా వివరిస్తున్నారు...

సారవంతమైన సాగు భూములను తవ్వి ఎర్రమట్టిని నగరంలోకి తెస్తున్నారు. పర్మాకల్చర్ పద్ధతులకు ఇది విరుద్ధం. కాబట్టి.. గుప్పెడు కూడా మట్టిని వాడకుండానే కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్టుతో కుండీలు, మడుల్లో ఇంటిపంటలు సాగు చేస్తున్నా. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. 2,3 రోజులకోసారి కంపోస్టు టీని కుండీకి ఒక్కో మగ్గు చొప్పున పోయడం ద్వారా ఇంటిపంటలకు ఏ దశలోనూ పోషకాల లోపం రాకుండా జాగ్రత్తపడుతున్నా. పూత, కాత దశలో పోషకాల లోపం వల్లే చీడపీడలు విజృంభిస్తాయి. కంపోస్టు టీని 1:3 పాళ్లలో నీటితో కలిపి పోసుకోవచ్చు. లేదా నేరుగా కంపోస్టు టీనే పోయవచ్చు. కంపోస్టు టీతో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇది మహామంత్రం లాంటిదన్నమాట!

 ఎండాకాలం ఇంటిపంటల్లో కుండీలు, మడులను దగ్గర దగ్గరగా పెట్టుకోవడం వల్ల వేడి నుంచి రక్షణ పొందవచ్చు. ఆకుకూరలు, కూరగాయ మొక్కలతోపాటు మొక్కజొన్న మొక్కలు తప్పని సరిగా పశ్చిమ దిక్కున వేసుకోవాలి. తద్వారా మధ్యాహ్నం తర్వాత ఎండ తీవ్రత నుంచి పంటలను కాపాడుకోవచ్చు. ఈ మొక్కలు పక్కన మొక్కలను గాలి తాకిడి నుంచి రక్షిస్తాయి. గాలి తీవ్రత వల్ల టమాటా, వంగ వంటి పంటల్లో పూత రాలిపోయి కాపు తగ్గడం చూస్తుంటాము. మొక్కజొన్న పెరుగుతున్న చోట ఇతర మొక్కలపై ఎండ వత్తిడి తగ్గుతుంది. నీడను ఇష్టపడే క్యాప్సికం మొక్కలకు నీడ పడేలా, నీడ ఇష్టపడని టమాటా వంటి మొక్కలను మొక్కజొన్నలకు దూరంగా అమర్చుకోవాలి.

 ఒక కుండీలోనో లేదా ఒక చదరపు అడుగులోనో ఒకటే మొక్క పెంచాలన్న భావన నగరాలు, పట్టణాల్లో ఇంటిపంటలకు నప్పదు. తక్కువ చోటులోనే ఎక్కువ పంటలను పండించుకోవడం ఉత్తమం. అయితే, పోషకాల కోసం తమలో తాము పోటీపడని రకాల మొక్కలను ఒకే కుండీలో కలిపి పెంచుకోవాలి. ఉదా.. వంగ కుండీలో పాలకూర వంటి ఆకుకూరలు వేసుకోవడం మంచిది. కుండీలో 2 అడుగుల వరకు వంగ మొక్క వేళ్లు చొచ్చుకెళ్తే.. పాలకూర మొక్క వేళ్లు 3-4 అంగుళాలకు మించి వెళ్లవు. అయితే, వంగ దిగుబడి 75%కు పరిమితం కావచ్చు. కానీ, వంగతోపాటు పెరిగే ఆకుకూరల్లో పూర్తిస్థాయి దిగుబడి పొందొచ్చు. పాలకూరతోపాటు ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర కూడా కలిపి వేసుకోవచ్చు. వెల్లుల్లి, కొత్తిమీర వల్ల పాలకూరకు చీడపీడల బెడద రాదు. టై గార్డెన్‌లో కూరగాయలతోపాటు ఎక్కువ ఆకుకూరలు పెంచుకోవడం ఇలాగైతేనే సాధ్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement