అదృశ్యమైన సినీతార ఆచూకీ చెన్నైలో లభ్యం!
థానే: కుటుంబ కలహాలతో కారణంగా ఎవరికీ కనిపించకుండా పోయి.. అదృశ్యమైనట్టు హీరోయిన్లు మీడియాలో సంచలనం రేపుతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ తార అంజలీ కూడా కొద్ది రోజులు ఆదృశ్యమైన సంఘటన అటు తమిళ చిత్ర పరిశ్రమలోనూ, టాలీవుడ్ లోనూ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి సంఘటనే మరాఠీ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంది.
పది రోజుల క్రితం ఓ స్టేజ్ షో కోసం వెళుతూ నవీ ముంబైలో అదృష్యమైన మరాఠీ నటి అల్కా పునేశ్వర్ ను పోలీసులు చెన్నైలో పట్టుకున్నారు. డిసెంబర్ 28 తేది నుంచి కనిపించకుండా పోయిన అల్కా తన బాయ్ ఫ్రెండ్ తో చెన్నైలో ఉంటోందని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 27 తేదిన స్టేజ్ షో కోసం ఇంటి నుంచి బయలుదేరిన అల్కా.. తన బాయ్ ఫ్రెండ్ సహాయంతో యాక్సిడెంట్ డ్రామా ఆడిందని పోలీసులు తెలిపారు.
పూణేకు సమీపంలోని ఖోపోలీ వద్ద 700 అడుగుల లోతైన లోయలో అల్కా కారును పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో తన స్నేహితుడిని, కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అల్కా అసలు సంగతి బయటకు వచ్చిందని కోప్రి పోలీసులు వెల్లడించారు. ఆతర్వాత ఈ డ్రామా వ్యవహారాన్ని నడిపిందే తామేనని ఇద్దరు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. అల్కా కేసును ఆమె మొబైల్ ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా విజయవంతంగా ఛేదించామన్నారు.