రూ.కోటి కుంభకోణంపై విచారణ
విచారణాధికారిగా ఏసీ అజయ్‌కిషోర్
10 రోజుల్లో ఆర్డీకి పూర్తి స్థాయి నివేదిక
అధికారుల గుండెల్లో దడ
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: చిత్తూరు కార్పొరేషన్‌లోని ప్రజారోగ్య విభాగంలో కోటి రూపాయల కుంభకోణాన్ని వెలికితీసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ ముందుకు వచ్చింది. దీనిపై విచారణ అధికారిగా అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) అజయ్కిషోర్ను నియమిస్తూ మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ మురళికృష్ణ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను కమిషనర్ రాజేంద్రప్రసాద్ బుధవారం ఏసీకి అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య విభాగంలో అక్రమాలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఆ వివరాల ఆధారంగా ప్రాథమిక నివేదిక తయారు చేసి ఆర్డీకి అందజేశానన్నారు. దాదాపు కోటి రూపాయలకుపైగా కుంభంకోణం జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ అధికారిగా ఏసీని నియమించాలని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయని చెప్పారు. దీనిపై నివేదిక తయారు చేసి 10 రోజుల్లో ఆర్డీకి సమర్పించాలని కమిషనర్ ఏసీని ఆదేశించారు.
ఏ అంశాలపై విచారణ...?
ప్రజారోగ్య విభాగంలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల నుంచి చొప్పులు కొనుగోలు వరకూ అన్ని అంశాలపై విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 168 మంది పారిశుద్ధ్య కార్మికులు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారు.
అయితే రికార్డుల్లో మాత్రం 206 మంది పనిచేస్తున్నట్టు చూపుతున్నారు. 38 మందిని ఎందుకు అదనంగా చూపుతున్నారు. వీరి జీతాలు ఎవరికి చేరుతున్నాయి. 206 మంది పీఎఫ్ నిధులు ఏమయ్యాయి. కాంట్రాక్టు పద్ధతిపై తీసుకునే పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశారు. ఇలా అన్ని కోణాలపై విచారణ చేపట్టనున్నారు.
అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులకు నెల నెలా ఇచ్చే నూనె, సబ్బులు, యూనిఫారం, చెప్పులు, గ్లౌసులు ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారు. వాటిలో నాణ్యత ఎంత, ఎంతకు కొనుగోలు చేశారు. ఎంత మొత్తానికి బిల్లులు సమర్పించారు. అసలు కొనుగోలు చేశారా లేదా? ఎన్ని సార్లు నూనె, సబ్బులు ఇచ్చారు. వీటిలో ఎంత కోత పెట్టారు. పారలు, చీపుర్లు, కంపోస్టు యార్డులో నిర్వహణ నిధులు దుర్వినియోగం, చెత్త విక్రయాల్లో చేతివాటం, ఇలా ఒకటి కాదు.. రెండు కాదు విచారణలో పలు అంశాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.
అధికారుల గుండెల్లో దడ
ప్రజారోగ్య విభాగంలో అక్రమాలపై విచారణకు ఆదేశించడంతో ఈ విభాగంలో పనిచేసిన, పనిచేస్తున్న అధికారుల గుండెల్లో దడ మొదలైంది. విచారణలో నిజానిజాలు తేలితే ఎవరపై వేటు పడుదుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. కొనేళ్లుగా ఈ విభాగంలో పనిచేసి (రెగ్యులర్/ఇన్చార్జి) అధికారుల నుంచి ప్రస్తుతం ప్రజారోగ్య అధికారి శ్రీనివాసరావు హయాంలో చేపట్టిన పనులపై విచారణ చేపట్టాలని ఉత్తర్వులో పేర్కొనడంతో బదిలీ అయిన అధికారులను సైతం విచారించే అవకాళం ఉంది.