పూడికతీతకు ప్రత్యేక ప్రణాళిక
=‘చెత్త’శుద్ధికి వందరోజుల కార్యక్రమం
=రోజుకు 30 మందితో పారిశుద్ధ్య పనులు
=జోనల్ కమిషనర్ అడపాల శ్రీనివాస్
అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లిలో పారిశుద్ధ్యం మెరుగుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్టు జీవీఎంసీ అనకాపల్లి జోన్ కమిషనర్ అడపాల శ్రీనివాస్ తెలి పారు. జనవరి 25 లోగా పచ్చదనం-పరిశుభ్రతతో కూడిన అనకాపల్లిని చూపిస్తామన్నారు. ‘చెత్త’గించగలరు శీర్షికన గురువారం సాక్షిలో వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. పట్టణంలో మురుగునీటి కాలువల్లో పూడికతీతకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్నారు.
ఇరవై ఏళ్లుగా ఇక్కడ పూడిక పేరుకుపోయిందని విశ్లేషించారు. ఈ పనులకు కనీసం 100 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాల్సి ఉందన్నారు. పట్టణంలో 20 డంపర్ బిన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పారిశుద్ధ్యం మెరుగుదలకు రోజుకు 20 నుంచి 30 మందితో ప్రత్యేక డ్రైవ్‌ను చేపడతామన్నారు. 14 అంశాలతో వంద రోజుల పాటు ‘చెత్త’పై సమరానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
ఇంటింటికి చెత్త సేకరణ, పూడికతీత పనులు, ప్లాస్టిక్ వ్యర్థాలపై యుద్ధం, స్థానికులతో సమావేశాలు, కాలువల శుభ్రత, తడిచెత్తను, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే పద్ధతి, చెత్తను విసిరే స్థలాలను సుందరవనాలుగా మార్పు, దోమల నియంత్రణ, చెత్తను వేసే వారికి జరిమానా, ప్లాస్టిక్ సంచుల నిషేధం, సులభ్ కాంప్లెక్స్‌లపై ప్రచారం, హోటళ్ల పర్యవేక్షణ, మరుగుదొడ్ల ఏర్పాట్లపై పర్యవేక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.