Alignment
-
ఆకాశంలో అద్భుతం.. ఆరు గ్రహాలు పరేడ్
-
దక్షిణ వలయం.. అయోమయం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు దక్షిణ భాగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం గందరగోళంగా మారింది. జాతీయ రహదారిగా నిర్మిస్తున్నందున, ఆ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటి నుంచి ట్రిపుల్ ఆర్ రెండు భాగాలూ ఎన్హెచ్ఏఐ పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం నేషనల్ హైవేస్ (ఒరిజినల్) జాబితాలో ఉత్తర భాగం ఉండగా, విజన్ 2047 పార్ట్ 2 జాబితాలో దక్షిణ భాగం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగానికి డీపీఆర్‌ను రూపొందించే పనిలో ఉంది.గతంలో పిలిచిన టెండర్లకు స్పందన లేకపోవటంతో దాని గడువును పెంచింది. మరోవైపు దాని అలైన్‌మెంటును ఖరారు చేసేందుకు అధికారులతో గతంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఎన్హెచ్ఏఐ చేపట్టే ప్రాజెక్టులకు అలైన్మెంట్లు, డీపీఆర్‌లను అదే సొంతంగా ఖరారు చేసుకుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిపై కసరత్తు చేస్తుండటం అయోమయానికి కారణమవుతోంది. సీఎం సమీక్షలు, కమిటీలుఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో అధికారులు ట్రాఫిక్ సర్వే నిర్వహించినప్పుడు దక్షిణ భాగం పరిధిలో వాహనాల రద్దీ అంత ఎక్కువగా ఉండదని తేలింది. టోల్ ఆదాయం అంతంత మాత్రంగానే ఉండే రోడ్లపై భారీ వ్యయం చేయటం సబబు కాదన్న ఉద్దేశంతో కేంద్రం అంత ఆసక్తి చూపలేదు. చివరకు రాష్టప్రభుత్వ ఒత్తిడితో సరేనంది. తొలుత ఉత్తర భాగాన్ని చేపట్టి ఆ తర్వాత దక్షిణ భాగంపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర భాగాన్ని భారత్‌మాల పరియోజనలో చేర్చింది. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాలతో జాప్యం జరిగి, భారత్‌మాల పరియోజన గడువు తీరిపోయింది.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ దాన్ని చేపట్టేందుకు నిర్ణయించి నిధులు, టెండర్ల ప్రక్రియ చేపట్టింది. దక్షిణ భాగాన్ని మాత్రం భవిష్యత్తులో చేపట్టేలా విజన్–2047 రెండో జాబితాలో చేర్చింది. అయితే ఆ భాగాన్ని తానే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సొంతంగా అలైన్‌మెంటు రూపొందించటంతో పాటు డీపీఆర్ కూడా సిద్ధం చేయాలని భావించి సీఎం పలుదఫాలు సమీక్షలు నిర్వహించారు. అధికారులతో కమిటీలు కూడా ఏర్పాటు చేశారు.ఎవరి పనిలో వారు..!దక్షిణ భాగం నిర్మాణానికి దాదాపు రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో మనసు మార్చుకుని, ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం పనులు కూడా ప్రారంభించాలని కేంద్రాన్ని లిఖి తపూర్వకంగా కోరింది. కానీ ఆ భాగం ఎన్హెచ్ఏఐ అధీనంలోనే ఉన్నందున కేంద్రం తన పనితాను చేసుకుపోతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగం డీపీఆర్ తయారీ కసరత్తును కొనసాగిస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వం ఈ భాగానికి సంబంధించి ఓ డ్రాఫ్ట్ అలైన్‌మెంటును రూపొందించి ఎన్హెచ్ఏఐకి అందించింది.అయితే అది అనుకూలంగా లేదని కేంద్రం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థ వేరే అలైన్‌మెంటును తయారు చేసి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. అది ఖరారైతే ఆ కన్సల్టెన్సీ డీపీఆర్‌ను రూపొందిస్తుంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డీపీఆర్ తయారీకి టెండర్లు కొనసాగిస్తుండటం ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం, అటు కేంద్రం అధీనంలోని ఎన్హెచ్ఏఐ అధికారుల్లో అయోమయానికి కారణమవుతోంది.మేమే కసరత్తు చేస్తాం: ఎన్హెచ్ఏఐ‘దక్షిణ భాగం ముందునుంచీ మా అధీనంలోనే ఉంది. దా నిపై మేమే కసరత్తు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చే స్తోందో మాకు తెలియదు. తానే సొంతంగా నిర్మిస్తానంటూ మాకు అధికారిక సమాచారం ఇప్పటివరకు లేదు. ఉత్తర భాగంతోపాటు దక్షిణ భాగాన్ని కూడా పూర్తి చేయాలన్న లేఖ మాత్రం వచ్చింది. ఇలాంటప్పుడు అలైన్‌మెంటు, డీపీఆర్ తదితరాలు మేమే పూర్తి చేయాల్సి ఉంటుంది..’ అని ఎన్హెచ్ఏఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
ఉత్తర ‘రింగు’ అలైన్మెంటుకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భా గానికి సంబంధించిన అలైన్‌మెంటును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. గతంలోనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆమోదించగా, ఇప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడాల్సి ఉంది. ఇక ట్రిపుల్ ఆర్కు ఎక్స్‌ప్రెస్ వే నంబరు కూడా త్వరలో రానుంది. అలైన్‌మెంటు ఓకే అయిన నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో ఉత్తర భాగానికి టెండర్లు పిలవనున్నారు. అలైన్‌మెంటు మార్పు వినతుల సంగతేంటి? ఉత్తర భాగం అలైన్మెంటులో కొన్ని మార్పులు చేయాలని ఇటీవల కొందరు ప్రజా ప్రతినిధులు సూచించారు. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని కలిసి వినతులు అందించారు. సంగారెడ్డి సమీపంలో, యాదాద్రి సమీపంలోని రాయగిరి, చౌటుప్పల్ ఇంటర్‌ఛేంజ్ కూడలి.. ఇలా పలుచోట్ల అలైన్‌మెంటును కొంతమేర సవరించాలని కోరారు. ఇందులో ముగ్గురు ఎంపీలు, రాష్ట్ర మంత్రి ఒకరు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో భూసేకరణకు సంబంధించి కొన్ని భూముల వివరాలు 3డీ గెజిట్‌లో నమోదు కాలేదు. ఆ గెజిట్ విడుదలైతేనే భూసేకరణ జరుగుతుంది. ఎలాగూ గెజిట్‌లో వివరాలు నమోదు కానందున, అలైన్‌మెంటు మార్పు పెద్ద కష్టం కాదనేది నేతల అభిప్రాయం. అయితే కేవలం సాంకేతిక కారణాలతోనే ఆయా భూముల వివరాలు 3డీ గెజిట్‌లోకి రాలేదని, అలాంటి భూములు మొత్తం భూముల్లో కేవలం 0.4 శాతం లోపేనని ఎన్హెచ్ఏఐ వారికి చెప్పినట్టు తెలిసింది. ఈ సమయంలో అలైన్మెంటులో మార్పులు చేస్తే, కొత్త ప్రాంతాల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని కూడా చెప్పినట్టు సమాచారం. అయితే ఆ వినతులను పూర్తిగా కొట్టిపడేయలేదు. దీంతో అలైన్మెంటులో మార్పులు జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ అలైన్మెంటుకు ఆమోదముద్ర వేయటంతో మార్పుల అంశంపై ఇచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎన్హెచ్ఏఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. గతంలో జాతీయ రహదారులకు సంబంధించిన అలైన్‌మెంట్లకు ఎన్హెచ్ఏఐ ఆమోదంతో సరిపోయేది. అయితే మూడేళ్ల క్రితం కేంద్ర మంత్రిత్వశాఖ కచ్చితంగా ఆమోదముద్ర వేయాలనే నిబంధన వచ్చింది. ఆ మేరకు మంత్రిత్వ శాఖలో కొత్తగా అలైన్‌మెంటు అప్రూవల్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ భేటీలోనే ఉత్తర భాగం అలైన్మెంటుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. నంబర్ వస్తేనే పర్యావరణ అనుమతులు త్వరలో టెండర్లు పిలిచేందుకు ఎన్హెచ్ఏఐ ఏర్పా ట్లు చేస్తున్న క్రమంలో ఆ రోడ్డుకు ఎక్స్‌ప్రెస్ వే నంబరు కేటాయింపు కీలకంగా మారింది. ఆ నంబరు కేటాయిస్తేనే పర్యావరణ అనుమతులు లభిస్తాయి. అవి ఉంటేనే టెండర్లను తెరిచేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌ప్రెస్ వే నంబరును వీలైనంత త్వరలో కేటాయించాలని నిర్ణయించారు. -
రీజనల్ రింగ్.. మరింత లాంగ్!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నిడివి 200 కిలోమీటర్లను మించిపోనుంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) చేపట్టిన పరిశీలనను కాదని రాష్ట్ర ప్రభుత్వం విడిగా రూపొందించిన అలైన్మెంట్, దానిలో మార్పులు చేయాల్సిన పరిస్థితులే దీనికి కారణం. గతంలో ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ పరిశీలన చేపట్టి మూడు వేర్వేరు అలైన్మెంట్లను రూపొందించగా.. అందులో 189.425 కిలోమీటర్ల నిడివి ఉన్న మూడో అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. దాన్ని ఎన్హెచ్ఏఐ ఆమోదించేలోగా లోక్‌సభ ఎన్నికలు రావడంతో పెండింగ్‌లో పడింది. తర్వాత రోడ్డు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకుంది. సొంతంగా దక్షిణ భాగం రింగ్‌రోడ్డును చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాల్లో అలైన్‌మెంట్‌పై చర్చలు జరిగాయి. కొన్ని కన్సల్టెన్సీ సంస్థల సాయంతో గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా ప్రాథమికంగా ఓ అలైన్‌మెంట్‌ను అధికారులు సిద్ధం చేశారు. గతంలో ఢిల్లీ కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్మెంట్లో చాలా మార్పులు చేస్తూ, కొత్త ప్రాంతాల మీదుగా రింగ్‌రోడ్డు కొనసాగేలా రూపొందించారు. దానితో దక్షిణభాగం నిడివి 194 కిలోమీటర్లకు చేరింది. అయితే అది క్షేత్రస్థాయి పరిశీలనతో రూపొందించినది కాకపోవటంతో పలు లోపాలు ఉండిపోయాయి. ఆ అలైన్‌మెంట్‌ను ఉన్నది ఉన్నట్టుగా ఖరారు చేసే పరిస్థితి లేదు. జలాశయాలు, రిజర్వాయర్లు, గుట్టలు, వాగులు, వంకల మీదుగా దాన్ని రూపొందించడమే కారణం. ఇప్పుడు ఇలాంటి వాటన్నింటినీ తప్పిస్తూ.. తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. దీనితో నిడివి మరో 12 కిలోమీటర్లకుపైగా పెరుగుతుందని అంచనా. ఈ లెక్కన రీజనల్ రింగ్‌రోడ్డు దక్షిణ భాగం నిడివి 200 కిలోమీటర్లను దాటిపోతుందని అంటున్నారు. రూ.1,200 కోట్లు అదనపు వ్యయం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త అలైన్‌మెంట్‌ను ఖరారు చేసే పనిలో ఉంది. ఇటీవలే 12 మంది అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 194 కిలోమీటర్ల ప్రాథమిక అలైన్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని.. క్షేత్రస్థాయిలో పర్యటించి తుది అలైన్‌మెంట్‌ను సిద్ధం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక అలైన్‌మెంట్‌లోని లోపాలను సరిదిద్దితే.. రోడ్డు నిడివి పెరగనుంది. దీనితో రోడ్డు నిర్మాణ వ్యయం రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆమన్‌గల్ ఆవలి నుంచి.. ఎన్హెచ్ఏఐ రూపొందించిన అలైన్మెంట్ ఆమన్‌గల్ పట్టణం ఇవతలి నుంచి ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మార్చి ఆమన్‌గల్ పట్టణం అవతలి నుంచి అలైన్‌మెంట్‌ను రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఆ పట్టణం పూర్తిగా రీజనల్ రింగురోడ్డు లోపలికి రానుంది. ఇక చేవెళ్ల మండలం పరిధిలోని ఆలూరు –కిష్టాపూర్ గ్రామాల సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ హైవేను క్రాస్ చేసేలా ఎన్హెచ్ఏఐ అలైన్మెంట్ ఉండగా.. ఇప్పుడు మన్నెగూడ వద్ద క్రాస్ చేసేలా మార్పు చేస్తున్నట్టు సమాచారం. ఇలా మరెన్నో మార్పులు జరుగుతున్నట్టు తెలిసింది. ఇందుకోసం ప్రాథమిక అలైన్మెంట్ స్థానంలో.. మరో తాత్కాలిక అలైన్‌మెంట్‌ను కొత్తగా రూపొందించినట్టు సమాచారం. గతంలోనూ ఇలాగే.. ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంట్‌ను రూపొందించకముందు, రాష్ట్ర ప్రభుత్వం అ«దీనంలో ఎన్‌హెచ్ విభాగం ఓ ప్రాథమిక అలైన్‌మెంట్‌ను రూపొందించింది. అప్పట్లో కూడా అధికారులు గూగుల్ మ్యాపుల ఆధారంగా దాదాపు 182 కిలోమీటర్ల నిడివితో దాన్ని రూపొందించారు. మర్రిగూడ మండలం శివన్నగూడలో ఉన్న రిజర్వాయర్ మధ్యలోంచి రోడ్డును నిర్మించేలా సిద్ధం చేశారు. దీనితో ఆ రిజర్వాయర్ సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రిజర్వాయర్‌ను ఆసరా చేసుకుని సాగు భూముల్లోంచి అలైన్మెంట్ మార్కింగ్ చేసిన అంశాన్ని.. ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు క్షేత్రస్థాయిలో సర్వే చేసి.. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరం నుంచి కొత్త అలైన్మెంట్ రూపొందించారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే మళ్లీ ఎదురవుతోంది.ప్రస్తుతం జలాశయాల మీదుగా..ఇది దక్షిణ రింగురోడ్డు ప్రారంభ ప్రాంతం. ఉత్తర రింగ్ ప్రారంభయ్యే సంగారెడ్డి పట్టణం చేరువలోని గిర్మాపూర్ వద్ద దక్షిణ భాగం రింగురోడ్డు అనుసంధానమయ్యే చోటు ఇది. ఇక్కడ ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన అలైన్మెంట్ ప్రారంభంలోనే ఓ లూప్ తరహాలో అర్ధచంద్రాకారంలో వంపు తిరిగి (లేత నీలిరంగు గీత) మొదలవుతుంది. దీన్ని లోపంగా భావించారో, మరేమో గానీ.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్లో దాన్ని (ముదురు నీలిరంగు) స్ట్రెయిట్ లైన్‌గా మార్చారు. నిజానికి అక్కడ పెద్ద చెరువు ఉంది. కొండాపూర్ మండలం తొగర్పల్లి పెద్దచెరువు పరీవాహక ప్రాంతాన్ని తప్పించేందుకు ఢిల్లీ కన్సల్టెన్సీ లూప్‌లో అలైన్మెంట్ రూపొందించింది. ప్రభుత్వ అలైన్మెంట్లో దాన్ని నేరుగా ఉండేలా మార్చటం వల్ల చెరువు పరీవాహక ప్రాంతం మీదుగా రోడ్డు వస్తుంది, అలాగే నిర్మించాలంటే ఎలివేటెడ్ విధానాన్ని అనుసరించాలి. అది భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇక మర్రిగూడ మండలం కిష్టరాయునిపల్లి వద్ద ఓ రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదన ఉంది. దాన్ని తప్పించేందుకు ఢిల్లీ సంస్థ ఆ ప్రాంతంలో వంపు తిరుగుతూ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. ప్రభుత్వ అలైన్మెంట్లో దాన్ని కూడా నేరుగా మార్చటం వల్ల.. ప్రతిపాదిత రిజర్వాయర్ భూముల్లోంచి రోడ్డు నిర్మించాల్సి వస్తుంది. అది కుదిరే పనికాదు. లేదా అతి భారీ ఫ్లైఓవర్లు కట్టాల్సి వస్తుంది. దక్షిణభాగం పొడవునా పలుచోట్ల ఇదే పరిస్థితి ఉండటంతో.. ప్రాథమిక అలైన్‌మెంట్‌కు మార్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. -
సొంతంగానే దక్షిణ రింగు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగాన్ని సొంతంగానే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచి్చంది. గతంలో ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్‌మెంట్‌ను పక్కన పెట్టనుంది. కొత్త అలైన్మెంట్ రూపొందించడానికి 12 మందితో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ట్రిపుల్ ఆర్‌ను జాతీయ రహదారిగా నిర్ధారించి కేంద్రమే చేపట్టేందుకు గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో ఉత్తరభాగానికి భూసేకరణ ప్రక్రియ నిర్వహిస్తున్న సంగతి విదితమే.అదేక్రమంలో దక్షిణభాగాన్ని కూడా కేంద్రమే చేపట్టాల్సి ఉంది. ఉత్తర–దక్షిణ భాగాల నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాల్సి ఉంది. భూసేకరణలో సగం వ్యయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. రోడ్డు నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించాలంటే, అలైన్మెంట్ ప్రక్రియను కూడా కేంద్రమే నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు అలా కాదని, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అలైన్మెంట్ రూపొందించనున్నందున.. రోడ్డు నిర్మాణ బాధ్యతను ఇక కేంద్రం తీసుకోదని దాదాపు తేలిపోయింది.అంటే రోడ్డు నిర్మాణ వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. దక్షిణ భాగానికి దాదాపు రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు కానుంది. ఇంత భారీ మొత్తాన్ని కేంద్రం భరించాల్సిన అవసరం లేకుండా, తానే భరిస్తానని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రంతో సంబంధం లేకుండా, తనకు నచ్చిన ప్రాంతాల మీదుగా, నచి్చనట్టుగా రోడ్డు నిర్మాణానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసుకునే అలైన్మెంట్ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ అలైన్మెంట్ ఖరారుకే ఏడాది సమయం ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు దాదాపు ఏడాది సమయం పట్టింది. ఆ సంస్థ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ..వాగులు, వంకలు, గుట్టలుమిట్టలను పరిగణనలోకి తీసుకుని అలైన్‌మెంట్‌ను రూపొందించారు. జల వనరులు, భవిష్యత్‌లో నిర్మించే ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అలైన్మెంట్ రూపొందించారు. మూడు అలైన్మెంట్లు సిద్ధం చేయగా, వాటిల్లో 189,25 కి.మీ. నిడివి గల అలైన్‌మెంట్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు దఫాలుగా అధికారులు సమావేశమై ఈ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌పై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపొందిన అలైన్మెంట్...తాము ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీకి అనుకూలంగా లేదని, అందులో చాలా మార్పులు చేయాల్సి ఉందని తేల్చారు.దానిని అలాగే వదిలేసి పూర్తి కొత్త అలైన్మెంట్ ను రూపొందించటమే మేలని సూత్రప్రాయంగా తేల్చారు. ఈ మేరకు గూగుల్ మ్యాపు సహాయంతో ఓ తాత్కాలిక అలైన్‌మెంట్‌ను అధికారులు తయారుచేసి ప్రభుత్వానికి సమరి్పంచారు. దాదాపు 194 కి.మీ. నిడివితో దీనిని రూపొందించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి తుది అలైన్‌మెంట్‌గా మార్చేందుకు 12 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి కనీ్వనర్‌గా ఉండే ఆ కమిటీలో పురపాలక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, రోడ్లు భవనాల శాఖ, ఎన్హెచ్ఏఐ అధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. త్వరలో ఈ కమిటీ ఆధ్వర్యంలో అలైన్మెంట్ ఖరారు ప్రక్రియ ప్రారంభం కానుంది. -
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఎందుకు మార్చారు?
మంగళగిరి: ‘ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. దాంతో తనకు సంబంధం ఏమిటి అంటున్న నారా లోకేశ్ ఆ రింగ్ రోడ్డు నిర్మాణానికి షబ్బానా వాళ్లను ఎందుకు కన్సల్టెంట్‌గా నియమించారు’ అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిలదీశారు. బుధవారం ఎయిమ్స్ ఆస్పత్రి పక్కన అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన టెంపుల్ హిల్ ఎకో పార్కు ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు ముందుగా ఇచ్చినట్టు కాకుండా లింగమనేని రమేష్, మాజీ మంత్రి నారాయణ, హెరిటేజ్ డైరెక్టర్ లోకేశ్ పేరిట కొన్న భూముల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నిజాయితీపరుడైన అప్పటి సీఆర్డీఏ కమిషనర్ నాగులాపల్లి శ్రీకాంత్ వారి మాట వినడం లేదని ఆయనను మార్చేసి సీఆర్డీఏ కమిషనర్‌గా అర్హత లేని అప్పటి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను నియమించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాను అన్ని ఆధారాలు, సాక్ష్యాలతో సహా రికార్డులను సేకరించి సీఐడీ అధికారులకు అప్పగించానని చెప్పారు. చంద్రబాబు రాజధాని పేరుతో ప్రతి అంశాన్ని ఆయన స్వార్థానికి, ఆయన మనుషుల స్వార్థానికి ఎంతలా వాడుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. లింగమనేని రమేష్, మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణ హౌసింగ్ వాళ్లతో పాటు హెరిటేజ్ పేరుతో కొన్న భూములు సుమారు 650 ఎకరాలకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్డును మార్చిన వాట వాస్తవం కాదా అని నిలదీశారు. అనైతిక పొత్తులను ప్రజలు గమనిస్తున్నారు టీడీపీ అధికారమే పరమావధిగా జనసేనతో అనైతిక పొత్తులు పెట్టుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆర్కే పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుల మతాలకు అతీతంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా డీబీటీ ద్వారా రూ.లక్షల కోట్లు పంపిణీ చేసి సంక్షేమాన్ని ఇంటికి చేర్చినట్టు చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్టు వైనాట్ 175 జరిగి తీరుతుందనే నమ్మకం ఉందన్నారు. -
ఇక ఆ భూములు ఎన్హెచ్ఏఐ ఖాతాలోకి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి అలైన్మెంటులో గుర్తించిన భూమిని తన పరిధిలోకి తీసుకుంటూ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) 3డీ నోటిఫికేషన్లు జారీ చేసింది. యాదాద్రి–భువనగిరి, ఆందోల్–జోగిపేట, చౌటుప్పల్ అథారిటీ(కాంపిటెంట్ అథారిటీ ఫర్ లాండ్ అక్విజిషన్–కాలా)లకు సంబంధించి ఏప్రిల్‌లో మూడు గెజిట్లు జారీ చేయగా, తాజాగా భువనగిరి, ఆందోల్–జోగిపేటలోని అనుబంధ నోటిఫికేషన్లు, సంగారెడ్డి, గజ్వేల్, తూప్రాన్ కాలాలకు సంబంధించి 3డీ నోటిఫికేషన్లు జారీ చేసింది. అలైన్‌మెంటు ఖరారు చేసిన తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలుగా తొలుత జారీ చేసిన రెండు గెజిట్లలో దాదాపు 500 ఎకరాలకు సంబంధించిన భూముల వివరాలు గల్లంతైన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఇటీవలే గుర్తించి వాటికి మళ్లీ నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. అలా గల్లంతైన భూములకు సంబంధించి మినహా మిగతా భూమలుకు సంబంధించి తుది గెజిట్ నోటిపికేషన్లు దాదాపు జారీ అయినట్టే. దీంతో ఈ భూములన్నీ ప్రైవేటు వ్యక్తుల ఆధీనం నుంచి ఎన్హెచ్ఏఐ పరిధిలోకి చేరినట్టయింది. భూ యజమానుల అభ్యంతరాలను తోసిపుచ్చిన ఎన్హెచ్ఏఐ: ఈ భూముల సేకరణ ప్రక్రియపై వాటి యజమానుల నుంచి వ్యక్తమైన అన్ని అభ్యంతరాలను ఎన్హెచ్ఏఐ తోసి పుచ్చింది. ఆయా అభ్యంతరాలకు సంబంధించి గ్రామ సభ ల్లో అధికారికంగా వెల్లడించిన సమాధానాలతో ఇక అభ్యంతరాలు రద్దయినట్టుగానే ఎన్హెచ్ఐఏ పరిగణిస్తుంది. ప్రజో పయోగానికి సంబంధించి రూపొందించిన ప్రాజెక్టు నిర్మాణానికి గాను ఈ భూములను సేకరించాలని నిర్ణయించినందున, ఆ ప్రాజెక్టు పనులు మందుకు సాగేందుకు వీలుగా భూములపై ఉన్న ప్రైవేటు యాజమాన్య హక్కులను రద్దు చేస్తున్నట్టుగా ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. వెరసి ఆ భూములన్నీ కేంద్రప్రభుత్వ అధీనంలోకి చేరినట్టయింది. గెజిట్‌లో ఇలా: ‘‘కేంద్ర భూసేకరణ చట్టం సెక్షన్ 3డీలోని సబ్ సెక్షన్(1) ప్రకారం.. నిర్ధారిత గ్రీన్‌ఫీల్డ్ హైవే దిగువ తెలి పిన సర్వే నెంబర్లలోని భూమిని కేటాయించాము. దాని కో సం సేకరించనున్నాము’’ ‘‘కేంద్ర భూసేకరణ చట్టం సెక్షన్ 3డీ సబ్‌సెక్షన్(2) నోటిఫికేషన్ విడుదలైన వెంటనే.. నిర్ధారి త భూమి పూర్తిగా కేంద్రప్రభుత్వ అధీనంలోకి వచ్చినట్టుగా పరిగణించాలి. ’’ అని గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించింది. 158.62 కి.మీ.గాను 2 వేల హెక్టార్ల భూమి సేకరణ రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తరభాగంలో 158.62 కి.మీ. నిడివికి గాను దాదాపు 2 వేల హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.5170 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తంలో సగ భాగం.. అంటే రూ.2585 కోట్లు భూసేకరణకు, రూ.363.43 కోట్లు స్తంభాలు లాంటి వాటిని తరలించేందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. నిధులు ముందే జమ కట్టే విషయంలో కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల మధ్య అప్పట్లో అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత రాజీ కుదిరి రూ.100 కోట్ల మొత్తాన్ని జమ చేయటంతో 3 డీ నోటిషికేషన్ జారీకి మార్గం సుగమమైంది. 3ఏ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన ఏడాదిలోపు 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఈ నెలతో ఏడాది పూర్తి అవుతున్నందున 3డీ గెజిట్ నోటిఫికేషన్లను ఎన్హెచ్ఏఐ జారీ చేయటం విశేషం. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ రీజినల్ రింగురోడ్డు నిర్మించే అలైన్మెంట్ పరిధిలోకి వచ్చే భూములను గుర్తించి గతంలోనే సర్వే చేసిన అధికారులు.. తాజా గెజిట్ నోటిఫికేషన్లో ఊరు, సర్వే నెంబరు, భూమి విస్తీర్ణం, పట్టాదారు పేరు.. ఇలా పూర్తి వివరాలను గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించారు. -
Polavaram: డ్రాఫ్ట్ ట్యూబ్ అమరిక పనులు ప్రారంభం
పోలవరం రూరల్(ఏలూరు జిల్లా): పోలవరం జల విద్యుత్ కేంద్రం డ్రాఫ్ట్ ట్యూబ్ బిగించే పనులకు అధికారులు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఏపీ జెన్కో, మేఘా ఇంజినీ రింగ్ సంస్థ ప్రతినిధులు, అధికారులు పనులను ప్రారంభించారు. విద్యుత్ కేంద్రం తొలి యూనిట్లో డ్రాఫ్ట్ ట్యూబ్ బిగింపు పనులు చేపట్టారు. ఈ విద్యుత్ కేంద్రంలో 12 యూనిట్లున్నాయి. 960 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నారు. పోలవరానికి వచ్చే నీరు విద్యుత్ కేంద్రంలోని ట ర్బయిన్లపై పడుతుంది. టర్బయిన్ తిరగడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. దీనికి వినియోగించిన నీటిని బయటకు పంపేందుకు డ్రాఫ్ట్ ట్యూబ్‌ను ఉపయోగిస్తారు. చదవండి: మనబడి నాడు-నేడు పనులు.. ఏపీ సర్కార్ మార్గదర్శకాలు -
ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారు.. పాతరోడ్లను కలుపుతూ 189 కి.మీలతో..
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం 189.23 కి.మీ. నిడివితో నిర్మాణం కానుంది. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అలైన్‌మెంట్‌ను ఖరారు చేసింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీకి చెందిన ఇంటర్ కాంటినెంటల్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన మూడు అలైన్మెంట్లలో 189.23 కి.మీ. నిడివి ఉన్న అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది. దీనికి ఈ వారంలో అధికారిక ఆమోదం లభించనుంది. అనంతరం అధికారులు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) రూపొందించనున్నారు. జలాశయాలు.. చెరువులు.. గుట్టలను తప్పిస్తూ.. రీజినల్ రింగురోడ్డును ప్రతిపాదించిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం ఓ కన్సల్టెన్సీని నియమించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ప్రాథమికంగా 182 కి.మీ. నిడివితో ఓ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. ఆ తర్వాత ప్రాజెక్టు కొంత డోలాయమానంలో పడింది. అంతగా వాహనాల రాకపోకలు లేని మార్గం కావటంతో దక్షిణ భాగానికి నాలుగు వరసల ఎక్స్‌ప్రెస్ వే అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఆ తర్వాత కేంద్రప్రభుత్వం దక్షిణ భాగానికి ఆమోదిస్తూ గత ఆగస్టులో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీని నియమించింది. ప్రాథమిక అలైన్మెంట్ ఆధారంగానే ఈ సంస్థ క్షేత్రస్థాయిలో పర్యటించి దానికి మార్పుచేర్పులతో మూడు వేరు వేరు అలైన్మెంట్లను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న షాద్‌నగర్, కంది, ఆమన్‌గల్.. తదితర రోడ్లలో కొంత భాగాన్ని ఆర్ఆర్ఆర్లోకి చేరుస్తూ రెండు అలైన్మెంట్లను రూపొందించింది. పాత ఎన్సల్టెన్సీ సంస్థ ప్రాథమికంగా రూపొందించిన పూర్తి గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌ను సరిదిద్దుతూ మూడో అలైన్‌మెంటును సిద్ధం చేసింది. ప్రాథమిక అలైన్మెంట్ నిడివిని పెంచనప్పటికీ, దానికి అడ్డుగా ఉన్న చెరువులు, గుట్టలను తప్పిస్తూ మార్పులు చేశారు. భవిష్యత్తులో నిర్మించే పాలమూరు ప్రాజెక్టు కాలువలను దృష్టిలో పెట్టుకుని చిన్న, చిన్న మార్పులు చేశారు. దీంతో పాత అలైన్మెంట్ కంటే దాదాపు ఏడు కి.మీ. అదనపు నిడివితో కొత్త అలైన్మెంట్ ఏర్పడింది. పాత రోడ్లను జత చేస్తూ రూపొందించిన రెండు అలైన్మెంట్లు ఆచరణ సాధ్యం కాదని ఎన్హెచ్ఏఐ తిరస్కరించింది. పూర్తి గ్రీన్‌ఫీల్డ్ మార్గంగా ఏర్పడ్డ మూడో అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది. రూ.15 వేల కోట్ల వ్యయం? ఉత్తర భాగం నిర్మాణానికి దాదాపు రూ.9,500 కోట్లు ఖర్చవుతాయన్న ప్రాథమిక అంచనా ఉండగా, ఇటీవల కేంద్రం రూ.13 వేల కోట్లతో దానికి బడ్జెట్ రూపొందించింది. రోడ్డు నిర్మాణానికి రూ.8 వేల కోట్లు, భూసేకరణకు రూ.5,200 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. ఈ లెక్కన దక్షిణ భాగానికి రూ.15 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారిక వర్గాల అంచనా. పూర్తిస్థాయి డీపీఆర్ రూపొందించాక స్పష్టత వచ్చే అవకాశముంది. సంగారెడ్డి నుంచి కంది, నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, ఆమన్‌గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్ నారాయణపూర్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మించే దక్షిణ భాగాన్ని కేంద్రప్రభుత్వం భారత్‌మాల పరియోజన పథకం–2 కింద ఎంపిక చేసింది. -
దక్షిణ ‘రింగ్’కు మూడు అలైన్మెంట్లు
సాక్షి, హైదరాబాద్: ‘అడ్డుగా వస్తున్న గుట్టలను చీల్చి రోడ్డు నిర్మించాలా? ఖర్చు తగ్గించుకోవటానికి అలైన్‌మెంటును మళ్లించాలా? ఏయే ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు రాబోతున్నాయి? వాటికి కాలువలు ఎక్కడెక్కడ నిర్మాణం కాబోతున్నాయి? అటవీ భూములను తప్పించాలంటే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి?’ రీజనల్ రింగురోడ్డు దక్షిణ భాగం విషయంలో అధికారులకు ఎదురవుతున్న సవాళ్లు ఇవి. అంతగా ట్రాఫిక్ లేని ఈ మార్గంలో నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే అవసరమా అంటూ కొన్నినెలల పాటు ఈ భాగం విషయంలో తర్జనభర్జన పడ్డ కేంద్రం ఎట్టకేలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణభాగం నిడివి పెద్దగా ఉండటమే కాకుండా, భౌగోళికంగా అలైన్‌మెంట్‌ను రూపొందించే విషయంలో కీలకంగా మారింది. ఈ క్రమంలో అత్యంత జాగ్రత్తగా అలైన్మెంట్ ఖరారు చేయాలని నిర్ణయించిన అధికారులు.. కన్సల్టెన్సీ సంస్థకు పలుసూచనలు చేశారు. గతంలో భారీ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీగా సేవలందించిన అనుభవమున్న ఢిల్లీ సంస్థ ‘ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్’.. అధికారుల సూచనలకు అనుగుణంగా సర్వే చేస్తోంది. గుట్టలు, చెరువులు, ఊళ్ల మధ్య. కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు నాలుగైదు చోట్ల 20 మీటర్ల వరకు ఎత్తున్న చిన్న గుట్టలు అడ్డుగా ఉన్నట్టు గుర్తించారు. ‘వాటిని తొలిచి రోడ్డు నిర్మించే అవకాశం ఉందా? లేదా అలైన్‌మెంట్‌ను మళ్లించాలా.. మళ్లించదల్చుకుంటే వాటికి దగ్గర గా ఉన్న జనావాసాల పరిస్థితి ఏమిటి? కొన్ని ప్రాంతాల్లో ఉన్న చెరువులకు, ఊళ్లకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే అలైన్‌మెంట్‌ను మళ్లించాలి. దానివల్ల దూరం, నిర్మాణ ఖర్చు పెరుగుతాయ’ని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలపై ఢిల్లీలోని జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు వివరాల ను కన్సల్టెన్సీ సంస్థ అధికా రులకు అందజేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మూడు వేర్వేరు అలైన్మెంట్లను రూపొందించాలని.. నిర్మాణ వ్యయం, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యోగ్యమైన దాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ, అటవీ శాఖలతో సంప్రదింపులు పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా పలు ప్రాంతాల్లో కాలువలు నిర్మించాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో వాటి స్థలాలను ఖరారు చేయలేదు. దీనితో ‘దక్షిణ రింగ్’ అలైన్‌మెంట్‌ను ఖరారు చేస్తే.. భవిష్యత్తులో మళ్లీ మార్పుచేర్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల భవిష్యత్తు పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించి తదనుగుణంగా అలైన్‌మెంటు రూపొందించాలని నిర్ణయించారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులతో చర్చిస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో నీటి పారుదల శాఖ నిర్మాణాలు రాబోతున్నాయనే వివరాలు, ప్రణాళికలు అందించాల్సిందిగా కోరారు. కాలువలు ఉన్న చోట అలైన్మెంటులో ఎలాంటి స్ట్రక్చర్లను నిర్మించాలో తేల్చుకోవటానికి ముందస్తు అవకాశం చిక్కనుంది. ఇక ఏయే ప్రాంతాల్లో అటవీ భూములు ఉన్నాయో గుర్తించిన కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు.. అటవీ శాఖ అధికారులతో కూడా చర్చిస్తున్నారు. రాజకీయ నేతలు, పలుకుబడి ఉన్న వారి ఒత్తిళ్లకు తలొగ్గి వారికి అనుకూలంగా అలైన్‌మెంటు రూపొందించారన్న విమర్శలు రాకుండా పకడ్బందీగా వ్యవహరించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, అక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా చర్యలు చేపడతామని అంటున్నారు. అలైన్‌మెంట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని, ఈ నెలాఖరులోగానీ వచ్చే నెల మొదటి వారంలోగానీ అలైన్మెంట్లో స్పష్టత వస్తుందని అధికారులు సూచించారు. -
Regional Ring Road: రాయగిరి రైతులకు కష్టాల ‘రింగ్’! బతికేదెట్లా?
సాక్షి, యాదాద్రి: అది రాయగిరి గ్రామం.. చుట్టూ పొలాలు, చేన్లతో కళకళాడేది.. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు, హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉంటుంది. ఆ ప్రధాన రహదారి విస్తరణ కోసం గ్రామంలో కొంతమేర పొలాలు, భూములు పోయాయి.. అభివృద్ధి కోసమేకదా అనుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల కోసం మరికొంత భూమి పోయింది.. తమ ప్రాంతం పచ్చగా అవుతుంది కదా అనుకున్నారు. యాదాద్రి అభివృద్ధికి, హైటెన్షన్ విద్యుత్ లైన్ల కోసం ప్రభుత్వం భూములు తీసుకుంది. అటు దేవుడు, ఇటు కరెంటు.. ఇవ్వలేక ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు రీజనల్ రింగు రోడ్డు తెరపైకి వచ్చింది. దాని అలైన్‌మెంటు కూడా రాయగిరి గ్రామం మీదుగానే వెళుతోంది. ఇన్నిసార్లు భూములు ఇచ్చామని.. ఇప్పుడూ ఇస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని, ఊరు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని రాయగిరి వాసులు వాపోతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని వేడుకుంటున్నారు. రాయగిరి గ్రామంలో వందలాది మందికి ఉపాధి కల్పించే రైస్ మిల్లులు, హోటళ్లు మొత్తం రోడ్డు విస్తరణలో పోతున్నాయని అంటున్నారు. 80 ఎకరాల సేకరణ కోసం.. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి వద్ద డబుల్ జంక్షన్ సర్కిల్ కోసం 80 ఎకరాలు సేకరిస్తున్నారు. ముందుగా 60 ఎకరాలు సేకరించాలని నిర్ణయించినప్పటికి.. జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 20 ఎకరాలు పెంచారు. అలైన్మెంట్ మార్చారా? : ముందుగా రీజనల్ రింగ్ రోడ్డు తుర్కపల్లి మండలం నుంచి రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల మీదుగా భువనగిరి మండలంలోకి వెళ్లేలా ప్రాథమికంగా ప్రతిపాదించారు. తర్వాత యాదగిరిగుట్ట దేవస్థానానికి ఉత్తరం వైపు నుంచి కాకుండా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, దాతర్పల్లి మీదుగా కలెక్టరేట్ నుంచి రాయగిరి గ్రామం మీదుగా వలిగొండ మండలం వరకు తాజా ప్రతిపాదనతో గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ముందుగా రాయగిరి గ్రామానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేసిన ప్రతిపాదనను తర్వాత మార్చడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా వ్యాపారులకు అనుగుణంగా అలైన్మెంట్ మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడుసార్లు భూములు పోతే ఎలా..? రాయగిరి రెవెన్యూ పరిధిలోని బాలెంపల్లికి చెందిన బద్దం నర్సింహారెడ్డికి ఆరు ఎకరాల భూమి ఉంది. గతంలోనే హైటెన్షన్ లైన్ కోసం ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వకుండా రెండు ఎకరాల భూమిని తీసుకున్నారు. కాళేశ్వరం కాల్వ కోసం 15 గుంటల భూమి తీసుకున్నారు. తాజాగా రీజనల్ రింగ్ రోడ్డు కోసం మూడు 3 ఎకరాలు తీసుకుంటున్నారు. గ్రామంలో పది మంది రైతులది ఇదే పరిస్థితి. పంటలు పండే భూములు ఇలా తీసుకుంటే తాము ఎలా బతకాలని నర్సింహారెడ్డి ప్రశ్నిస్తున్నారు. గుంట భూమి లేకుండా పోతుంది సర్వే నంబర్ 690లో మా అన్నదమ్ములిద్దరి పేరున మొత్తం 14 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంటులో గుంట భూమి లేకుండా పోతోంది. దీంతో మాకు బతుకు దెరువు కష్టమవుతోంది. రోడ్డు అలైన్‌మెంటు మార్చి మా జీవితాలు కాపాడాలి. – తెల్జూరి ఐలయ్య, రాయగిరి అలైన్మెంట్ మార్చాలి సర్వే నంబర్ 726లో 7.15 ఎకరాల భూమిపోతోంది. ఇందులో ఆరుగురు రైతులు తమ భూములు మొత్తం కోల్పోతున్నారు. ముందుగా ఇచ్చిన మ్యాప్ ప్రకారం ఈ సర్వే నంబర్లో 4 ఎకరాలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారు. కానీ తాజా నోటిఫికేషన్ ప్రకారం మార్చిన అలైన్మెంట్తో భూమి మొత్తం పోతోంది. వెంటనే రింగురోడ్డు అలైన్ మెంట్ మార్చాలి. – అవిశెట్టి పాండు, రాయగిరి గుంట భూమి కూడా మిగలకుండా.. రాయగిరికి చెందిన కోటం భద్రయ్యకు ఉన్న 4.17 ఎకరాల భూమి మొత్తం రీజనల్ రింగ్‌రోడ్డులో పోతోంది. గతంలో ఆయన భూమిలో రెండు ఎకరాలను హైటెన్షన్ విద్యుత్ లైన్లు, టవర్ల కోసం ప్రభు త్వం తీసుకుంది. అలాగే జాతీయ రహదారి విస్తరణ కోసం 34 గుంటల భూమి, ఇల్లు పోయాయి. తాజా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఉన్న మొత్తం భూమిని కోల్పోతున్నాడు. కూతురు వివాహం కోసం పనికి వస్తుందనుకున్న కోట్ల విలువ చేసే భూము లను కోల్పోయి ఎలా బతకాలని, ప్రభుత్వం అలైన్ మెంట్ మార్చాలని భద్రయ్య వేడుకుంటున్నాడు. -
Hyderabad RRR: అలైన్మెంట్.. ఆల్రైట్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు ఉత్తరభాగం అలైన్‌మెంట్‌కు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆమోదం తెలిపింది. మూడు వారాల క్రితం తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయగా తాజాగా దానికి మరో చిన్న సవరణ చేసి తుది అలైన్‌మెంట్‌కు ఆమోదముద్ర వేసింది. ఈ విషయం త్వరలోనే అధికారికంగా వెల్లడి కానుంది. ఉత్తర భాగానికి కన్సల్టెన్సీ బాధ్యతలు చూస్తున్న కే అండ్ జే కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో నాలుగు అలైన్మెంట్ ఆప్షన్లను ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ కేంద్ర కార్యాలయానికి పంపగా.. ‘ఆప్షన్–ఏ’ను ఖరారు చేసింది. మూడేళ్ల క్రితం కన్సల్టెన్సీగా వ్యవహరించిన సంస్థ అలైన్మెంట్తో పోలిస్తే 1.2 కి.మీ. నిడివిని తగ్గిస్తూ ఈ అలైన్మెంట్ ఉంది. అయితే ఇందులో అత్యవసరంగా మరో సవరణ చేశారు. దీని ప్రకారం పాత అలైన్మెంట్ (మూడేళ్ల కిందటిది)కు కేవలం 200 మీటర్ల తేడాతో ఈ కొత్త అలైన్‌మెంట్‌ను 158.645 కి.మీ.గా నిర్ధారించారు. నాలుగు జిల్లాలు.. 15 మండలాలు.. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం సంగారెడ్డి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో నిర్మితం కానుంది. ఈ జిల్లాల పరిధిలోని 15 మండలాలను అనుసంధానిస్తూ రూపుదిద్దుకుంటుంది. 120 గ్రామాల పరిధిలో భూసమీకరణ జరగనుంది. ఇందులో 80–82 గ్రామాల నుంచి సింహభాగం భూమిని సమీకరించనుండగా వాటికి కి.మీ. లోపు దూరంలో ఉండే మరో 38–40గ్రామాల నుంచి స్వల్పంగా సమీకరిస్తారు. అలైన్మెంట్లో భాగంగా ఆయా గ్రామాల పేర్లను గుర్తించి కేంద్రానికి పంపారు. మరో నెల రోజుల్లో భూసమీకరణ ప్రక్రియ ప్రారం భం కానుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. రూ. 7,512 కోట్ల నిర్మాణ వ్యయం అవుతుం దని అంచనా వేస్తున్న ఈ ప్రాజెక్టుకు 4 వేల ఎకరాల భూమిని సమీకరించనున్నారు. భూసేకరణకే దాదాపు రూ. 1,800 కోట్ల వరకు ఖర్చు కానుంది. ముందే వెల్లడించిన ‘సాక్షి’ ఎన్హెచ్ఏఐ తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేసిన విషయాన్ని పక్షం రోజుల కిందటే ‘సాక్షి’ఎక్స్‌క్లూజివ్‌గా వెల్లడించింది. మూడేళ్ల కిందట పాత కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన అలైన్‌మెంట్‌కు సవరణలు చేస్తూ ఆప్షన్–ఏను ఖరారు చేసిన విషయాన్ని పాఠకులకు అందించింది. ఇప్పుడు ఎన్హెచ్ఏఐ దాన్నే ఓకే చేసింది. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం నిర్మాణ పరిధిలోకి వచ్చే మండలాలు.. ► సంగారెడ్డి- సంగారెడ్డి, చౌటకూరు, హత్నూరు ► మెదక్- నర్సాపూర్, శివంపేట, తూప్రాన్ ► సిద్దిపేట- గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్‌పూర్ ► యాదాద్రి- తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ ► 158.465 కిలోమీటర్లు- ఉత్తర భాగం రహదారి మొత్తం పొడవు ► 4,000-ఎకరాలు సమీకరించే భూమి ► రూ. 7,512 కోట్ల అంచనా వ్యయం -
ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంటు ఖరారు. మూడేళ్ల కిందటిదే ఫైనల్ చేశారా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఉత్తర భాగం అలైన్‌మెంటు ఎట్టకేలకు ఖరారైంది. ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన కీలక సమావేశంలో అలైన్‌మెంట్‌పై నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు కన్సల్టెన్సీ బాధ్యతలు చూస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన కే అండ్ జే కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్హెచ్ఏఐకి అందజేసిన నాలుగు ఆప్షన్లలో అనుకూలమైన ఒకదాన్ని ఎంపిక చేశారు. దాదాపు మూడేళ్ల క్రితం నాటి పాత కన్సల్టెన్సీ సంస్థ అప్పట్లో రూపొందించిన అలైన్మెంటుకు పలు సవరణలతో రూపొందించిన దాన్ని ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీని ప్రకారమైతే నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుందని, ఇతరత్రా ఇబ్బందులు కూడా ఉండవని ఎన్హెచ్ఏఐ అభిప్రాయపడినట్టు సమాచారం. మొత్తం 157.2 కి.మీ నిడివి పాత అలైన్‌మెంట్‌కు ప్రస్తుత కన్సల్టెన్సీ సంస్థ దాదాపు 15 చోట్ల సవరణలు ప్రతిపాదించింది. మూడేళ్ల క్రితం పాత కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంట్‌ను ప్రతిపాదించే సమయంలో కాళేశ్వరం కాలువలు లేవు. ఇప్పుడు ఆ కాలువలు, కొన్ని కొత్త జలాశయ ఛానళ్లు తెరపైకి వచ్చాయి. దీంతో వాటికి ఇబ్బంది లేకుండా ఒక కి.మీ. నుంచి 5 కి.మీ దూరంతో కొత్త అలైన్మెంట్ సవరణలు ప్రతిపాదించారు. అయితే ఈ మార్పులతో పాత అలైన్‌మెంటు కంటే 1.2 కి.మీ మేర నిడివి తగ్గటం విశేషం. చాలా ప్రాంతాల్లో అలైన్‌మెంటును వెలుపలి నుంచి కాకుండా లోపలి నుంచి మార్చటంతో నిడివి తగ్గింది. పాత అలైన్మెంట్ 158.4 కి.మీ. ఉండగా, సవరణల తర్వాత కొత్త అలైన్మెంట్ 157.2 కిలోమీటర్లకు తగ్గింది. దీనికి రూ.7,900 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కి.మీ.కు భూ సమీకరణ ఖర్చు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు అవుతుందని, మొత్తంగా రూ.1600 కోట్ల వ్యయమవుతుందని సూచించినట్టు తెలిసింది. ఎలివేటెడ్ లేకుండా.. సాధారణంగా ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణంలో నీటి కాలువలను క్రాస్ చేయాల్సి వస్తే ఎలివేటెడ్ (పైనుంచి) పద్ధతిలో వాటిని దాటేలా రోడ్డును డిజైన్ చేస్తారు. ఎలివేటెడ్ పద్ధతిలో నిర్మాణానికి సాధారణం కంటే ఖర్చు 10 రెట్లు పెరుగుతుంది. తాజా అలైన్మెంటులో ఇలాంటివి దాదాపు పదికిపైగా ఉన్నందున, నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కాలువలను క్రాస్ చేయాల్సిన అవసరం లేకుండా వాటికి దూరం నుంచి వెళ్లేలా అలైన్‌మెంట్‌ను మార్చారు. గెజిట్‌లో 125 వరకు ఊళ్ల పేర్లు ఈ రోడ్డు 80 గ్రామాలపై నేరుగా ప్రభావం చూపించనుంది. ఇవి కాకుండా ఈ ఊళ్లకు కి.మీ. నుంచి కి.మీటరున్నర దూరంలో ఉన్న మరికొన్ని ఊళ్లను కూడా గెజిట్‌లో చేర్చి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. వెరసి ఈ ఉత్తర భాగం రోడ్డు నిర్మాణంలో 125 ఊళ్ల పేర్లను ప్రకటించనున్నట్టు తెలిసింది. మరో పక్షం రోజుల్లో గెజిట్ విడుదలకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. మరో రెండు నెలల్లో ఏ సర్వే నంబరులో ఎంత భూమిని సమీకరిస్తారో వివరాలు వెల్లడించనున్నారు. ఆ వెంటనే భూ సమీకరణ ప్రక్రియ మొదలు కానుంది. -
రీజినల్ రింగ్ రోడ్.. కొత్త దారిలో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రగతి ముఖచిత్రంలో కీలక మార్పులు తెస్తుందని భావిస్తున్న రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్లో మార్పులు జరుగనున్నాయి. నాలుగు వరుసలుగా చేపట్టే ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఏయే ప్రాంతాల మీదుగా నిర్మించాలన్న దానిపై స్పష్టత వచ్చినా.. క్షేత్రస్థాయిలో ప్రస్తుత అలైన్మెంట్ అనువుగా లేదని కన్సల్టెన్సీ సంస్థ తేల్చింది. పూర్తిగా కొత్త అలైన్మెంట్తో ఆర్ఆర్ఆర్ను చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ మేరకు పలు అంశాల ఆధారంగా నాలుగు కొత్త అలైన్మెంట్లు రూపొందించి ‘జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)’కుఅందజేసింది. దీనిలో ఏదో ఒకటి ఖరారు కాగానే మిగతా ప్రక్రియ మొదలుకానుంది. రెండున్నరేళ్ల మార్పులతో.. రీజనల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో కన్సల్టెన్సీగా వ్యవహరించిన ఓ బెంగళూరు సంస్థ.. గూగుల్‌మ్యాప్స్, అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఓ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. దాని ఆధారంగానే ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలను రూపొందించారు. కానీ ఆ అలైన్మెంట్ తయారై దాదాపు రెండున్నరేళ్లు గడిచింది. ఈలోగా క్షేత్రస్థాయిలో కొన్ని మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. మిషన్ భగీరథ పైపులైన్లు ఏర్పాటయ్యాయి, గోదావరి జలాల తరలింపు కాల్వలు, కొత్త రిజర్వాయర్లు నిర్మితమయ్యాయి. ఈ నేపథ్యంలో అలైన్మెంటులో మార్పులు జరగాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కొత్తగా ఏర్పాటైన కన్సల్టెన్సీ సంస్థ నూతన ప్రతిపాదనలను రూపొందించింది. కొత్త నిర్మాణాలు, అవసరాల మేరకు.. ప్రస్తుతం నాగ్‌పూర్‌కు చెందిన ‘కే అండ్ జే ప్రైవేట్ లిమిటెడ్’సంస్థ రీజనల్ రింగ్‌రోడ్డు కన్సల్టెన్సీ బాధ్యతలు చూస్తోంది. చెరువులు–కుంటలు, రిజర్వాయర్లు, ఇతర నీటి వనరులు, నివాస ప్రాంతాలు, గుట్టలు, రోడ్లు, రైలు మార్గాలు వంటి అడ్డంకులను బట్టి అలైన్‌మెంట్‌ను అటూఇటూ మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆర్ఆర్ఆర్ను గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (పూర్తిగా కొత్త రహదారి)గా నిర్మించాల్సి ఉండటంతో.. అవసరమైన భూమి మొత్తాన్నీ సమీకరించాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికితోడు ఎక్కడైనా నిర్మాణాలను తొలగించాల్సి వస్తే పరిహారం ఖర్చు పెరుగుతుంది. జల వనరులు ఉన్నచోట కాస్త దూరంగా నిర్మించాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అధ్యయనం చేసిన కన్సల్టెన్సీ.. నాలుగు వేర్వేరు అలైన్మెంట్లను రూపొందించింది. వీటిని పరిశీలించిన ఎన్హెచ్ఏఐ.. పలు మార్పులు చేర్పులు సూచించింది. ఈ మేరకు కన్సల్టెన్సీ సిబ్బంది నాలుగైదు రోజులుగా మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి అలైన్మెంట్లలో మార్పులు చేస్తున్నారు. కన్సల్టెన్సీ సంస్థ వారం పదిరోజుల్లో ఎన్హెచ్ఏఐకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. నాలుగు అలైన్మెంట్లలో ఖర్చు, నిర్మాణ అనుకూలత ఆధారంగా యోగ్యంగా ఉన్నదానిని ఎన్హెచ్ఏఐ ఎంపిక చేయనుంది. ఓఆర్ఆర్ నుంచి 40–50 కిలోమీటర్ల దూరంలో.. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుకు అవతల 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్‌రోడ్డును నిర్మించనున్నారు. కన్సల్టెన్సీ సంస్థ ఈ దూరం పరిధిలోనే నాలుగు అలైన్మెంట్లను ప్రతిపాదించింది. ఒక్కో అలైన్‌మెంట్‌కు మధ్య 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల తేడా ఉండేలా రూపొందించింది. అయితే ఓఆర్ఆర్ నుంచి దూరం పెరిగేకొద్దీ రీజనల్ రింగురోడ్డు పొడవు, నిర్మాణ ఖర్చు పెరుగుతాయి. అదే సమయంలో జనావాసాలు, ఇతర నిర్మాణాలకు దూరంగా ఉండటం వల్ల పరిహారం ఖర్చు తగ్గుతుంది. ఇలాంటి అంశాలను పరిశీలించి.. అలైన్‌మెంట్‌ను ఎంపిక చేయనున్నారు. భూసేకరణే కీలకం.. ఆర్ఆర్ఆర్ తుది అలైన్మెంట్ ఖరారయ్యాక భూసేకరణ కీలకంగా మారనుంది. తొలుత అవసరమైన భూమి, ఇతర వనరులు, అవసరాలను గుర్తిస్తారు. డీపీఆర్ తయారు చేస్తారు. వీటికే ఆరు నెలల వరకు సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. భూసేకరణకు సంబంధించి పరిహారం, ఇతర వివాదాలు, కోర్టు కేసుల వంటి సమస్యలు ఏర్పడితే నిర్మాణంలో జాప్యం జరగవచ్చని అంటున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు తరహాలో వివాదాల్లేని ప్రాంతాల్లో ముందు నిర్మిస్తూ వెళితే.. ఆర్ఆర్ఆర్ త్వరగా పూర్తవుతుందని పేర్కొంటున్నారు. -
RRR: ‘ఆర్ఆర్ఆర్’ పనులు షురూ!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘రీజనల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)’ అలైన్మెంట్ ఖరారు పనులు మొదలయ్యాయి. ప్రాజెక్టు కన్సల్టెంట్ సంస్థ కేఅండ్‌జే ప్రైవేటు లిమిటెడ్.. నాలుగు రోజులుగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)కు 50–70 కిలోమీటర్ల అవతల 339 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగు రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని రెండు భాగాలుగా విభజించారు. అందులో ఉత్తర భాగం అయిన సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–గజ్వేల్–ప్రజ్ఞాపూర్–జగదేవ్‌పూర్–యాదగిరిగుట్ట–భువనగిరి–చౌటుప్పల్ వరకు ఉండే 164 కిలోమీటర్ల రోడ్డును కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పరియోజన ప్రాజెక్టులో చేర్చింది. ఈ భాగం నిర్మాణానికి రూ.9,500 కోట్లు ఖర్చవుతాయని ప్రస్తుత అంచనా. ఈ భాగానికి సంబంధించి తుది అలైన్మెంట్ ఖరారు పనిని కన్సల్టెన్సీ సంస్థ ప్రారంభించింది. ప్రాథమిక అలైన్మెంట్ వెంట.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో కన్సల్టెన్సీ సేవలు అందించిన బెంగుళూరు సంస్థ ప్రాథమికంగా ఒక అలైన్‌మెంటును నిర్ధారించింది. అక్షాంశ, రేఖాంశాలు, గూగుల్ మ్యాప్ ఆధారంగా దానిని రూపొందించారు. ఇప్పుడా అలైన్మెంట్ ఆధారంగానే క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. మార్గమధ్యలో నీటి వనరులు, భారీ నిర్మాణాలు, కొండలు, గుట్టల వంటివి ఎక్కడైనా అడ్డుగా వస్తాయా అనేది పరిశీలించి.. రోడ్డు అలైన్‌మెంట్‌ను పక్కకు మార్చనున్నారు. ముఖ్యంగా ఇటీవల పలు ప్రాంతాలకు కాళేశ్వరం నీటిని తరలించే కాల్వలు నిర్మించారు. ఆయాచోట్ల పరిస్థితికి తగినట్టు అలైన్మెంట్లో మార్పులు, చేర్పులు చేయనున్నారు. రీజనల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని.. త్వరగా కసరత్తు పూర్తి చేయాలని కన్సల్టెన్సీని కేంద్రం ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల్లో అలైన్మెంట్ ఖరారు పూర్తిచేసి, ఏయే ప్రాంతాల్లో ఎంత భూమి సేకరించాలనే విషయంలో స్పష్టత ఇచ్చే దిశగా కన్సల్టెన్సీ చర్యలు చేపట్టినట్టు సమాచారం. ►ఆర్ఆర్ఆర్ను ప్రస్తుతం నాలుగు వరుసల్లో ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనున్నారు. భవిష్యత్తులో ఎనిమిది వరుసలకు విస్తరిస్తారు. ఇందులో ప్రధాన రోడ్డుతోపాటు సర్వీసు రోడ్లు ఉంటాయి. మొత్తం ఎనిమిది వరుసల రహదారి 80 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. మరో 20 మీటర్ల అదనపు స్థలాన్ని చేర్చి.. 100 మీటర్ల వెడల్పు ఉండేలా భూమిని సేకరించనున్నారు. నేతల ఒత్తిళ్ల మధ్య.. రీజనల్ రింగు రోడ్డు ప్రతిపాదన రాగానే నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకే భూములు కొన్నారు. ఇప్పుడా భూములకు చేరువగా రోడ్డు ఉండాలని, అదే సమయంలో తమ స్థలాలపై నుంచి నిర్మించవద్దని ఆశిస్తున్నారు. కాస్త పలుకుబడి ఉన్న బడా వ్యక్తులు అలైన్మెంట్ ఖరారుపై ప్రభావం చూపేలా ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని, అలైన్‌మెంట్‌కు సంబంధించి స్థానికంగా ఎలాంటి ప్రకటనలూ చేయొద్దని కన్సల్టెన్సీని కేంద్రం ఆదేశించినట్టు తెలిసింది. ఆర్ఆర్ఆర్ను ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తుండటంతో వంపులు లేకుండా చూడాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ దక్షిణ భాగంపై పరిశీలన రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగాన్ని కేంద్రం జాతీయ రహదారి కింద నిర్మిస్తోంది. ఈ భాగంలో ప్రతిపాదిత పట్టణాలను అనుసంధానిస్తూ ఇప్పటికే రోడ్లు ఉన్నాయి. వాటిమీదుగా పెద్ద సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీనిని ఆసరా చేసుకుని కొత్తరోడ్డు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో ప్రతిపాదిత పట్టణాల (చౌటుప్పల్–ఇబ్రహీంపట్నం–కందుకూరు–అమన్‌గల్–చేవెళ్ల–శంకర్పల్లి–కంది–సంగారెడ్డి)లను అనుసంధానిస్తూ పెద్ద రోడ్లు లేవు. ఎన్ని వాహనాలు తిరుగుతాయన్న స్పష్టత లేదు. దీంతో ఆ లెక్కలు తేల్చాలని జాతీయ రహదారుల విభాగాన్ని కేంద్రం ఆదేశించింది. అధికారులు అధ్యయనం చేసి వారం క్రితం కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఈ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మించడంపై త్వరలో స్పష్టత రానుంది. -
అదిగో..అదిగదిగో..!
మూడేళ్ల ముచ్చట ‘మెట్రో’ పరుగులు వాయిదా సిటీబ్యూరో: గ్రేటర్లో మెట్రో కల రోజు రోజుకూ దూరమవుతోంది. అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తున్న మెట్రో ప్రారంభోత్సవం వాయిదా పడుతూనే వస్తోంది. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల మార్గంలో పనులు జరుగుతున్నాయి. 2012లో మొదలైన పనుల్లో ఇప్పటివరకు 75 శాతం మేర పనులు పూర్తయ్యాయి. నాగోల్–మెట్టుగూడ(8కి.మీ), మియాపూర్–ఎస్.ఆర్.నగర్(12కి.మీ) రూట్లలో మెట్రో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేయలేదు.వివిధ సమస్యల కారణంగా గడువు 2017 జూన్ నుంచి 2018 డిసెంబరుకు చేరుకొంది.పాతనగరంలో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో 5.3 కి.మీ మార్గంలో అలైన్మెంట్ ఖరారు చేయకపోవడంతో ఈ రూట్లో పనులు నిలిచాయి. -
పాతబస్తీ... మెట్రో నాస్తి?
⇒18 నెలల ఆలస్యంతో ఆర్థిక భారం... ⇒పెరిగిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్మాణ సంస్థ పేచీ! ⇒జూన్‌లో మియాపూర్– ఎస్.ఆర్.నగర్ రూట్లోనే ⇒మెట్రో పరుగులు.. పాతబస్తీ రూట్‌పై ఇంకా లేని స్పష్టత సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో ప్రాజెక్టు పాతనగరవాసులకు ‘కల’గానే మిగలనుంది. ప్రస్తుతం మెట్రో పనుల పురోగతి చూస్తే ఇదే విషయం సుస్పష్టమవుతోంది. సిటీలో నాగోల్–రాయదుర్గం (28 కి.మీ), ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ), జేబీఎస్–ఎంజీబీఎస్ (10 కి.మీ) మార్గాల్లోనే మెట్రో పనులు ఊపందుకున్నాయి. కానీ ఎంజీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో సుమారు 5.3 కి.మీ మార్గంలో మెట్రో మార్గాన్ని ప్రభుత్వం ఖరారు చేయకపోవడంతో పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మెట్రో రెండోదశ ప్రాజెక్టు సైతం కాగితాలకే పరిమితమైంది. ఇక ఈ ఏడాది జూన్‌లో మియాపూర్–ఎస్.ఆర్‌నగర్ రూట్లోనే మెట్రోరైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నట్లు తెలిసింది. నాగోల్–బేగంపేట్ మార్గంలో మెట్రో పరుగులకు పలు అడ్డంకులున్నాయి. ప్రధానంగా బేగంపేట్, సికింద్రాబాద్ ఒలిఫెంటా రైలు ఓవర్బ్రిడ్జిల నిర్మాణం అసంపూర్తిగా మిగలడంతో ఈ రూట్లో మెట్రో రైళ్లు కూతపెట్టే అవకాశాలు కనిపించడంలేదు. నగరంలో మెట్రో పనులు ప్రారంభమై సుమారు ఐదేళ్లు కావస్తోంది. కానీ పాతనగరంలో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో ఇప్పటివరకు పనులు ఊపందుకోలేదు. ప్రధానంగా ఈ రూట్లో 30కి పైగా ఉన్న ప్రార్థనాస్థలాల మనుగడకు ముప్పు వాటిల్లకుండా మెట్రో మార్గాన్ని మూసీనది మధ్యనుంచి మళ్లించాలని అప్పట్లో కొన్ని రాజకీయపార్టీలు డిమాండ్‌చేశాయి. దీంతో రెండేళ్లక్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో మార్గాన్ని మార్చుతామని ప్రకటించింది. ఈ అంశంపై నగరంలోని అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తరవాతనే అలైన్మెంట్ ఖరారు చేస్తామని తెలిపింది. కానీ ఇప్పటివరకు సమావేశం నిర్వహించలేదు. అలైన్మెంట్ ఖరారు చేయలేదు. ఇక మెట్రో మార్గాన్ని మూసీ నదీగర్భం నుంచి మళ్లిస్తే నిర్మాణ పరంగా పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని, వాణిజ్యపరంగా తమకు గిట్టుబాటుకాదని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వర్గాలు ప్రభుత్వానికి స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో మెట్రో మార్గం కలగానే మిగలనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఆలస్యంతో నాలుగువేల కోట్ల భారం.. గ్రేటర్లో మెట్రో పనులు 2012 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. నిర్మాణ ఒప్పందం ప్రకారం ఈ పనులను 2017 జూన్ నాటికి పూర్తిచేయాల్సి ఉంది. కానీ ఆస్తులసేకరణ ప్రక్రియ జఠిలంగా మారడం, కోర్టుకేసులు, రద్దీరూట్లలో పనులు చేపట్టేందుకు రైట్‌ఆఫ్‌వే సమస్యలు తలెత్తడం.. వెరసి ప్రాజెక్టును పూర్తిచేసే గడువు 2018 డిసెంబరుకు పొడిగించారు. దీంతో తొలుత అనుకున్న నిర్మాణ వ్యయం రూ.12,132 కోట్ల నుంచి ఇప్పుడు రూ.16,375 కోట్లకు చేరింది. ద్రవ్యోల్బణం, సిమెంటు, స్టీలు ధరల్లో హెచ్చుతగ్గులు, సిబ్బంది జీతభత్యాలు, యంత్రపరికరాల దిగుమతులు, వాటి అద్దెలు, నిర్మాణం కోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీరేటు పెరగడం వంటి కారణాలతో వ్యయం రూ.4243 కోట్ల మేర పెరిగినట్లు తెలిసింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమకు పరిహారంగా చెల్లించాలని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతనీయకపోవడం గమనార్హం. జూన్‌లో మియాపూర్– ఎస్.ఆర్.నగర్ రూట్లోనే పరుగులు? ఈ ఏడాది జూన్ నెలలో మియాపూర్–ఎస్.ఆర్.నగర్(14 కి.మీ) రూట్లోనే మెట్రోరైళ్లు పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నాగోల్–బేగంపేట్ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీయాలంటే బేగంపేట్, సికింద్రాబాద్ ఒలిఫెంటా రైలు ఓవర్బ్రిడ్జిల నిర్మాణాలను పూర్తిచేయాల్సి ఉంది. ఈ పనులను మే నెలాఖరునాటికి పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ పనులు ఆలస్యమైతే జూన్‌లో ప్రారంభించే అవకాశాలు లేనట్టే. కాగా ఈ ఏడాది డిసెంబరు నాటికి నాగోల్–రాయదుర్గం(28 కి.మీ), ఎల్బీనగర్–మియాపూర్ (29కి.మీ)మార్గాల్లో మెట్రో మార్గాన్ని పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ వర్గాలు ప్రకటించాయి. కాగితాలపైనే రెండోదశ... మెట్రో తొలిదశ పనులు ఊపందుకున్న తరుణంలో ప్రభుత్వం మెట్రో రెండోదశ ప్రాజెక్టును చేపడతామని రెండేళ్లక్రితం ఆర్భాటంగా ప్రకటించింది. పలు రూట్లలో సుమారు 56 కి.మీ మార్గంలో రెండోదశ మెట్రోను ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్,హైదరాబాద్ మెట్రోరైలు,ఎల్అండ్టీ సంస్థల ప్రతినిధులు ఏడాదిక్రితం ప్రతిపాదిత మార్గాల్లో పరిశీలన జరిపి సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఏడాది కావస్తున్నా ఈవిషయంలో ఒక్క అడుగూ ముందుకుపడకపోవడం గమనార్హం. ప్రస్తుతం పనుల పురోగతి ఇదీ.. ⇒మూడు మార్గాల్లో మొత్తం 67 కి.మీ మార్గానికి గాను 52 కి.మీ మార్గంలో మెట్రో పిల్లర్ల నిర్మాణం, వీటిపై మెట్రోరైళ్లు పరుగులు తీసేందుకు వీలుగా వయాడక్ట్మార్గం సిద్ధమైంది. ⇒మొత్తం 65 స్టేషన్లకుగాను 40 స్టేషన్లు సిద్ధమయ్యాయి. మరో 25 స్టేషన్ల నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. ⇒మొత్తం ప్రాజెక్టును 2018 డిసెంబరునాటికి పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ చెబుతోంది. ⇒మూడు రూట్లలో పరుగులుతీసేందుకు 57 మెట్రోరైళ్లు మియాపూర్, ఉప్పల్ మెట్రో డిపోల్లో సిద్ధంగా ఉన్నాయి. అసంపూర్తిగా మిగిలిన పనులివీ.. ⇒ మొత్తం 65 స్టేషన్లలో 17 స్టేషన్లకు మాత్రమే పార్కింగ్ వసతులున్నాయి. మిగతా వాటికి పార్కింగ్ స్థలాల లభ్యత కష్టసాధ్యంగా మారింది. ⇒ ఎల్భీనగర్–మియాపూర్ మార్గంలో: అసెంబ్లీ స్టేషన్ నిర్మాణం మొదలుకాలేదు. 19 పిల్లర్లు, 8 పునాదులు అసంపూర్తిగా ఉన్నాయి. లక్డీకాపూల్, మలక్‌పేట్ ఆర్ఓబీల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ⇒జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో: బోయిగూడ స్టీలు బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు. నారాయణగూడ ఫ్లైఓవర్, పుత్లీబౌలి మెట్రో మార్గం పైనుంచి మెట్రో వయాడక్ట్ నిర్మాణం ప్రారంభంకాలేదు. ⇒నాగోల్–రాయదుర్గం మార్గంలో:ఒలిఫెంటా,బేగంపేట్ రైలు ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణం పూర్తికాలేదు. అమీర్‌పేట్ మైత్రీవనం,యూసుఫ్‌గూడా ప్రాంతాల్లో వయాడక్ట్ మార్గం పూర్తికాలేదు. ⇒సుమారు వంద ఆస్తుల సేకరణకు సంబంధించి బాధితులకు పరిహారం అందించకపోవడం,న్యాయవివాదాలు పనుల వేగాన్ని దెబ్బతీస్తున్నాయి. -
తుదిదశకు ‘డిండి’ అలైన్మెంట్!
సాక్షి, హైదరాబాద్: డిండి ప్రాజెక్టు అలైన్‌మెంట్‌కు వ్యాప్కోస్ సూచించిన రెండో ప్రతిపాదన దాదాపు ఖాయమైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అంత ర్భాగంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే ఈ ప్రక్రియకు నీటి పారుదల శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, ఈ అలైన్ మెంట్ కారణంగా కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టుకు కలిగే నష్టాన్ని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం చేయనుంది. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని మహబూబ్‌నగర్ జిల్లా నేతలు అభ్యంత రాలు లేవనెత్తారు. దీంతో కల్వకుర్తి ఆయకట్టుకు నష్టంలేకుండా నీటిని తీసుకెళ్లే ప్రత్యామ్నాయాలపై నివేదిక ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యాప్కోస్ సంస్థకు ఆదేశాలిచ్చారు. వ్యాప్కోస్ 5 ప్రత్యామ్నాయాలను చూపింది. రెండో ప్రతిపాదనలో రంగాయపల్లి పంప్‌హౌస్‌లో పంపింగ్ మెయిన్ తగ్గించి, గ్రావిటీ టన్నెల్ ఏర్పాటు చేయాలని, దీనికి 3,384.47కోట్లు అవుతుందని తెలిపింది. నార్లాపూర్ నుంచి డిండికి 50 కి.మీ. దూరం కాల్వల ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా దీన్ని ప్రతిపాదించారు. -
మారిన రీజినల్ రింగ్ రోడ్డు
ఫార్మాకు దక్షిణం వైపు రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చేందుకు సర్కారు కసరత్తు భవిష్యత్తు అవసరాల కోసం తప్పదన్న కన్సల్టెన్సీ నేడు జరిగే సమావేశంలో తుది నిర్ణయం రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) దిశ మార్చుకుంటోంది. ఔషధనగరి (ఫార్మాసిటీ) సమీపంలో ఈ రోడ్డు అలైన్మెంట్ మారుతోంది. ప్రతిష్టాత్మక ఫార్మాసిటీకి దక్షిణం వైపు నుంచి ఈ మార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆవల నుంచి ప్రాంతీయ బాహ్య వలయ దారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిపై వాహనాల భారం తగ్గించే లా 338 కిలోమీటర్ల మేర ఈ రహదారిని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా నిర్మాణ వ్యయాన్ని భరించేం దుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కింద ఈ రోడ్డును చేపట్టేలా ఖరారు చేయాలని, సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావించింది. అయితే, ఆదిలోనే హంసపాదులా ఫార్మాసిటీ రూపంలో ఈ రోడ్డుకు అడ్డంకి వచ్చింది. కందుకూరు, యాచారం, కడ్తాల మండలాల పరిధిలో దాదాపు 19వేల ఎకరాల విస్తీర్ణంలో ఔషధన గరిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగా ఇప్పటికే దాదాపు ఏడు వేల ఎకరాల భూమిని కూడా సేకరించింది. ఈ ఏడాది చివరినాటికి ప్రాజెక్టుకు భూమి పూజ కూడా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం–సాగర్ హైవేల మధ్య 11 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తోంది. రింగ్‌రోడ్డుతో భారీ నష్టం! అత్యున్నతస్థాయి ప్రమాణాలతో ప్రపంచంలోనే మూడో అతిపెద్దదిగా ఆభివర్ణిస్తున్న ఫార్మాసిటీకి రీజిన ల్ రింగ్‌రోడ్డుతో నష్టం వాటిల్లనుందని ఈ ప్రాజెక్టుకు మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్న ‘సురబాన జ్యూరంగ్’ కన్సల్టెన్సీ తేల్చిచెప్పింది. ఔషధనగరికి ఉత్తరం వైపు నుంచి రింగ్‌రోడ్డును ప్రతిపాదిస్తూ హెచ్ఎం డీఏ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచింది. ఈ ప్రతిపాదిత రహదారితో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని, వీటిని అధిగమించేందుకు దక్షిణ దిశలో రీజినల్ రింగ్‌రోడ్డును నిర్మించ డం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తద్వారా ఔషధనగరికి ఇబ్బంది కలుగకుండా.. సాధారణ ప్రయాణికులు ఆవస్థల పాలుగాకుండా నివారించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వాని కి ఇటీవల నివేదిక ఇచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం షాద్‌నగర్ మీదుగా కందుకూరు మండలం కొత్తూ రు నుంచి మంచాల మండలం ఆగాపల్లి మీదుగా సాగుతుంది. ప్రతిపాదనలు పరిశీలిస్తే.. కడ్తాల సమీపం గుండా ఈ రహదారిని నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నేడు కీలక సమావేశం రీజినల్ రింగ్‌రోడ్డు రీఅలైన్మెంట్పై బుధవారం సచివాలయంలో అత్యున్నతస్థాయి సమావేశంలో జరుగుతోంది. ఈ సమావేశంలో ఫార్మాసిటీ సమీపంలో ఈ రహదారి అలైన్మెంట్ మార్పుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆర్అండ్బీ, పరిశ్రమలు, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శులు, హెచ్ఎండీఏ కమిషనర్, ఎన్హెచ్ఐఏ ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాల్గొనున్నారు. -
మెట్రో ఎలైన్‌మెంట్‌లో మరో మార్పు
మారనున్న బందరు రోడ్డు కారిడార్ కాలువ వైపు జరగనున్న ఎలైన్మెంట్ బస్టాండ్ - రైల్వే పార్శిల్ కార్యాలయం రూట్ సౌత్ గేటు వరకు మార్పు పోలీస్ కంట్రోల్ రూమ్, ‘ఫైర్’ కార్యాలయం సేఫ్ విజయవాడ బ్యూరో : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌లో మరో మార్పు చోటు చేసుకోనుంది. బందరు రోడ్డు కారిడార్‌లో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి రాఘవయ్య పార్కు వరకు ఎలైన్‌మెంట్‌ను మార్చనున్నారు. ఇప్పటికే ఏలూరు రోడ్డు కారిడార్ ప్రారంభంలో మార్పులు చేశారు. తాజాగా కృష్ణలంక జాతీయ రహదారి విస్తరణ బందరు రోడ్డు కారిడార్‌కు అడ్డంకిగా మారడంతో అక్కడా మార్పులు ప్రతిపాదించనున్నారు. గతంలో కారిడార్‌ను బస్టాండ్ నుంచి రాఘవయ్య పార్కు వరకు కృష్ణలంక వైపు నిర్మించేందుకు ఎలైన్మెంట్ రూపొందించారు. కానీ ప్రస్తుతం ఈ రహదారిని విస్తరిస్తుండడంతో పాత ఎలైన్మెంట్ ప్రకారం కారిడార్ సరిగ్గా రోడ్డు మధ్యలో వస్తుంది. దీనివల్ల ఇబ్బంది వస్తుందనే కారణంతో రోడ్డుతో సంబంధం లేకుండా కారిడార్‌ను కాలువ వైపునకు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్) సర్వే నిర్వహిస్తోంది. సర్వే అనంతరం ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేయనుంది. గతంలో బస్టాండ్ నుంచి రైల్వే పార్శిల్ కార్యాలయం వరకు బందరు రోడ్డు కారిడార్‌లో ఒక భాగాన్ని నిర్మించాల్సి ఉండగా దాన్ని పక్కకు జరిపి రైవస్ కాలువ, తుమ్మలపల్లి కళాక్షేత్రం మీదుగా రైల్వే స్టేషన్ సౌత్ గేటు వరకు మార్చారు. దీనివల్ల పోలీస్ కంట్రోల్‌రూమ్, అగ్నిమాపక శాఖ రాష్ట్ర కార్యాలయాలను తొలగించాల్సిన అవసరం లేకుండా పోయింది. మెట్రో భూసేకరణకు కసరత్తు మరోవైపు మెట్రో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూమిని తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఏలూరు, బందరు రోడ్డులలో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన చోట భూమిని సేకరించాల్సి ఉంది. ఎక్కడెక్కడ భూమి అవసరమవుతుందనే దానిపై డీఎంఆర్సీ రూపొందించిన నివేదిక ప్రకారం రెవెన్యూ అధికారులు గతంలో సర్వే చేశారు. దాని ప్రకారం ఆ రోడ్ల పక్కనున్న భూములకు సంబంధించిన యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నిడమానూరు వద్ద కోచ్ డిపో కోసం 60 ఎకరాలు సేకరించాల్సి ఉండడంతో దానిపైనా రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కానీ అక్కడి రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో కొంత వెనక్కు తగ్గినా వారిని ఒప్పించి ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. -
పిల్లల్లో మెల్లకన్నుకు చికిత్స ఎలా?
పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 3 నెలలు. బొమ్మలను అతడి ముఖానికి దగ్గరగా పెట్టినప్పుడు, వాడు ఆ బొమ్మలను చూసే విధానాన్ని చూస్తుంటే వాడికి మెల్లకన్ను ఉందేమో అనిపిస్తోంది. వాడి విషయంలో నాకు సరైన సలహా ఇవ్వండి. - సరళ, భద్రాచలం సాధారణంగా చిన్నారుల కళ్లు ఆర్నెలు వచ్చాకే ఒక అలైన్మెంట్తో ఉంటాయి. ఆర్నెల్ల కంటే ముందుగా గమనించినప్పుడు చాలామంది చిన్నారుల కళ్లలోని నల్లగుడ్లలో ఒకటి... లోపలివైపునకు (ఈసోట్రోపియా) చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. మీ అబ్బాయికి ఇంకా కేవలం మూడు నెలల వయసే కాబట్టి మీరు అతడికి మెల్లకన్ను ఉందేమోనని ప్రస్తుతానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతడికి ఆర్నెల్ల వయసు వచ్చాక కూడా మీరు చెప్పినట్లుగానే అతడి కనుగుడ్లలో ఒకటి లోపలివైపునకు చూస్తుంటే మాత్రం తప్పకుండా పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్‌కు చూపించాల్సి ఉంటుంది. మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే మెల్లకన్ను ఉన్న కనుగుడ్డు ఆంబ్లోపియా (లేజీ ఐ... అంటే సరిగా చూడలేని కన్ను నుంచి మెదడు సిగ్నల్స్‌ను స్వీకరించకపోవడం వల్ల క్రమంగా ఆ కంటి చూపు తగ్గిపోవడం) వచ్చి సాధారణ పిల్లలు రెండుకళ్లతో ఒకే దృశ్యాన్ని మాత్రమే చూసే బైనాక్యులార్ విజన్‌నూ, 3-డీ విజన్‌నూ చూడలేకపోవచ్చు. అందుకే మీ చిన్నారికి ఆర్నెల్లు వచ్చాక మీరు ఒకసారి తప్పనిసరిగా పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్‌కు చూపించండి. మా పాపకు నాలుగేళ్లు. మూడేళ్ల వయసు నుంచి ఆమెకు మెల్లకన్ను ఉన్నట్లు గుర్తించాను. ప్రత్యేకంగా ఆమె దేనినైనా తదేకంగా చూస్తున్నప్పుడు మెల్లకన్ను పెడుతోంది. మాకు తెలిసిన కంటి డాక్టర్‌ను సంప్రదిస్తే ఆమెకు కళ్లజోడు అవసరమని చెప్పారు. ఇంత చిన్న పాపకు కళ్లజోడు అవసరమా? ఆమె మెల్లకన్ను విషయంలో ఇంకేదైనా చికిత్స ఉందా? - కోమల, సూళ్లూరుపేట మీరు చెప్పిన వివరాల ప్రకారం బహుశా మీ పాపకు అకామడేటివ్ ఈసోట్రోపియా అనే కండిషన్ ఉండవచ్చు. ఇలాంటి మెల్లకన్ను దూరదృష్టి (హైపర్‌మెట్రోపియా)ని సరిచేయకపోవడం వల్ల వస్తుంది. ఇది సాధారణంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో మొదలవుతుంది. ఏదైనా చదివే సమయంలో సరిగా కనిపించనప్పుడు తదేకంగా చూస్తూ తనకు కనిపిస్తున్నదాన్ని స్పష్టంగా చూసేందుకు అకామడేట్ చేసే ప్రయత్నంలో ఈ కండిషన్ మొదలువుతుంది. అదే క్రమంగా మెల్లకన్నుకు దారితీస్తుంది. మీ పాప కంటి సమస్యను చక్కదిద్దడానికి ప్లస్ పవర్ ఉన్న లెన్స్‌లను (అద్దాలను) కంటివైద్యనిపుణులు సూచిస్తారు. ఈ కంటి అద్దాలను ఆరు వారాల పాటు వాడాక అప్పుడు మళ్లీ మెల్లకన్ను ఎంత ఉందో చూస్తారు. ఈ క్రమంలో మెల్లకన్ను తగ్గిపోతే ఇక ఆమెకు ఎలాంటి చికిత్సా అవసరం లేదు. ఇంత చిన్నవయసులో కళ్లజోడు ఎందుకు అంటూ మీరు నిర్లక్ష్యం చేసే ఆంబ్లోపియా అనే కండిషన్ వచ్చి, ఆమె ఒక కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉంది. డాక్టర్ రచన వినయకుమార్ పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్ - స్క్వింట్ స్పెషలిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా భర్తకు మైట్రల్‌వాల్వ్ సమస్య..! నా భర్త వయసు 31 ఏళ్లు. ఆయన మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్‌తో సరిగా మూసుకోవడం లేదు. దీనికి తోడు సివియర్ మైట్రల్ వాల్వ్ రిగర్జిటేషన్ (అంటే ఆ వాల్వ్ సరిగా మూసుకుపోకపోవడం వల్ల రక్తం ముందుకెళ్లకుండా రివర్స్‌లో ప్రవహిస్తోంది) తో బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం సర్జరీ కోసం వేచిచూస్తున్నారు. ఆయనకు ఎలాంటి కృత్రిమ వాల్వ్ వేయడం మంచిది? లోహంతో చేసిన వాల్వ్ వేయడం వల్ల భవిష్యత్తులో గుండెపోటు/పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయా? ఇది వంశపారంపర్యంగా వచ్చే కండిషనా? నాకు తగిన సలహా ఇవ్వగలరు. - మానస, చెన్నై మీ భర్త వయసు చిన్నదే కాబట్టి... ఏదైనా రక్తస్రావం అయ్యేందుకు అవకాశాలు ఉండటం లాంటి ఇతరత్రా సమస్యలుంటే తప్ప మెకానికల్ వాల్వ్ ఆయనకు మంచిది. అయితే మైట్రల్ వాల్వ్‌ను పూర్తిగా తొలగించి, కొత్త వాల్వ్ వేయడం కంటే మైట్రల్ వాల్వ్‌ను రిపేర్ చేయడం ఇంకా మంచిది. కాబట్టి ఈ విషయంలో ఒకసారి మీరు మీ భర్తకు ఆపరేషన్ చేసే సర్జన్‌తో సంప్రదించడం మేలు. మైట్రల్ వాల్వ్‌ను మార్చే బదులు దాని రిపేర్‌కు అవకాశం ఉందా అని మీ సర్జన్‌ను అడగండి. ప్రోస్థెటిక్ హార్ట్ వాల్వ్స్ విషయంలో గుండెపోటుకు / పక్షవాతానికీ (స్ట్రోక్‌కు) ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అయితే మీరు రక్తాన్ని పలచబార్చే మందలను నిత్యం క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. రక్తాన్ని పలచబార్చే మందుల వల్ల రక్తం ఎలాంటి ఆటంకం లేకుండా రక్తనాళాల్లో ప్రవహిస్తుంది. అయితే ఇదే సమయంలో మరో ప్రమాదం మరోవైపు నుంచి పొంచి ఉంటుంది. మనం రక్తాన్ని పలచబార్చే మందులు వాడుతుంటాం కాబట్టి, ఇలా బాగా పలచబారిన రక్తం మెదడులో ఎక్కడైనా లీకైనా లేదా బాగా చిక్కబడి మెదడులోని రక్తనాళాల్లో ఎక్కడైనా గడ్డలా మారి ప్రవాహానికి అడ్డుపడ్డా (క్లాట్ ఏర్పడినా) అది ప్రమాదకరంగా మారవచ్చు. ఇలా రక్తన్ని పలచబార్చే మందును తగిన మోతాదులో ఉంచి అది 3 - 3.5 కొలతలో నిత్యం ఉండేలా చూస్తే పక్షవాతం వచ్చే అవకాశాలు తక్కువ. ఇక మీ భర్తకు చేసేది ఓపెన్ హార్ట్ సర్జరీ. కాబట్టి దీన్ని చాలా పెద్దదిగానూ, క్లిష్టమైనదిగానూ పరిగణించాలి. అయితే ఇంత క్లిష్టమైనప్పటికీ పెద్ద సెంటర్లలో వీటిని చాలా తరచుగా (రొటీన్‌గా) చేస్తూనే ఉన్నారు. కాబట్టి అన్ని వసతులు ఉన్న మంచి పెద్దాసుపత్రిని ఎంచుకోండి. ఇతరత్రా కాంప్లికేషన్లు వస్తే తప్ప ఇందులో 2-3 % మాత్రమే రిస్క్ ఉంటుంది. ఇక మీరు అడిగినట్లుగా ఇది వంశపారంపర్యంగా వస్తుందనే విషయంపై ఎలాంటి ఆధారాలు లేవు. కానీ దీనికి జన్యుప్రాతిపదిక ఉందని కొందరు చెబుతుంటారు. అయితే ఈ విషయం మీద ఎక్కువగా ఆలోచించి మీ పిల్లలకూ ఇది వస్తుందేమోనని ఆందోళన చెందడం అనవసరం. టీబీ కౌన్సెలింగ్ ఆ టీబీ మందులకు లొంగడంలేదు..! మా నాన్నగారు చాలా ఎక్కువగా మద్యం తాగుతుంటారు. అలాగే పొగతాగడం కూడా ఎక్కువే. ఆయనకు పల్మునరీ ట్యూబర్క్యులోసొసిస్ అనే జబ్బు వచ్చింది. అయితే ఆయన చికిత్స విషయంలో కాస్తంత నిర్లక్ష్యం వహించారు. కొంతకాలం మందులు తీసుకోవడం, ఆ తర్వాత ఆపేయడం.... ఇలా చేశారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ టీబీ వచ్చింది. డాక్టర్లు చూసి దాన్ని ‘ఎమ్‌డీఆర్ టీబీ’ అంటున్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు మేమేం చేయాలి. సలహా ఇవ్వగలరు. - సోమేశ్, కందుకూరు మన శరీరంలో టీబీ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా (ట్యూబర్క్యులోసిస్ బాసిల్లస్) ప్రవేశించినప్పుడు కొన్ని సూక్ష్మజీవులను నిర్మూలించే అత్యంత శక్తిమంతమైన మందులైన ఐసోనియాజైడ్, రిఫాంపిసిన్ వంటి వాటితో చికిత్స చేస్తుంటాం. ఇలా ఆర్నెల్ల పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఈ మందుల పూర్తి కోర్సును తీసుకుంటేనే టీబీ పూర్తిగా తగ్గుతుంది. అలాగాకుండా ఒకవేళ ఈ మందులను నిర్లక్ష్యంగా వాడినా లేదా తగిన మోతాదులో వాడకపోయినా, లేదా కొంతకాలం వాడాక లక్షణాలు తగ్గగానే మళ్లీ ఆపేసినా లేదా మందులను సరిగా నిల్వ చేయకపోయినా... వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములు ఆ మందులకు లొంగని విధంగా తయారవుతాయి. అత్యంత శక్తిమంతమైన ఆ టీబీ మందుల పట్ల తమ నిరోధకత స్థాయిని పెంచుకుంటాయి. దాంతో అవి తమ శక్తిని పెంచుకోవడమే కాదు... ఇతర ఆరోగ్యవంతులైన వ్యక్తులకూ వ్యాపించే విధంగా తయారవుతాయి. ఒక వ్యక్తిలోని టీబీ వ్యాధి మందులకు లొంగని విధంగా తయారయ్యిందా అని నిర్ధారణ చేయడానికి కొన్ని ల్యాబరేటరీ పరీక్షలు అవసరమవుతాయి. ఆ పరీక్షల ద్వారా మందులకు లొంగని విధంగా వ్యాధి తయారయ్యిందో లేదో తెలుసుకుంటారు. ఈ పరీక్షల్లో మాలెక్యులార్ బేస్డ్ అనీ, కల్చర్ బేస్డ్ అనీ రకాలున్నాయి. మాలెక్యులార్ బెస్డ్ పరీక్షల ద్వారా కేవలం కొద్ది గంటల్లోనే ఫలితాలు వెల్లడవుతాయి. ఇలా టీబీ వ్యాధి సాధారణ స్థాయి నుంచి మందులకు లొంగని విధంగా నిరోధకత పెంచుకుందని తెలియగానే, రెండోశ్రేణి మందులను (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) వాడటం మందుపెట్టాలి. ఇందులో నాలుగు లేదా అంతకు మించి మందులుంటాయి. వాటిని కనీసం ఆర్నెల్లపాటు క్రమం తప్పకుండా వాడాలి. ఒక్కోసారి రిఫాంపిన్ మందుకు సూక్ష్మక్రిమి నిరోధకత పెంచుకుందని తెలిసినప్పుడు ఈ చికిత్సా కాలాన్ని 18 - 24 నెలలకూ పొడిగించాల్సి రావచ్చు కూడా. ఈ రెండోశ్రేణి మందులు కాస్త ఖరీదైనవి, విషపూరితమైనవి కాబట్టి... మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవడం అన్నివిధాలా మంచిది. ఇక రెండోశ్రేణి మందులు వాడే చికిత్సలో వ్యాధి పూర్తిగా తగ్గే పాళ్లు 70 శాతం వరకు ఉంటాయి. డాక్టర్ వి.వి. రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ - స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆయుర్వేద కౌన్సెలింగ్ చుండ్రుకు మందులున్నాయా? నా వయసు 31. నాకు విపరీతంగా చుండ్రు ఉంది. దీని మూలంగా నేను అనేక విదాలుగా బాధపడుతున్నాను. ఇంగ్లిష్ మందులు ఎన్ని వాడినా ప్రయోజనం పెద్దగా ఉండటం లేదు. ఆయుర్వేదంలో మందులేమైనా ఉంటే తెలియజేయగలరు. చుండ్రును ఆయుర్వేదంలో కఫ ప్రధానమైన వాతానుబంధ వ్యాధిగా చెప్పారు. శాలాక్యతంత్ర నిపుణుడైన ‘విదేహుడు’ చుండ్రుకు మరికొన్ని లక్షణాలను కూడా చెప్పాడు. సూదులతో పొడిచినట్లు నొప్పి, మంట, స్రావం, వీటితోపాటు తలవెంట్రుకలు రాలిపోవడాన్ని ఉపద్రవంగా చెప్పాడు. అంటే ఇది సెకండరీ ఇన్ఫెక్షన్ స్వభావం. ఇదే పిత్తప్రకోపావస్థ. చుండ్రుకు కారణాలు తలమీది చర్మంలో శుభ్రత లోపించడం, కేశ మూలాల ఆరోగ్యాన్ని నిర్లక్షం చేయడం, మానసిక ఉద్వేగాలు కూడా ఈ వ్యాధిపై ప్రభావం చూపిస్తాయి. నివారణ తలను శుభ్రంగా ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతత అవసరం. చర్మానికి హాని కలిగించే రసాయనాలున్న షాంపూలను వాడకూడదు. కుంకుడు లేదా షీకాకాయలను పొడి చేసుకుని తలస్నానానికి ఉపయోగించుకోవడం ఉత్తమం. స్వచ్ఛమైన కొబ్బరినూనె శిరోజాల ఆరోగ్యానికి శ్రేష్ఠం. ఆహారంలో ఉప్పు, కారం తక్కువగా తినాలి. చుండ్రు ఉన్న వారి దువ్వెనలను ఇతరులు వాడటం మంచిది కాదు కాబట్టి, వీరు విడిగా పెట్టుకోవడం మంచిది. ఔషధాలు త్రిఫలాచూర్ణంతో కషాయం కాచుకుని, తలను కడుక్కుని, తర్వాత తలస్నానం చేయాలి. తడి ఆరిన తర్వాత తలచర్మంపై దూర్వాది తైలం లేక మహామరీచాది తైలం లేక మంజిష్ఠాది తైలాన్ని తలపై పూయాలి. కడుపులోకి మందులు లఘుసూతశేఖర రసమాత్రలు పూటకొక్కటి చొప్పున రోజుకి మూడు మాత్రలు. పంచతిక్త గుగ్గులు ఘృతం రెండు చెంచాలు ఉదయం, రెండు చెంచాలు కలిపి, నాలుగు చెంచాలు నీళ్లు కూడా కలిపి రోజుకి రెండుసార్లు ఆమారం తిన్న తర్వాత తాగాలి. గృహవైద్యం (నివారణకూ, చికిత్సకూ కూడా) ఒక చెంచా గసగసాల చూర్ణం, ఒక చెంచా వచాచూర్ణం (వస పొడి), 200 మి.లీ కొబ్బరినూనెతో కలిపి మరిగించి చల్లార్చి వ డగట్టుకుని రోజూ తలకు రాసుకోవచ్చు. మీరు కొంతకాలం ఈ సూచనలు పాటించి, పరిస్థితిని సమీక్షించుకోండి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
మళ్లీ రూటు మారిన వరద కాలువ
- అలైన్మెంట్ మార్పుతో నత్తనడకన వరద కాలువ నిర్మాణం - మరోసారి మార్చడంపై తీవ్ర అభ్యంతరాలు - ప్రోద్దుటూరు రైల్వేస్టేషన్ సమీపం నుంచి వెళ్లనున్న కాలువ - రాజకీయ ఎత్తుగడే కారణం ప్రొద్దుటూరు : అలైన్మెంట్ మార్చిన కారణంగా ముందుకు సాగని కుందూ-పెన్నా వరద కాలువ నిర్మాణం మరో మారు చిక్కుల్లో పడనుంది. తాజాగా మరో మారు అలైన్మెంట్ మార్పుతో పనులు కొనసాగడంపై అనుమానాలు రేకెత్తిస్తోంది. పనులు 2007లో ప్రారంభించినా ఇంత వరకు అతిగతీ లేకుండా పోయింది. త్వరితగతిన పనులు పూర్తి చేసి తమకు తాగు నీరు ఇవ్వండని పట్టణ ప్రజలు ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ సీనియర్ నేత వేసిన రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఉన్నతాధికారులు మరో మారు అలైన్మెంట్ మార్చారు. ఈ కారణంగా పనుల నిర్మాణానికి సంబంధించి భూ యజమానులు, ప్లాట్ల వ్యాపారుల నుంచి మళ్లీ వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. ప్రొద్దుటూరు పట్టణ ప్రజల శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పెద్దముడియం మండలం నాగరాజుపల్లె వద్ద కుందూ-పెన్నా వరద కాలువ నిర్మాణానికి ఉన్నతాధికారులు అలైన్మెంట్ రూపొందించారు. అయితే ఈపీసీ పద్ధతిలో కాంట్రాక్టు పనులు చేపట్టిన సీనియర్ నేత అలైన్‌మెంట్‌ను మార్చి తనకు అనుకూలంగా చేసుకున్నాడు. ఇందులో భాగంగా రాజుపాళెం మండలంలోని పర్లపాడు గ్రామంలో అప్పటి టీడీపీ వర్గీయులైన వారి పంట పొలాల్లోంచి కాలువ వెళ్లేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ గ్రామస్తులు ఎన్నో సందర్భాల్లో బహిరంగంగానే ఈ విషయాలను వెల్లడించారు. కోర్టులో కేసులు కూడా వేశారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన సీనియర్ నేత ఎలాగైనా పనులు చేపట్టాలనే వ్యూహంతో ఉన్నారు. ఇందులో భాగంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును సైతం స్వయంగా పర్లపాడులో ఇదివరకు తన ప్రత్యర్థులుగా ఉన్న వారి ఇంటికి తీసుకెళ్లారు. ఎదో రకంగా వారితో రాజీ కుదుర్చుకుని కోర్టులో కేసులను విత్‌డ్రా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే తరహాలో ప్రొద్దుటూరుతోపాటు మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన వారు కూడా కోర్టును ఆశ్రయించారు. ప్లాట్లు వేసిన, ఇళ్ల నిర్మాణానికి అనువైన తమ భూములు, స్థలాల్లో ఉద్దేశ పూర్వకంగా కాలువ నిర్మిస్తున్నారని అప్పట్లో వారు పేర్కొన్నారు. అయితే గత ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతంలో ఈ సమస్యతో సీనియర్ నేతకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే ఆయన కొత్తపేట గ్రామంలో ఇల్లిల్లూ తిరిగి మీ భూములు పోకుండా కాలువను మార్చుతానని బయటికి పొక్కకుండా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. స్వయంగా ఆ గ్రామస్తులే ఈ విషయాన్ని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం కుందూ-పెన్నా కాలువ నిర్మాణానికి సంబంధించి తాజాగా అలైన్‌మెంట్‌ను మార్చారు. మొత్తం కాలువ నిర్మాణం 35 కిలోమీటర్లు కాగా ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న రైల్వే క్వార్టర్స్ సమీప ప్రాంతంలో నుంచి అలైన్‌మెంట్‌ను మార్చారు. మొత్తం 35 కిలోమీటర్లు కాలువను నిర్మించాల్సి ఉండగా 33.925 కిలోమీటర్ నుంచి 35వ కిలోమీటర్ వరకు అలైన్‌మెంట్‌ను మార్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మార్పు వల్ల కాలువ నిర్మాణ పనులు మళ్లీ వివాదాస్పదం కానున్నాయి. ప్రస్తుతం అలైన్మెంట్ మార్చిన ప్రకారం ఇంకా ప్రారంభానికి నోచుకోని ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్, రైల్వే క్వార్టర్స్ పరిధిలోనే కాలువ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. క్వార్టర్స్ ప్రహరీ నిర్మాణం వరకు ప్రస్తుతం నీటి పారుదల శాఖాధికారులు జెండాలు పాతారు. ఈ ప్రాంతమంతా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది. దీంతోపాటు ఇక్కడ కూడా చాలా మంది ప్లాట్ల యజమానులు, రైతులు నష్టపోనున్నారు. అసలు రెండో అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నానాటికి పెరుగుతున్న అంచనా వ్యయం పనుల జాప్యం కారణంగా కుందూ-పెన్నా కాలువ నిర్మాణ వ్యయం నానాటికి పెరుగుతోంది. 2007లో కాలువ నిర్మాణానికి మొత్తం రూ.72కోట్లతో టెండర్లు పిలిచారు. మధ్యలో పనులు ఆగిపోయిన తర్వాత మళ్లీ అంచనాలను రివైజ్డ్ చేసి ఆ మొత్తాన్ని రూ.183 కోట్లకు పెంచారు. ప్రస్తుతం మార్చిన అలైన్మెంట్ ప్రకారం ఇంకా అంచనా వ్యయం పెరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. -
హంద్రీ - నీవా సర్వే పనులకు రైతుల బ్రేక్
అలైన్మెంట్ వూర్చారంటూ నిరసన అధికారులను తిప్పిపంపేశారు గుర్రంకొండ : హంద్రీ-నీవా సర్వే పనులను రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. అలైన్మెంట్ వూర్చారంటూ నిరసన తెలియుజేశారు. పనులు చేయనీయకుం డా అధికారులను వెనక్కు పంపేశారు. ఈ సంఘటన గుర్రంకొండ వుండలంలోని రావూపురం గ్రావుంలో జరిగింది. శుక్రవారం ఆ గ్రావూనికి సమీపంలో గతంలో నిలిచిపోరుున కాలువ పనుల వద్దకు హంద్రీ-నీవా అధికారులు, సర్వేయుర్లు చేరుకున్నారు. సమీప పొలాల్లో సర్వే చేస్తుండగా విషయుం తెలుసుకున్న రైతులు అక్కడికి వచ్చారు. గతంలో ఇచ్చిన అలైన్మెంట్ (రూట్ వ్యూప్) ప్రకారమే సర్వే చేయూలని పట్టుబట్టారు. ఇద్దరు భూస్వావుుల పొలాలు కాపాడేందుకే సర్వే వూర్చుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తవు పొలాల్లో సర్వే చేయువద్దంటూ అడ్డుకున్నారు. ప్రస్తుతం వూర్చి చేస్తున్న సర్వేతో తవుకున్న కొద్దిపాటి పొలాలు పోగొట్టుకుంటావుని ఆవేదన చెందారు. గతంలో ఇచ్చిన వూర్కింగ్ ప్రకారమే సర్వేచేసి పనులు చేపట్టాలని, లేని పక్షంలో పనులు జరగనివ్వబోవుని హెచ్చరించారు. అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయుత్నం చేశారు. అరుునా రైతులు వెనక్కి తగ్గకుండా సర్వే పనులు అడ్డుకుని నిరసన తెలియుజేశారు. అధికారులు సర్వేపనులు నిలిపివేసి వెళ్లిపోయూరు. -
‘మెట్రో’ మార్పులపై ముందడుగు
అలైన్మెంట్ మార్పులపై అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశం రాష్ట్ర బడ్జెట్లో రూ.860 కోట్లు కోరిన ‘ఎల్అండ్టీ’ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అలైన్మెంట్ మార్పు విషయంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడింది. అసెంబ్లీ, సుల్తాన్ బజార్, పాతబస్తీ ప్రాంతాల్లో అలైన్మెంట్ మార్పుపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని నిర్మాణ సంస్థ ‘హెచ్ఎంఆర్-ఎల్అండ్టీ’కి లేఖ రాసింది. అలైన్మెంట్ మార్పులపై సాధ్యాసాధ్యాల పరిశీలన, నిర్మాణ వ్యయంలో పెరుగుదల, ప్రాజెక్టు నిర్మాణంతో నష్టపోయే ప్రైవేటు ఆస్తులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై అధ్యయనం జరిపి నివేదించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఇటీవల నిర్మాణ సంస్థకు రాసిన లేఖలో పేర్కొంది. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అలైన్‌మెంట్‌పై ఇది తుది నిర్ణయం కాదని, ప్రతిపాదిత మార్పులపై అధ్యయనం కోసమే లేఖ రాశామన్నారు. మరోవైపు మెట్రో రైలు ప్రాజెక్టు అవసరాల కోసం 2015-16కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్లో రూ.860 కోట్లు కేటాయించాలని ఎల్అండ్టీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంతోపాటు ప్రైవేటు ఆస్తులకు నష్టపరిహారం చెల్లింపు తదితర అవసరాల కోసం రుణ సహాయంగా రూ.850 కోట్లను, మెట్రో ప్రాజెక్టు రెండో దశపై అధ్యయనం కోసం రూ.10 కోట్లను కేటాయించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తలపెట్టిన ‘సమగ్ర రవాణా వ్యవస్థ’(సీటీఎస్)-2021 కార్యక్రమం కింద మెట్రో ప్రాజెక్టును నగర శివారు ప్రాంతాలకు సైతం విస్తరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అధ్యయనం కోసం నిధులు కావాలని కోరింది. ఎన్నో మలుపులు తిరిగి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ ప్రాజెక్టు అలైన్మెంట్ మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత చర్చనీయాంశమైంది. అధికార పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్ .. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం మెట్రో రైలు అలైన్‌మెంట్‌ను మార్చితీరుతామని ప్రకటించడంతో ప్రారంభమైన వివాదం ఎన్నో మలుపులు తిరిగింది. ప్రభుత్వం మార్పులు సూచించిన మూడు మార్గాల్లో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వెంటనే పనులను నిలిపేసి నెలలు గడిచినా ప్రభుత్వం ఈ అంశంపై నిర్మాణ సంస్థకు అధికారిక ఆదేశాలు జారీ చేయలేదు. అయితే, మెట్రో మార్పుపై సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు పునరుద్ఘాటిస్తూ వచ్చారు. ఈ అంశంపై పత్రికల్లో వరుసగా ప్రతికూల కథనాలు రావడం.. అధికారికంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై ఆందోళనకు గురైన ‘ఎల్అండ్టీ’ యాజమాన్యం ఒకానొక దశలో ప్రాజెక్టు నుంచి వైదొలిగేందుకు సిద్ధమైంది. పనుల్లో వివిధ రకాల అవరోధాలను సాకుగా చూపి ప్రాజెక్టును స్వాధీనం(టేకోవర్) చేసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తూ లేఖ రాయడం..ఈ లేఖను కావాలని ఓ వర్గం మీడియాకు లీక్ చేయడంపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఎల్ఎండ్టీ సంస్థ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిసి వివరణ ఇచ్చుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. పాతబస్తీపై తొలగని పేచీ.. పాతబస్తీలో అలైన్మెంట్ మార్పుపై రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్, పాతబస్తీలలో ప్రాజెక్టు అలైన్‌మెంటు మార్పు అంశంపై గత డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ అఖిలపక్ష నేతలతో సమావేశమై అభిప్రాయాలు స్వీకరించారు. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో మార్పులపై అన్ని పార్టీల మధ్య ఏకభిప్రాయం కుదిరినా పాతబస్తీలో అలైన్మెంట్ మార్పుపై ఎంఐఎం పట్టుదల చూపగా, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై మెజారిటీ ప్రజల కోరిక మేరకు నిర్ణయం తీసుకుంటామని ఈ సమావేశంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. తప్పకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామన్నారు. ఆ తర్వాత ఈ వివాదం రాజకీయ పార్టీల మధ్య అలాగే వుండిపోయినా.. ప్రభుత్వం మాత్రం మార్పు దిశగా అడుగులు వేసింది. -
‘మెట్రో’ మార్పులపై కదలిక
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన హెచ్ఎంఆర్ నివేదికలో ప్రత్యామ్నాయ మార్గాల సూచన! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు అలైన్మెంట్ మార్పు అంశం కొలిక్కి వస్తోంది. పాత నగరం, సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్ మార్పులకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్) శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల సూచనతోపాటు కొత్త అలైన్మెంట్ వల్ల పెరగనున్న నిర్మాణ వ్యయం, అలైన్మెంట్తో ఆస్తులు కోల్పోయే బాధితులకు కొత్త భూసేకరణ చట్టం కింద చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించిన వివరాలను ఈ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ వద్ద ఉన్న ఈ ప్రతిపాదనలు త్వరలో సీఎం కేసీఆర్ పరిశీలన కోసం వెళ్లనున్నాయి. అలైన్మెంట్ మార్పు ప్రతిపాదనలపై సీఎం నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ విషయాన్ని మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ- హెచ్ఎంఆర్ఎల్ కన్సార్షియానికి తెలుపుతూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ లేఖ రాయనుంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్టీ-హెచ్ఎంఆర్ కన్సార్షియం 72 కి.మీల మెట్రో మార్గాన్ని నిర్మించాల్సి ఉండగా.. అలైన్మెంట్ మార్పుల వల్ల అదనంగా 3.2 కి.మీ.ల రైలు మార్గాన్ని నిర్మించాల్సి రానుంది. దీనికి అదనపు వ్యయం రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు కానుందని ప్రభుత్వానికి హెచ్ఎంఆర్ సూచించినట్లు సమాచారం. కాగా, అలైన్మెంట్ మార్పుల ప్రతిపాదనలను ఇంకా పరిశీలించలేదని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి ‘సాక్షి’కి తెలిపారు. సీఎస్‌ను కలిసిన మెట్రో అధికారులు.. మెట్రో రైలు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో రైలు ఎండీ వీబీ గాడ్గిల్ శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో సమావేశమై ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. భూసేకరణలో జాప్యం వల్ల ప్రాజెక్టు నిర్మాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఎల్అండ్టీ ఎండీ... సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయంలో తదుపరి చర్చల కోసం ఈ నెల 9న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.