స్త్రీ నిధి రుణాలను సద్వినియోగం చేసుకోండి
- జిల్లాలో ఈ ఏడాది రూ.187 కోట్ల లక్ష్యం
- జిల్లా స్త్రీ నిధి ఎజియం అనంతకిషోర్
పెద్దశంకరంపేట: సోమవారం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఐకెపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో స్త్రీ నిధి ద్వారా రూ.187 కోట్ల ల క్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. స్త్రీ నిధి ద్వారా పేట మండలంలో 4 కోట్లు ఈ ఏడాది అందిస్తామన్నారు. రాష్ట్రంలో మెదక్ జిల్లా రికవరీతో పాటు రుణాలు అందించడంలో ప్రథమస్థానంలో ఉందన్నారు. స్త్రీ నిధి ద్వారా రూ. 25 వేల నుండి 50 వేల వరకు మైక్రో, 50 వేలకు పైగా టైనీలోన్లు అందిస్తామన్నారు. మహిళా సంఘాల్లోని సభ్యులకు డెయిరీ ద్వారా రుణాలు అందించి పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామన్నారు. స్త్రీ నిధిలో ఇన్సూరెన్స్‌ను మహిళలు చేయించుకోవాలన్నారు. జిల్లాలో 30 మండలాల్లో 100 శాతం రికవరీ ఉందని, ఇందులో పేట మండలం కూడా ఉందన్నారు. గత ఏడాది 3 వేల బర్లను స్త్రీ నిధి ద్వారా అందించినట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు గొర్రెలు, మేకల పెంపకానికి రుణాలు అందిస్తామన్నారు. పశువులకు తప్పనిసరిగా భీమా చేయించుకోవాలని ఆయన సూచించారు.