నెత్తురోడిన పాక్
ఇరుగుపొరుగుకు ఉగ్రవాదం ఎగుమతి చేస్తున్న దేశంగా తరచు విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ వారమంతా వరస పేలుళ్లతో హోరెత్తింది. కేవలం అయి దురోజుల వ్యవధిలో లాహోర్ మొదలుకొని బలూచిస్తాన్‌లోని ఆవారన్ వరకూ పలు నగరాలు, పట్టణాల్లో పది ఉగ్రవాద దాడులు జరిగి దాదాపు 50మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికీ పరాకాష్ట అనదగ్గ ఘటన గురువారం సింద్ రాష్ట్రంలోని సెహ్వాన్‌లో సూఫీ మత గురువు లాల్ షాబాజ్ ఖలందర్ ప్రార్థనా మందిరంలో చోటు చేసుకుంది.
మానవ బాంబు జొరబడి చేసిన ఈ దాడిలో 80 మంది మరణించారు. మరో 250మంది తీవ్రంగా గాయపడ్డారు. సైన్యం చర్యలు తీసుకోవడం లేదని అనడానికి లేదు. ఏదో ఒక మూల ఉగ్రవాద స్థావరంపై దాడి చేశామని అది చెప్పని రోజంటూ లేదు. ఆ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మరణిస్తున్నారు కూడా. అయినా ఉగ్రవాద ఉదంతాలు దేశంలోఎక్కడా తగ్గలేదు సరిగదా అవి మరింత జోరందుకున్నాయి.
ఇటు సైన్యం ‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’ ఆగలేదు. సెహ్వాన్ ఉదంతం తర్వాత వివిధ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామంటూ శుక్రవారం ఒక్కరోజే 100 మందిని హతమార్చింది. ఏదైనా జరిగినప్పుడల్లా తాము చేతులు ముడుచుకుని కూర్చోలేదని చెప్పడానికి ఆ పేరిట సైన్యం వెనకా ముందూ చూడకుండా దాడులు చేస్తున్నదన్న విమర్శలున్నాయి. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు దాన్ని ఎలా అరి కట్టాలో, దాని మూలాలు ఎక్కడున్నాయో తోచక నానా యాతనలూ పడుతున్నదని ఈ దాడులు–ప్రతి దాడుల వ్యవహారాన్ని చూస్తే అర్ధమవుతుంది. సైన్యం తన దారిన తాను దాడులు చేస్తుంటే దాని శక్తిసామర్ధ్యాలను హేళన చేసేలా ఉగ్రవా దులు మరింత క్రౌర్యానికి తెగిస్తున్నారు. ఈ వారం జరిగిన ఉదంతాల తీరును గమనిస్తే అవి అవకాశం దొరికినచోట చేసిన దాడుల్లా కనబడవు. వాటన్నిటికీ ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ఉన్నదని, ఎంచుకున్న ప్రాంతాల్లో లక్ష్యాలను నిర్ణయించు కుని ఉగ్రవాదులు తమ పని కానిస్తున్నారని తెలుస్తుంది.
సిం«ద్ రాష్ట్రానికి సూఫీ మతగురువులతో, సూఫీయిజంతో ఆత్మీయ అను బంధం ఉంది. శతాబ్దాల నుంచి అది తరం నుంచి తరానికి కొనసాగుతూ వస్తోంది. వాస్తవానికి సిం«ద్‌లోనే కాదు... ఉపఖండంపైనే సూఫీయిజం చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు దాడి జరిగిన లాల్ షాబాజ్ ఖలందర్ సూఫీ మందిరంతోపాటు కరాచీలోని అబ్దుల్లా షా ఘాజీ సూఫీ మందిరం, భిత్‌షాలోని షా అబ్దుల్ లతీఫ్ భితాయ్ సూఫీ మందిరం ఈ సంప్రదాయ పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటికి సిం«ద్ రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలలనుంచీ ప్రతి గురువారం వేలా దిగా తరలివస్తారు. తమ కాలపు అసమానతలపైన, వాటిని పెంచి పోషిస్తున్న పాలకులపైనా తిరగబడిన చరిత్ర సూఫీ మత గురువులది.
ఇందుకోసం ప్రజలపై బలమైన ప్రభావం చూపే మత తాత్వికతనే వారు ఆలంబన చేసుకున్నారు. మహిళా సూఫీ మత గురువులైతే కట్టుబాట్ల పేరిట కుటుంబాల్లో మహిళలను అణచి వేసే ధోరణులపై కూడా పోరాడారు. సంగీతానికి, కవిత్వానికి సూఫీయిజం ఎన్నో సొబగులు అద్దింది. శతాబ్దాలుగా మనుషుల్లో మంచితనాన్ని, మానవీయతను ప్రబోధిస్తూ కొనసాగుతున్న ఇంతటి సమున్నత స్రవంతిపై ఉన్మాదం తప్ప మరేమీ తెలియని ఉగ్రవాదులు దాడి చేయడంలో వింతేమీ లేదు. సామరస్యాన్ని ప్రబో ధించే, బహుళత్వాన్ని ప్రేమించే సూఫీయిజంపై పాకిస్తాన్‌లో తరచూ దాడులు జరు గుతున్నాయి. 2005 నుంచి సూఫీ మందిరాల్లో 29 ఉగ్రవాద దాడులు చోటుచేసు కోగా వీటిలో 200మందికిపైగా మరణించారని ఇస్లామాబాద్‌లోని ఇస్లామిక్ పరిశో ధన, అధ్యయన సంస్థ చెబుతోంది. సామాన్య పౌరుల్లో ఉండే మత విశ్వాసాలపై సూఫీయిజం ప్రభావం అధికంగా ఉండటం ఉగ్రవాదులకు కంటగింపుగా ఉంది.
తాజా దాడి వెనక సూత్రధారి ఐఎస్ ఉగ్రవాద సంస్థ అని, పాకిస్తాన్ తాలి బన్(టీటీపీ) సంస్థతో కలిసి వారు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని అంటున్నారు. ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడల్లా పొరుగు దేశం అఫ్ఘానిస్తాన్‌పై ఆరోపణలు చేయడం పాకిస్తాన్‌కు అలవాటుగా మారింది. పాక్–అఫ్ఘాన్ సరిహద్దులు ఉగ్రవా దుల అడ్డాగా మారిన సంగతి నిజమే అయినా... అక్కడి గిరిజన ప్రాంతాల్లో పలు తెగలను చేరదీసి వారికి ఆయుధ శిక్షణనిచ్చి దాడులకు పురిగొల్పిన తన నిర్వాకాన్ని పాకిస్తాన్ మరిచిపోకూడదు. అలాంటి చర్యల కారణంగానే ఉగ్రవాదం ఇప్పుడు ఊడలుదిగింది. ఇప్పటికీ భారత్‌పై కన్నేసిన ఉగ్రవాద సంస్థలకు అక్కడి సైన్యం అండదండలున్నాయి. ఉగ్రవాదులతో అంటకాగిన ఇలాంటి చరిత్రే ఇవాళ దాన్ని అదుపు చేయడంలో పాకిస్తాన్‌కు పెను ఆటంకంగా, తలకు మించిన భారంగా మారింది. అది చీకట్లో తడుములాటగా తయారైంది. స్వాత్ లోయను ఉగ్రవాద రహితంగా మార్చామని, ఇక దక్షిణ వజిరిస్తాన్, ఉత్తర వజిరిస్తాన్‌ల సంగతి చూస్తా మని సైన్యం ఆమధ్య చెప్పింది. వాటి సంగతలా ఉంచి ఉగ్రవాదులు దేశం లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నారని తాజా ఉదంతం వెల్లడిస్తోంది.
ఉగ్రవాద సంస్థలకు నిధులందకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా మని గత నెలలో అంతర్జాతీయ ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్‌కు పాకిస్తాన్ హామీ ఇచ్చింది. ఉగ్రవాద ముఠాల నిధులకు కళ్లెం వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునే ఆ బృందం అయిదు రోజుల సమావేశాలు ఆదివారం పారిస్‌లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల్లాళ్లలో తాను సాధించినదేమిటో చెప్పేందుకు పాకిస్తాన్ తయారవుతుండగా ఈ వారమంతా జరిగిన ఉగ్రవాద ఘటనలు దాని పరువును బజారున పడేశాయి. వివిధ రాజకీయ సంస్థల, ధార్మిక సంస్థల ముసుగులో లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌లాంటి ఉగ్ర సంస్థలు పాక్‌లో నిధులు దండుకుంటున్న వైనంపై మన దేశం పారిస్ సదస్సులో సవివరమైన నివేదిక సమర్పించబోతోంది. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరిని వదులు కోకపోతే అది తమను ముంచేస్తుందని ఇప్పటికైనా పాక్ గుర్తించడం అవసరం. ఈ వారమంతా కొనసాగిన వరస ఉదంతాలు దీన్నే చెబుతున్నాయి.