అల్లీపూర్లో రైతుల ధర్నా
రాయికల్ : ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించడాన్ని నిరసిస్తూ మండలంలోని అల్లీపూర్లో రైతులు ఆందోళనకు దిగారు. ఎంపీటీసీ గంగారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సుమారు వంద మంది రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్టార్టర్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ట్రాన్స్కో అధికారులు వచ్చేంత వరకు ఆందోళన విరమించబోమని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. తొలగించిన స్టార్టర్లను యథావిధిగా బిగించాలని డిమాండ్చేశారు. గంటపాటు బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్, జెడ్పీటీసీ గోపి మాధవి రైతులను శాంతింపజేశారు. అనంతరం ట్రాన్స్కో ఏఈకి వినతిపత్రం సమర్పించగా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఉపసర్పంచ్ రమేశ్, మాజీ సర్పంచ్ గంగారాం, రైతు సంఘ నాయకులు ప్రవీణ్, రాజన్న, సత్తన్న, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.