అద్వైత: బజ్ మంటున్న అలారం శబ్దానికి?
ఎలెక్సా 4 ఎకో డాట్ 6.59 అని చూపిస్తోంది. బజ్ మంటున్న అలారం శబ్దానికి నూరు గొంతుకల్లో నుంచి మెలకువ వచ్చేసింది. తెరుచుకున్న కళ్ళు మళ్ళీ మూసుకున్నాయి. నిద్ర కూడా కొందరికి బాధే, వచ్చి పోయే పీడకలల మధ్య. మూసుకున్న కనురెప్పల తెరల వెనుక కొన్ని దృశ్యాలు మూడు ముక్కలుగా, ముక్క చెక్కలుగా.బూతు భూయిష్టమైన మాటల్ని వినలేని చెవులు, తమను తాము మూసుకోవటం చేతకాక నిస్సహాయంగా నిటారుగా నిల్చున్నాయి. చిట్లిన పెదాలు, రెండు ముక్కల రామములక్కాయ లాగా. మోకాళ్ళు ముడుచుకొని డౌన్ కంఫర్టర్లో దాక్కుంది బుజ్జి కుక్కపిల్ల లాగా. తానెవరో తనకే తెలియని ఓ ఉదయపు అజ్ఞానం. స్నూజ్లోకి వెళ్ళిన అలారం నిద్ర లేవమని మరోసారి బతిమిలాడింది.ఓపికను అరువు తెచ్చుకుంటూ సరస్వతి లేచే ప్రయత్నం చేసింది. మొద్దు బారిన కాళ్ళల్లో కొద్దిపాటి కదలిక. మైనస్ డిగ్రీల చలికి వణికిపోతూ సూర్యుడు కొంచెంగా తొంగి చూస్తున్నట్లు, కిటికీలోంచి లేత కాంతి గదిలోకి వస్తోంది. కాళ్ళకు చెక్క నేల తగలగానే, సాక్సులో నుంచి చలి పెట్టిన ముద్దుకు, కాళ్ళను మళ్ళీ పైకి లాక్కుంది. మోయలేనంత బరువుగా అనిపిస్తున్న శరీరాన్ని, బలవంతాన నిలబెట్టి పల్లవి పడక గదిలోకి వెళ్ళింది సరస్వతి.గాఢ నిద్రలో పల్లవి. పదిహేడేళ్ళ యవ్వనపు కలలన్నీ పెదాల మీద పువ్వులై పూస్తుంటే అబ్బురంగా, ఎవరో అపరిచిత వ్యక్తిని చూస్తున్నట్లు నిలబడిపోయింది. ‘ఇది నా కూతురేనా?’ ‘నా కడుపు చీల్చుకొని పుట్టినదేనా?’.. తన మీద తనకే నమ్మకం లేనట్లు ఇంకొన్ని క్షణాలు అలా ఆలోచనల్లో మునిగిపోయింది. పల్లవి క్లాస్ షెడ్యూల్ గుర్తుకొచ్చింది. కోవిడ్ పుణ్యమా అని క్లాసులు ఆన్‌లైన్‌కి మారడంతో, కూతుర్ని ఇంకాసేపు పడుకోనివ్వాలని అనిపించింది. నిద్రపోతున్న కూతుర్ని, గదిగోడల మీద ఫొటోల్ని, డెస్క్ మీదున్న మెమెంటోలను కొత్తగా చూస్తోంది. ఒక్కో ఫొటో జ్ఞాపకంగా వెలుగుతోంది. ఒక్కో మెమెంటో కూతురు సాధించిన విజయాన్ని గుర్తుచేస్తోంది.ఓ ఫొటోలో విక్రమ్‌కు, తనకు మధ్య పిల్లి పిల్ల లాగా ఒదిగి కూర్చొని నవ్వుతున్న చిన్ననాటి పల్లవిని చూస్తుంటే మరో ఆరు నెలల్లో ఫాల్ సెమిస్టరుకి కాలేజీ చదువు కోసం ఇల్లొదిలి వెళ్తుందని గుర్తురాగానే మనసు భారమైంది. ‘ఎంత మంచిది ఈ కోవిడ్! అందరిని మళ్ళీ ఇంటికి చేర్చింది. ఇంట్లో ఉండేలా, ఇంట్లో వాళ్ళతో ఉండేలా. ఇల్లు, ఇంట్లోని బంధాలు ఎంత ముఖ్యమో వైరస్ కుదుపుతో మళ్ళీ అందరికీ తెలిసి వచ్చింది.’ ఆన్లైన్ క్లాసెస్, వర్క్ ఫ్రమ్ హోమ్‌తో కూతురితో ఎక్కువ సమయం గడపగలుగుతున్న పాజిటివ్ అంశాన్ని గుర్తు చేసుకుంది సరస్వతి, థెరపిస్ట్ సూచించినట్లు. ‘బీ పాజిటివ్, బీ హోప్ ఫుల్.’ప్రయత్నిస్తోంది సరస్వతి తన శాయశక్తులా. మందులేసుకోవటానికి, మిగతా అందరి.. తల్లిలాగా ఉండేందుకు. రోజూ ఓ యుద్ధం. మందులేసుకోవటం ఓ నరకం. వేసుకోకపోతే మరో నరకం. ఇరవైఏళ్ళుగా మరింత ఎక్కువైన ఈ నరకాన్ని ఇక తట్టుకోలేననిపిస్తోంది సరస్వతికి ఏ రోజుకారోజు. ‘పల్లవే లేకపోతే.. అవును అప్పుడు తన జీవితమే మరోలా!’ఫొటోల్లో మాత్రమే మిగిలి, జీవితంలో నుంచి తప్పుకున్న విక్రమ్ వంక నిర్లిప్తంగా చూసింది సరస్వతి. అతని మీద ఆమెకు కోపం లేదు. ‘వదిలించుకున్న తల్లిదండ్రుల కంటే ఏమంత తప్పు చేశాడు?’ ‘‘కోవిడ్ ఈజ్ హిట్టింగ్ బట్ హైస్కూల్ సీనియర్ పల్లవి ఈజ్ ఏ సర్వైవర్’’ చుట్టూ ఆర్ట్ వర్క్‌తో తన డెస్క్ ఎదురుగుండా, గోడ మీద పల్లవి పిన్ చేసుకున్న పోస్టరును చూస్తూ నిలబడింది. పల్లవి ఫోన్ అలారం మోగిన శబ్దానికి ఉలికిపడ్డ సరస్వతి గుండె వేగంగా కొట్టుకుంది.కళ్ళు తెరిచిన పల్లవికి ఎదురుగా తల్లి. నిద్ర మత్తులో కూడా తల్లిని గుర్తు పట్టేసింది. అమ్మ లాగా. పల్లవి చేతులు చాపడంతో ఆప్యాయంగా కూతుర్ని హత్తుకొని పక్కన పడుకొని కళ్ళు మూసుకుంది. రెండో అలారం శబ్దానికి తప్పనిసరై ఇద్దరూ కళ్ళు విప్పి సన్నటి చిరునవ్వుతో లేచి కూర్చున్నారు. ‘ఇట్ విల్ బి ఎనదర్ గుడ్ డే’.. ఒకరికొకరు చెప్పుకున్నారు, గట్టి నమ్మకంతో. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం సరస్వతి, ఆన్లైన్ క్లాసుకి పల్లవి ఇద్దరూ సిద్ధమయ్యారు. ఇంట్లో ఆఫీసు పని చేస్తుంటే, ఒక్కోసారి ఇంటి జ్ఞాపకాలు ఆఫీసు రూమును గిరగిరా తిప్పేస్తాయి. కొన్ని జ్ఞాపకాలు దుఃఖాన్ని మళ్ళీ మళ్ళీ రగిలిస్తాయి ఆరనిమంట లాగా! ఎవరి గదుల్లో, ఎవరి ప్రపంచంలో, ఎవరి బాధల్లో వాళ్ళు. ఎవరి ఒత్తిళ్ళు, చికాకుల్లో వాళ్ళు. కొన్ని సమస్యలు వ్యక్తిగతమే! కొన్ని కుటుంబానివి, మరి కొన్ని సమాజానివి కూడా. అందరి కథలకు కాలం సాక్ష్యం. కొందరి జీవితాల్ని తన కడుపులో కాలం రహస్యంగా దాచుకుంటుంది, సమయం వచ్చేవరకు!పల్లవి పుట్టగానే బర్త్ సర్టిఫికేట్ కోసం ఆస్పత్రిలో పేరు రాయించారు. పదమూడో రోజు బాలింత స్నానం చేయించి, పురోహితుడు వచ్చేలోగా పసి గుడ్డును, సరస్వతిని ఇద్దరినీ తయారు చేసేందుకు తల్లి లక్ష్మీదేవమ్మ నానా హడావిడి పడుతోంది. పచ్చి బాలింత వొళ్ళు, ఆ పైన తలంటు స్నానం సరస్వతికి కళ్ళు మూతలు పడిపోతున్నాయి. సరస్వతి పాలు కుడుపుతున్నా పసిదాని ఏడుపు ఆగటం లేదు. విక్రమ్ చేయగలిగిన సహాయం చేస్తూ, ఇండియాలోని తల్లి తండ్రుల కోసం బారసాల లైవ్‌లో చూపించటానికి ఐపాడ్ సిద్ధం చేశాడు.ముగ్గురు స్నేహితులు కుటుంబసమేతంగా ఆ వేడుక చూడటానికి వచ్చారు. సరస్వతికి ఊపిరాడటం లేదు. చీకి చీకి పాలు తాగుతూ కూడా ఏడుస్తున్న పసిగుడ్డును చూస్తే ఆ నోరు నొక్కేయాలని పిస్తోంది. కార్యక్రమానికి కావాల్సిన సంబారాలన్నీ సిద్ధం చేస్తోంది లక్ష్మీదేవమ్మ. సహాయం చేస్తామని అందరూ కిచెన్‌లోకి వచ్చేస్తుండటంతో అక్కడంతా గందరగోళంగా వుంది. బారసాలతో పాటు సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నారు. పురోహితుడు చదివే మంత్రాలు, చెప్పే వ్యాఖ్యానాలు ఏవీ సరస్వతి బుర్రలోకి ఎక్కటం లేదు. ఒడిలో ఉన్న పాపను, ఒంటి మీదున్న చీరను గిరాటేసి మంచం మీద వాలిపోవాలని ఉంది.ఏవేవో పలకరింపులు. మాటలు.. ఏమీ అర్థం కావటం లేదు. తనెవరో తనకు తెలియనట్లు ముభావంగా, అభావంగా, నిస్తేజంగా, నిర్లిప్తంగా కూర్చుంది సరస్వతి. అయోమయంగా ఉన్న భార్య వంక చూసి, పాపం అలసిపోయిందనుకున్నాడు విక్రమ్. సరస్వతి చెయ్యి పట్టుకొని కార్యక్రమం నడిపించారు. కార్యక్రమం పూర్తి కాగానే పాపకు పాలివ్వటానికని బెడ్రూమ్లోకి వెళ్ళిన సరస్వతి మళ్ళీ బయటకు రాలేదు. పిల్లదాని ఏడుపు అంతకంతకూ పెద్దగా బయటకు వినిపిస్తుంటే, గదిలోకి వెళ్ళిన విక్రమ్ కళ్ళకు మంచానికి అడ్డంగా పడుకొని నిద్రపోతున్న భార్య కనిపించింది.పిల్లను చేతుల్లోకి తీసుకొని సముదాయిస్తూ, భార్యను లేపాడు. లక్ష్మీదేవమ్మ కూడా వచ్చి కూతుర్ని లేపేందుకు ప్రయత్నించింది. బలవంతాన కళ్ళు తెరిచిన సరస్వతి మొహం ఉగ్రంగా, భయానకంగా. ఎరుపెక్కిన కళ్ళతో సూటిగా వాళ్ళను చూసింది. ఆ చూపుకు విక్రమ్ అప్రయత్నంగానే రెండడుగులు వెనక్కేశాడు, పసిగుడ్డును గుండెకు హత్తుకుంటూ. లక్ష్మీదేవమ్మ కూతురు పక్కన కూర్చొని, ‘సరూ, పాపకు పాలు ఇవ్వాలమ్మా’ నెమ్మదిగా చెపుతూ అల్లుడి చేతుల్లో నుంచి పసిదాన్ని అందుకుంది.సరస్వతి పాపను అందుకోలేదు. విక్రమ్కేమీ అర్థంకాక అత్తమ్మ వంక చూశాడు. ఆమె కళ్ళు దించుకుంది. కూతుర్ని పట్టి కుదుపుతూ, ఆమె జాకెట్టు గుండీలని విప్పే ప్రయత్నం చేసింది. తల్లి చెంప మీద ఛెళ్ళున కొట్టి మళ్ళీ దుప్పటి లాక్కొని పడుకుండిపోయింది సరస్వతి. ఏం జరిగిందో అర్థమై, కానట్లు లక్ష్మీదేవమ్మ పిల్లదానితో సహా ఆ గది నుండి బయటకు వచ్చి, ఫార్ములా కలిపి బాటిల్లో పోసి పిల్లకు పాలు పట్టింది. ఒడిలో పడుకొని ఆత్రంగా పాలు తాగుతున్న పసి గుడ్డుని చూసి లక్ష్మీ దేవమ్మ కళ్ళల్లో నీళ్ళు.కొన్నేళ్ళ పాటు ఎలాంటి ఎపిసోడ్లు లేని కూతురు జీవితం ఇప్పుడెటు మళ్ళుతుందో, ఈ చిన్నదాని జీవితం ఎలా ఉంటుందోనన్న ఆలోచనలు ఆమెలో సుళ్ళు తిరుగుతున్నాయి. అత్తమ్మ మొహంలోని ఆందోళన విక్రమ్‌కు చెప్పకనే ఏదో చెప్పినట్లనిపించింది. ‘అమ్మాయికి పాలు రావటం లేదు. అంతే. బాలింతలకు కొద్దిసార్లు ఇలాగే వుంటుంది’ అత్తమ్మ మాటలకు తలూపాడు విక్రమ్.ఆ పగటికి సరికొత్త మొహం ఆ రాత్రి. మంచి నిద్రలో తనపైన ఎవరో ఉండటంతో హఠాత్తుగా మెలకువ వచ్చింది విక్రమ్‌కి. అతని మీద ఆమె. సరస్వతిని చూసి బిత్తరపోతూ లేవబోయాడు. అతడ్ని లేవనివ్వలేదు. పొద్దుట భయపెట్టిన సరూ రాత్రి ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా, అమాయకమైన మొహంతో. ఆమె ఏం చేస్తోందో అతనికి తెలుస్తోంది. ఆమె స్పర్శ కొత్తగా. ఆమె ప్రవర్తన కూడా. అతని శరీరం ఆమెకు స్పందిస్తోంది. కానీ ఏదో తెలియని భయం. పక్కన పాప కోసం చూశాడు. కనిపించలేదు. విక్రమ్ ఆందోళన చూసి క్రిబ్ వంక చూపించింది. గాఢంగా, తీవ్రంగా ఇద్దరూ అల్లుకుపోయారు. విక్రమ్‌కు ‘ఆ రాత్రి సరస్వతి’ నచ్చింది.ఆ ‘రాత్రి సరస్వతి’కి విక్రమ్ పెట్టుకున్న పేరు సంపెంగ. తనకు తెలిసిన తన భార్య సరూ కంటే, కొత్తరూపు దాల్చిన సంపెంగనే అతనికి బాగా నచ్చింది. ఉదయం భార్యను చూసి ఆందోళన చెందిన విక్రమ్ మనసు కుదుటపడింది. నిశ్చింతగా అనిపించింది. పక్కకు తిరిగి మాట్లాడబోయిన విక్రమ్, అప్పటికే గాఢనిద్రలోకి జారుకున్న తన సంపెంగ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు.విక్రమ్ ఇంట్లోకి రాగానే, హాల్లో కూర్చొని హోమ్‌వర్క్ చేసుకుంటున్న పల్లవి కనిపించింది. పల్లవి పక్కనే తిని పడేసిన చాక్లెట్ రాపర్స్, సగం తిని వదిలేసిన సీరీయల్ చూడగానే పరిస్థితి అర్థమైంది. ఆరేళ్ళ పిల్లకు తల్లి ప్రేమ, ఆదరణ సంగతి అటుంచి కనీసం సమయానికి తిండి కూడా దొరకటం లేదని బాధ తన్నుకొచ్చింది.‘ఆకలేస్తోందా తల్లీ?’ తలూపింది పల్లవి. ఆకలితో వాడిపోయిన ఆ పసిదాని మొహం, ‘నేనేం పాపం చేశా?’నని నిలదీస్తున్నట్లనిపించింది అతనికి. ఫ్రిజ్‌లో నుంచి అన్నం, పప్పు, గోంగూర పచ్చడి ప్లేట్లో పెట్టి మైక్రోవేవ్‌లో వేడి చేసి కూతురికిచ్చాడు. ఆవురావురుమని అన్నం తింటున్న కూతుర్ని చూసి విక్రమ్ కళ్ళమ్మట నీళ్ళు. కోపమొచ్చింది. సరస్వతి మీద, ఆమె తల్లిదండ్రుల మీద, తన జీవితాన్ని నాశనం చేసినందుకు. సరస్వతి కోసం వెతుకుతూ వెళితే, కింద బేస్మెంట్లో ఒంటరిగా కూర్చొని ఉంది ఎటో దిక్కులు చూస్తూ. తన్నుకొచ్చిన కోపాన్ని తమాయించుకున్నాడు. చికాకు, కోపం, అసహనం, తగువులు, కేకలు వీటివల్ల లాభం లేదని పల్లవి పుట్టిన దగ్గర నుంచి అర్థమవుతూనే ఉంది విక్రమ్‌కు.‘సరూ, పైకి రా. పల్లవికి ఆకలేస్తోంది పాపం’ తెచ్చి పెట్టుకున్న మృదుత్వంతో మాట్లాడుతున్న విక్రమ్ గొంతు ఆమెకు చేరలేదు. కళ్ళెత్తి భర్త వంక చూసింది నువ్వెవరన్నట్లు? తల తిప్పేసుకుంది అతన్ని చూడటం ఇష్టం లేదన్నట్లు. అతనెవరో తెలియదన్నట్లు. నెమ్మదిగా సరస్వతి మీద చెయ్యి వేశాడు. పైకి తీసుకెళ్లటానికి. ఛెళ్ళున చెంప మీద కొట్టి ఏమీ ఎరగనట్లు శూన్యంలోకి చూస్తుండి పోయింది.‘మాత్రలేసుకున్నావా?’ సరస్వతి నుంచి యే సమాధానం రాలేదు. ‘సరూ, పద. పైకెళదాం. టీ చేస్తా’ మృదువుగా మాట్లాడుతూ చెయ్యి పట్టుకొని ఆమెను పైకి తీసుకొచ్చాడు. క్షణం క్రితం అతడిని కొట్టిన ఆమె, మళ్ళీ పసిపిల్లలా అతని వెంట యే గొడవ చేయకుండా వచ్చింది.సరస్వతిని సోఫాలో కూర్చోబెట్టి టీ చేయటానికి వంటింట్లోకెళ్ళాడు విక్రమ్. కిచెన్‌లో నుంచి హాల్లోని వాళ్ళిద్దరినీ గమనిస్తూనే స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు, టీ పొడి, ఎండిన లెమన్ గ్రాస్, ఏలక్కాయ పొడివేసి తెర్లుతున్న నీళ్ళను చూస్తూ నిలబడ్డాడు. సరస్వతి ద్వంద్వ ప్రవృత్తి, తరచూ మారిపోయే ఉద్వేగాలు, ఒక్కోసారి హింసాత్మకంగా, ఉద్రిక్తంగా మారిపోయే ఆమె ప్రవర్తన, పల్లవి పట్ల నిరాదరణ ఇవన్నీ అతనిలో తెర్లుతున్నాయి. తెల్లటి నీళ్ళు నల్లటి డికాక్షన్, ఏలకుల వాసనతో.పల్లవి అరిచిన అరుపులకు విక్రమ్ ఉలిక్కిపడి చూసి పరుగెత్తాడు హాల్లోకి. డికాక్షన్ పొంగి, బర్నర్ ఆరిపోయింది. నోటుబుక్కుని చింపేస్తున్న తల్లి నుంచి పుస్తకంలాగే ప్రయత్నం చేసి విఫలమై దూరంగా జరిగి ఏడవటం మొదలెట్టింది పల్లవి. పరుగున వచ్చిన విక్రమ్, సరస్వతి నుంచి బలవంతాన పుస్తకాన్ని లాక్కోగలిగాడు. మొండి బలంతో చేతులు బిగించి తనను గుద్దుతుంటే, చేతులు అడ్డం పెట్టుకొని ఆమెని ఆపటానికి ప్రయత్నించాడు. కొంచెం ధైర్యం తెచ్చుకొని తల్లిని లాగే ప్రయత్నం చేసినందుకు, పల్లవిని కూడా కొట్టసాగింది.‘సింకు కింద ఏమైనా వుంటే పట్టుకురా’ సరస్వతిని గట్టిగా అదిమిపట్టుకున్నాడు. పల్లవి తెచ్చిన వైరుతో ఇద్దరూ కలిసి సరస్వతి చేతులు కట్టేశారు. వాళ్ళు ఆమెను ఆపుతున్న కొద్దీ ఆమె మరింత రెచ్చిపోయింది. పళ్ళు గట్టిగా కొరుకుతూ, బూతులు మాట్లాడుతూ, కాళ్ళు చేతులూ విదిలిస్తూ. ‘ఇది అమ్మ కాదు, మాన్స్టర్’ ఆ భూతాన్ని చూడలేనట్లు భయంతో, బాధతో కళ్ళు మూసుకుంది పల్లవి.ఇదంతా అలవాటైనట్లే ఉంటుంది. ప్రతిసారి కొత్తగానూ ఉంటుంది పల్లవికి. ‘అమ్మకు ఎందుకిలా?’మెడిసిన్ కిట్‌లో నుంచి పల్లవి తెచ్చిచ్చిన మాత్రను సరస్వతి చేత బలవంతాన మింగించి అలసటతో కూలబడ్డాడు విక్రమ్. కొద్ది క్షణాల్లో సరస్వతి నేల మీద ఒరిగి పోయింది మత్తులోకి జారిపోతూ. సరస్వతి చేత అత్యవసర పరిస్థితుల్లో మిగించే ఆ మాత్ర మనిషి కన్నా బలమైనది. ఆలోచనని, ఆగ్రహాన్ని నిర్జీవం చేయగలిగేంత శక్తివంతమైనది. తండ్రి పక్కనుంటే ధైర్యంగానే ఉన్నట్లనిపిస్తున్నా, పల్లవికి గుండె దడ తగ్గలేదు. ఎన్నోసార్లు,‘అమ్మకు బాగైపోతుందని’ ధైర్యం చెప్పిన విక్రమ్, ఇప్పుడిక అది కూడా చేయలేనట్లు నిస్సహాయంగా, నిస్సత్తువుగా తల పట్టుకొని కూర్చుండిపోయాడు ఇంకేమీ చేయలేనట్లు.‘నువ్వు నాతో వచ్చేయి బంగారు’ తండ్రి మాటలకు రాలేనన్నట్లు తలూపింది పదమూడేళ్ళ పల్లవి. ‘అమ్మకున్నది ఈ మానసికరోగం కాకుండా క్యాన్సర్ అయితే ఇలాగే చేసేవాడివా?’ కూతురు సూటిగా ప్రశ్నించేసరికి దెబ్బతిన్నట్లు చూశాడు విక్రమ్.‘పదమూడేళ్ళుగా మీ అమ్మ మూడ్ స్వింగ్స్‌తో మనం పడ్డ నరకయాతన పగవాడికి కూడా వద్దు తల్లీ. థెరపీ సెషన్స్, మందులు వీటితో ఒక రోజు బాగున్నట్లే ఉన్నా, మీ అమ్మకు పూర్తిగా నయమవుతుందన్న నమ్మకం చచ్చిపోయింది. ఎప్పుడెలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో, ఏరోజు విపరీతంగా పనిచేస్తుందో, ఏరోజు పక్క మీద నుంచి కూడా లేవదో తెలియదు. ఇన్నేళ్ళు నేచేయగలిగింది చేశా. ఇక నావల్ల కాదు. నాకు నా జీవితం కావాలి. ఈ కొత్త జీవితంలో నువ్వుండాలనుకోవటం కూడా తప్పేనా బంగారు?’ అతని కంఠంలో నిజాయితీతో కూడిన బాధ.‘అమ్మను నువ్వెంతలా చూసుకున్నావో తెలుసు డాడీ. కానీ పాపం అమ్మ! తనకు తెలియదు కదా తానేం చేసేది? మనిద్దరం వదిలెళ్ళిపోవటం క్రూయల్ డాడీ. మనం వదిలేస్తే అమ్మ రోగం ఎక్కువవుతుంది కానీ తగ్గుతుందా? అవసరమైతే రీహేబ్ సెంటర్లో చేర్పిద్దాం. అయినా ఇప్పుడు మందులేసుకుంటోంది కదా. అమ్మకు బాగైపోతుంది’ పల్లవి కంఠం రుద్ధమైంది.వయసుకు మించి ఎదిగిపోయిన కూతుర్ని చూస్తే అతనిలో చెప్పుకోలేని బాధ. ఆ పిల్ల పసితనాన్ని, అమాయకత్వాన్ని, ఆనందాన్ని అన్నింటినీ మింగేసిన సరస్వతి మీద చెప్పలేనంత కోపం. మళ్ళీ అంతలోనే ఆమె మీద సానుభూతి కూడా. కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు విక్రమ్.‘మీ అమ్మకు పెళ్లికి ముందు నుంచీ ఈ సైకోటిక్ మూడ్ డిసార్డర్ ఉన్నప్పుడు వాళ్ళు పెళ్లి చేయకుండా ఉండాల్సింది..’ ‘తగ్గిపోయిన రోగం డెలివరీ టైమ్‌లో తిరగబెట్టిందన్నది కదా .. నేను పుట్టకుండా వుంటే అమ్మ బావుండేదేమో!’ ‘ఈ పెళ్లి వల్ల జరిగిన మంచి ఏదైనా ఉంటే అది నువ్వే బంగారు. నీ కోసమైనా ఇక నుంచి అమ్మ మందులు క్రమం తప్పకుండా వేసుకుంటుందేమో?’‘అందుకే డాడీ, నేను అమ్మతోనే ఉంటా. నువ్వుండేది ఊర్లోనే కదా. వారంవారం వస్తాగా నీ దగ్గరకు’ తండ్రి కళ్ళల్లో నీళ్ళు చూసి పల్లవికి కూడా ఏడుపు ఆగలేదు. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఏడ్చేశారు. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో సరస్వతి క్రమం తప్పకుండా మందులేసుకోవటం మొదలెట్టింది. తల్లీ కూతుళ్ళు కొత్త జీవితం మొదలెట్టారు. నాలుగేళ్ళు గడిచిపోయాయి చూస్తుండగానే. తల్లి మూడ్ స్వింగ్స్ పరిణామాల్ని ఒక్కర్తే తట్టుకొని నిలబడింది. యేరోజు ఎలావుంటుందో తెలియని అనిశ్చితి నుంచి పారిపోవాలని ఎన్నోసార్లు అనిపించినా, మునిపంటితో భరించింది తండ్రికి చెప్పినట్లు. తల్లికి తల్లిగా మారింది పల్లవి. పల్లవికిప్పుడు పదిహేడేళ్ళు. తల్లికి దూరంగా కాలేజీకి వెళ్లటం గురించి మొదట్లో కొంచెం భయపడినా, ఈ మధ్య కాలంలో ఎలాంటి ఎపిసోడ్లు లేకపోవటంతో, తల్లికి నయమైపోయిందని భ్రమపడింది. మందులేసుకుంటే తనకెలా వుంటుందో కూతురికెప్పుడూ తెలియనివ్వలేదు సరస్వతి. గత కొద్దికాలంగా తల్లి మందులు మానేసిన సంగతి పల్లవి గ్రహించలేకపోయింది. సరస్వతి ప్రవర్తన ఆమెకు అంతా బాగయిపోయినట్లే ఉంది.‘అతను నిన్ను చీట్ చేస్తున్నాడు. అతని మీద పగ తీర్చుకో!’‘అది నీకూతురు కాదు. దానికి పుట్టిన కూతురు.’‘చంపేయి, వాళ్ళంతా దుర్మార్గులు.’‘ఎర్రటి రక్తం తాగు!?’చెవుల్లో వినిపిస్తున్న మాటల్ని వినలేక చెవుల్నే కోసేసుకోవాలని ఉంది సరస్వతికి. మెదడు ఏదేదో చెప్తోంది. మనసు ఏదేదో అంటోంది. తనెవరో, తన పేరేమిటో కూడా తెలియకుండా పోతోంది ఒక్కోసారి ఆమెకు. మందులేసుకుంటే నిద్ర నిద్ర నిద్ర. ఉద్యోగం చేయకపోతే, పల్లవి చదువెలాగా? ఏవేవో ఆలోచనలు సరస్వతిని ఊపిరాడకుండా చేస్తున్నాయి. మందులేసుకోవాలని వుంది పల్లవి కోసం. కానీ ఈ నరకం వద్దు. నేను లేకపోతే పల్లవికి ఎలా? విక్రమ్ నమ్మకద్రోహి. నన్ను వదిలిపెట్టినట్లే, దాన్ని కూడా వదిలేస్తాడు అవకాశం వచ్చినప్పుడు. పల్లవిని రక్షించాలి, కాపాడాలి.తనతో తాను యుద్ధం. ఒక్కోసారి ఓటమి, ఒక్కోసారి గెలుపు. ఎవరెవరో వచ్చి వెళ్లిపోతున్నారు. ఏవేవో చెప్తున్నారు. ఒళ్ళు రగిలిపోతోంది. చావాలనిపిస్తోంది. చంపేయాలనిపిస్తోంది.ఒకే మనిషి.. వేర్వేరు ముఖాలు. అనేక జీవితాలు. అందరూ బద్ధశత్రువుల్లాగా కనిపిస్తున్నారు. శరీరంతో పెనుగులాట. మాటల్లో, ఆలోచనల్లో హింస. ఏవేవో మాటలు. ఎవరెవరివో గొంతుకలు. ఎవరెవరో వచ్చేస్తున్నారు. కళ్ళ ముందు రకరకాల మనుషులు. కళ్ళు మూసుకోవాలంటే భయం. నిద్ర పోవాలంటే భయం. మెలకువగా ఉండాలంటే భయం. రావద్దని వాళ్ళను బతిమిలాడుతోంది. బెదిరిస్తోంది. భయపెడుతోంది. సరస్వతిని వాళ్ళు ఆక్రమించుకున్నారు.వాళ్ళా? నేనా? ఓడిపోకూడదు వాళ్ళ చేతిలో. నే గెలవాలి. గెలిచి తీరాలి. వీళ్ళందరి నుంచి పల్లవిని కాపాడాలి? ఎలా? ఏం చేయాలి? నిరంతరం అదే ఆలోచన సరస్వతిలో. ఎదురుగా నిల్చున్న ఆమెను చూస్తూనే సరస్వతి కళ్ళు కోపాన్ని వర్షించాయి. విక్రమ్ పక్కన ఆమెను చూడగానే కోపం, అసూయ, ద్వేషం. అతనామెను ముద్దుపెట్టుకుంటున్నాడు. సరస్వతి మనసు రగిలిపోతోంది. విక్రమ్ కొత్త పెళ్ళాం భళ్ళున ఆకాశం బద్దలయ్యేలా నవ్వుతోంది.డైరెక్షన్స్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్న సరస్వతి సరిగ్గా ఫైర్ ఆర్మ్స్ షాపు ముందు ఆగింది. ఆమె మొహంలో ప్రశాంతతతో పాటు చిన్నపాటి ఉత్సాహం.తలుపు తీయగానే గంట శబ్దం రావటంతో కౌంటర్ దగ్గరున్న వ్యక్తి తలతిప్పి చూశాడు. కురచగా ఉండటంతో వున్నదాని కంటే లావుగా కనిపిస్తోంది ఆమె. బీఎమ్‌డబ్ల్యూ కారు. గూచీ బ్యాగ్, ఖరీదైన కూలింగ్ గ్లాసెస్ ఆమె ఆర్థిక స్థోమతను చెప్తుంటే, ఆమె రూపు రేఖలను బట్టి ఏషియన్ అని అతనికి అర్థమైంది. వ్యాపారంలో ఎవరనేది లెక్క కాదు, ఎంతనేది మాత్రమే ముఖ్యం. ఆ ఊర్లో అదో పెద్ద ఫైర్ ఆర్మ్స్ స్టోర్. గోడల మీద పెద్ద పెద్ద పొడవాటి తుపాకులున్నాయి. చిన్నగా, చేతిలో ఇమిడిపోయే పిస్టల్స్ వంటివి అద్దాల కింద దాక్కొని తమ కోసం ఎవరొస్తారోనని ఎదురుచూస్తున్నాయి.‘కెన్ ఐ హెల్ప్ యు?’తనకు కావాల్సిన మోడల్ ధీమాగా చెప్పింది సరస్వతి. ఆ మోడల్ ఉన్న కౌంటర్ దగ్గరకు తీసుకెళ్ళాడు సేల్స్‌మన్. అదే కౌంటర్ దగ్గర మరో ఇద్దరు మగవాళ్ళు కూడా నిలబడి రకరకాల మోడల్స్‌ను పరీక్షిస్తున్నారు.సరస్వతి అడిగిన పిస్టల్ని తీసి సేల్స్‌మన్ చేతిలో పట్టుకొని చూపించి ఆమె చేతికిచ్చాడు. మొదటిసారి పిస్టల్ పట్టుకోగానే ఏదో తెలియని ఉత్తేజం ఆమె అరచేతిలో ఇమిడిపోయినట్లు అనిపించింది. ఓ శక్తిని పట్టుకున్నట్లు. వెయ్యేనుగుల బలం వచ్చినట్లు. రెండు చేతుల్లోకి మార్చి మార్చి చూసింది. సేల్స్‌మన్‌కు తెలియలేదు, ఆమెకు అనుభవం ఉందా? లేదా? అనేది.రెండు క్షణాలు ఆమెను ఆ తుపాకీతో ఆడుకొనిచ్చి బుల్లెట్ ఎక్కడ పెట్టాలో, ఎలా పెట్టాలో, ఎలా తీసి జాగ్రత్త చేయాలో అన్నీ చూపించాడు. అర్థమైనట్లు ఆమె తలూపింది. చేతిలోకి మళ్ళీ తుపాకిని తీసుకొని కుడివైపు తిరిగి షూట్ చేస్తున్నట్లు చేసి చూసుకుంది. సేల్స్‌మన్‌కి తన మొబైల్ ఇచ్చి ఫొటో తీయమంది. అప్పుడర్థమైంది ఇదామె మొదటి తుపాకీ అని. ‘కంగ్రాట్స్, వెల్కమ్ టు రియల్ వరల్డ్’ అంటూ ఆమె అంగీకారం కోసం చూశాడు. ఆమె తల ఊపడంతో బిల్లింగ్ కౌంటర్ వైపు చూపించాడు.ఆమె దగ్గర డ్రైవర్ లైసెన్స్ తీసుకొని ఒక పుస్తకంలో ఆమె పేరు, అడ్రస్, హేండ్ గన్ వివరాలు రాశాడు. క్రెడిట్ కార్డుతో పే చేశాక ఆమె చేతికి గ్లాక్(ఎ ౌఛిజు) 19 సెమీ ఆటోమేటిక్ పిస్టల్, 9 మిమి బుల్లెట్స్ జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇచ్చాడు. ఆడవాళ్ళు ఒంటరిగా వచ్చి తుపాకీలు కొనడం ఆ షాపులోని వాళ్ళకు కొత్త కాదు. కానీ ఓ భారతీయురాలు ఒంటరిగా వచ్చి పిస్టల్ కొనడం అతని షాపులో ఎప్పుడూ జరగకపోవటంతో అతను కొంత వింతగా చూశాడు.ఆమె వెళ్లిపోయాక సేల్స్‌మన్, షాపు ఓనర్ ఆమె గురించి కొంత మొరటు హాస్యంతో మాట్లాడుకొని ఆ తర్వాత మర్చిపోయారు. కానీ రెండు వారాల తర్వాత ఆమె గురించి, ఆమె కొన్న షాట్ గన్ గురించి పోలీసులొచ్చి అడుగుతూ ఏం జరిగిందో చెప్పినప్పుడు కానీ వాళ్ళకు పూర్తి వివరాలు తెలియలేదు. అక్కడ ఆ ఇంట్లో పల్లవి గది గోడ మీద పోస్టర్ జాలిగా చూస్తోంది, రక్తపు చారికలతో! – కల్పనా రెంటాలఇవి చదవండి: మనల్ని నాశనం చేయడానికి ప్రతి ఇంట్లో బోన్లు పెట్టి..