ఎస్సీలకు రూ.25 కోట్ల రుణాలు
విశాఖపట్నం : జిల్లాలో ఈ ఏడాది ఎస్సీలకు రూ.25కోట్ల రుణాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అహ్మద్ సలీంఖాన్ వెల్లడించారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని సంస్థ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణాల మంజూరుకు త్వరలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
గతేడాది రూ.12కోట్ల రుణాలిచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినా కొన్ని కారణాలతో రుణాలు ఇవ్వలేదన్నారు. అప్పట్లో 643 దరఖాస్తులు రాగా, 107 మందికి ప్రభుత్వం ఇప్పటికే రాయితీ మంజూరు చేసిందన్నారు. వీరందరికీ త్వరలోనే బ్యాంకులు రుణాలు మంజూరవుతాయన్నారు. ఈ ఏడాది నుంచి రుణపరిమితిని రూ.2 నుంచి రూ.5లక్షలకు పెంచినట్టు తెలిపారు. ఇందులో రూ.2లక్షలు రాయితీ, రూ.3లక్షలు బ్యాంక్ రుణంగా ఉంటుందన్నారు. లబ్ధిదారుడు వాటాగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
భూ కొనుగోలు పథకంలో నిరుపేద ఎస్సీలకు భూములు కేటాయిస్తామన్నారు. డ్వాక్రా సంఘాల మాదిరి ఎస్సీ పురుష, మహిళా సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు ఇస్తామన్నారు. మైనింగ్, ఎగుమతులు, దిగుమతులకు కూడా రుణాలు ఇవ్వనున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో నిధుల కొరత వల్లే ఎస్సీ యువతీయువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు అమలు చేయలేకపోయామని ఒక ప్రశ్నకు సమాధానగా చెప్పారు. కార్పొరేషన్ రుణాల మంజూరులో అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ప్రభుత్వం విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేసిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ పరిపాలనాధికారి బివి రమణ,ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.