అన్నీ ఓకే.. ఇక రేపే విడుదల
అన్ని రకాల అడ్డంకులను తొలగించుకున్న ఉడ్తా పంజాబ్ సినిమా శుక్రవారం నాడు విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లగా, అందుకు నిరాకరించిన న్యాయస్థానం.. పంజాబ్ హర్యానా హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. అక్కడ కూడా సినిమా విడుదలకు న్యాయమూర్తులు ఓకే చెప్పడంతో... ఇక థియేటర్లను తాకేందుకు సిద్ధమైంది. అయితే.. విడుదలకు ముందే టోరెంట్లలో ఈ సినిమా లీక్ అయిపోవడంతో కాస్త నిరాశ అనిపించినా, అసలైన సినిమా మజాను ఆస్వాదించేవాళ్లు మాత్రం థియేటర్లకు వస్తారని చిత్ర యూనిట్ ఆశాభావంతో ఉంది.
అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ సినిమా పంజాబ్లో పెరుగుతున్న డ్రగ్ కల్చర్ నేపథ్యంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా 2వేల స్క్రీన్లలో ఇది విడుదల అవుతోంది. సినమాకు ప్రీ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయంటున్నారు. నిజానికి సెన్సార్ వివాదం వల్లే సినిమా గురించి ఎక్కువ మందికి తెలిసిందని, శుక్ర - శని వారాల షోలకు సగం టికెట్లు అయిపోయాయని సినిపోలిస్ ఇండియా డైరెక్టర్ దేవాంగ్ సంపత్ తెలిపారు. ఓపెనింగ్ రోజునే సినిమాకు కనీసం రూ. 15-20 కోట్ల వరకు రావొచ్చని సినిమా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ తడానీ చెప్పారు.