వారిని నమ్మి మోసపోవద్దు ...
{పైవేట్ టూర్ ఆపరేటర్ల నుంచి తప్పక రశీదు తీసుకోవాలి
హజ్‌యాత్రికులకు ఏకే ఖాన్ సూచన
సిటీబ్యూరో: హజ్‌యాత్ర వెళ్లేవారు ప్రైవేట్ ఆపరేటర్లను నమ్మి మోసపోవద్దని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ జనరల్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ పథకాల అమలు కమిటీ చైర్మన్ ఏకేఖాన్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన హజ్‌హౌస్‌లో రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ‘హజ్‌యాత్ర-2016’ దరఖాస్తులను విడుదల చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. హజ్ కమిటీ ద్వారా ఎంపిక కాని వారు ప్రైవేట్ టూర్ ఆపరేటర్లను ఆశ్రయించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ ఆపరేటర్ల చేతిలో మోసపోయినట్టు ప్రతీ సంవత్సరం వందలాది కుటుంబాలు మోసపోయినట్టు ఫిర్యాదులు వస్తున్నా..సరైన ఆధారాలు లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడంలేదన్నారు. ప్రైవేట్ టూర్ ఆపరేటర్లను ఆశ్రయించే ముందు ఆ సంస్థ గురించి ఆరా తీయడంతో పాటు హజ్ కోటా కేటాయింపు, ఏర్పాట్లు తదితర విషయాలు పూర్తిగా అడిగి తెలుసుకోవాలన్నారు. డబ్బు చెల్లింపునకు సంబంధించిన రశీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రశీదు ఉంటే ఆపరేటర్లు యాత్ర సాధ్యం కానప్పుడు తిరిగి డబ్బు చెల్లించే అవకాశాలున్నాయన్నారు.
ఆన్లైన్ ద్వారా నమోదు..
హజ్‌యాత్ర-2016 కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌ద్వారా సమర్పించవచ్చని ఏకే ఖాన్ అన్నారు. 2017 మార్చి 10 వరకు గడువుతో అంతర్జాతీయ పాస్‌పోర్టు ఉన్నవారు అర్హులన్నారు. కేంద్ర హజ్ కమిటీ రాష్ట్రానికి కేటాయించిన కోటా ప్రకారం లక్కీ డ్రా ద్వారా యాత్రికుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగతుందన్నారు. దళారులను నమ్మవద్దని సూచించారు. దరఖాస్తులతో మెడికల్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, ఎంపిక అనంతరం సమర్పించవచ్చన్నారు.
హజ్‌యాత్ర కోసం సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు. యాత్రికులకు ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి ఏర్పాటు జరుగుతాయన్నారు. 2016 జనవరి 13 నాటికి 70 ఏళ్లు పూర్తయిన వారు సీనియర్ సిటిజన్ కింద గుర్తించబడుతారన్నారు. దరఖాస్తులను 8 ఫిభ్రవరి వరకు సమర్పించవచ్చని చెప్పారు. ఆగస్టు మొదటి వారం నుంచి హజ్‌యాత్ర ఫ్లైట్స్ బయలుదేరుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, డెరైక్టర్ జలాలొద్దీన్ అక్బర్, హజ్‌కమిటీ ప్రత్యేకాధికారి షుకూర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ షఫీయుల్లా తదితరలు పాల్గొన్నారు.