ఎవరి రాజకీయం వారిది!
సాక్షి ప్రతినిధి, అనంతపురం :
‘నారాయణ మామా! వానొత్తాంది...బస్సు కిటికీ మూయి...మోడం సూచ్చాంటే అనంతపురం నుంచి ఊరికి పోయిదాకా వానపడేతట్టు ఉందే!’
'ఈ కిటికీ ఎంత లాగినా...ముందుకు పోలేదు వన్నూరప్ప, నువ్వు కాస్త ఆ పక్కకు జరుగు..కిటికీ వార కారుతూనే ఉంటుంది. ఈ 'తెలుగు వెలుగు' బస్సులు 'వానొస్తే వలవల...ఎండొస్తే మలమల...గుంతలొస్తే డగ డగ..ఏందో లే సామీ..ఈ బస్సులు!
‘పోనీలేమామ...వానరాక సచ్చాండం...పడితే మంచిదే. పన్నీ! వానలేక ఈసారి పంటలన్నీ ఎండిపాయే! తువ్వలో 7 ఎకరాలు సెనక్కాయ ఏస్తే కాయ కాయకపాయే! లచ్చా పదివేలు ఖర్సయింది. బ్యాంకులో పాతలోను బాకీ ఉంటే అప్పు తెచ్చి వడ్డీకట్టినా! పంటకు డబ్బు లేకపోతే రాంరెడ్డి మామ లచ్చ అప్పు ఇచ్చినాడు. పంట మొత్తం పోయింది. అప్పు తల్సుకుంటేనే భయమేత్తాంది!’
‘కాదు వన్నూరు...ఇన్‌పుట్‌సబ్సిడీ ఇస్తామని సెంద్రబాబు నిన్న గొల్లపల్లి మీటింగ్‌లో సెప్పినాడు! ఎకరాకు 15వేలు ఇస్తాడంట! ఏదో కాస్త అప్పు నుంచన్నా బయటపడొచ్చు!’
‘బాగుండావు మామ! ఎకరాకు 15వేలు కాదు...ఎక్టారుకు 15వేలు. అంటే ఎరాకు రూ.6వేలు లెక్కన వచ్చాది.'
‘ఏందోయ్ నువ్వు సెప్పేది! ఆరువేలేనా?...బ్యాంకోళ్లు పెట్టుబడి ఖర్చులు లెక్కగట్టి స్కేల్ ఆఫ్‌ఫైనాన్స్ కింద 19,500 లోను ఇచ్చినారే! అంత ఖర్సయితాదని గవర్నెమెంటోళ్లే కదా! లెక్కగట్టింది. ఇప్పుడు ఆరువేలంటే ఎట్టా?’
‘ఆ ఆరువేలు కూడా అందరికీ రాదు మామ..మన అధికార్లు ఏ పొలం పండింది...ఏది పండింది అని లెక్కగట్టినారో! ఈ రేయిన్గన్లతో నీళ్లిచ్చిన పంట పండింది అని లెక్కలు రాసినారంట. మండలం కాడ అంతా అనుకుంటాండారు. నాకు రేయిన్గన్లతో నీళ్లిస్తామని పైపులు ఇచ్చినారు. ఒక ట్యాంకర్ వచ్చింది! రెండురోజులు పైపులైతే నాకాడే ఉన్నాయి. నీళ్లిచ్చింది లేదు..ఏం లేదు. పగా నరసింహులు సిన్నాయన రేయిన్గన్లతో భాస్కర్‌రెడ్డి బోరు నుంచి ఒక తడి నీళ్లు పట్టినాడు. అయినా పండలేదు. మొత్తం నుసిలా మారింది. ఇట్టాంటి పొలాలు పండినట్లు లెక్కగడితే ఎట్టా సెప్పు! నువ్వసెప్పినట్టు ఎకరాకు 18–20వేలు ఖర్సయింది. ఈ మేరకు ఇస్తే కాసింత మేలు సేసినట్లు! పోయిన యేడు రూపాయి కూడా ఇన్‌పుట్‌సబ్సిడీ ఇయ్యకపాయే!’
‘హే..లేదు వన్నూరు! ఇచ్చినానని సెంద్రబాబు లెక్కసెప్పినాడే నేను కూడా ఇన్నా!’
‘నేను ఆ మీటింగ్‌కు వచ్చింటి లేమామా! ఆయప్ప ఏం చెప్పినాడు..2014–15కు 569కోట్లు ఇచ్చినా సెప్పినాడు. 15–16సంగతి సెప్పలే! మల్లా ఈ సంవత్సరం ఇచ్చా అని సెప్పినాడు. పోయిన సారి 63 కరువు మండలాలు ప్రకటించినారు. దానికి తాలుకూ ఇన్‌పుట్‌సబ్సిడీ పోయిన నెల 10న ఇచ్చినారని 'సాక్షి' పేపర్లో వార్త రాసినారు. 8 జిల్లాలకు ఇచ్చినారంట! అందులో అనంతపురం లేదు. ఇదేంటంటే పోయినసారి బ్రహ్మాండంగా పంట పండిందని అధికారులు లెక్కలు రాసిపంపినారంట!’
‘ఓరినీ పాసు గుల్లా! నాకు ఇదంతా తెలీదు సామీ! నేనేమో ఇచ్చినారనుకుంటాండా! పరిహారం ఇచ్చినారు! ఈసారికి ఏదోరకంగా బయటపడొచ్చు. ఎట్టా గొల్లపల్లికి నీళ్లొచ్చినాయి. వచ్చేసారి వానరాకపోయినా పంటకు ఇబ్బంది లేకుండా నీళ్లొస్తాయి అనుకుంటాండా!’
'యాడికి నీళ్లొచ్చాయి..జీడిపల్లికి ఐదేండ్ల నుంచి వత్తాండాయి. ఎకరాకైనా ఇచ్చినారా! గొల్లపల్లి నీళ్లు అంతే! ఈ నీళ్లు ఈడ నింపి అట్టనే స్టోర్ చేత్తారంట మామా! కుప్పం దాకా కాలువ పనులు అయినాక, ఆడికి తీసుకుపోతారంట! అందుకు పంటలకు నీళ్లు ఇయ్యడం లేదు’.
‘'కాలువ పూర్తయితే కుప్పానికి తీసుకుపోనీలే! అప్పటిదాకా మనకూ నీళ్లు ఇస్తే ఇబ్బందేముంది! నీళ్లన్నీ ఊరికే వృథా కదా!’
‘ఆ ఆలోచన వాళ్లకుంటే ఇంగేమి! మనం బాగుపడకపోయినామా! ఇచ్చామనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇప్పిద్దామని అధికారులకూ లేదు.’
‘మరి కుప్పం కాలువ పూర్తయ్యేదానికి ఎన్నిరోజులు పడుతుంది వన్నూరు!’
‘మామా! పేపరోళ్లు సెప్పేదాన్ని బట్టి పనులు చూత్తే తక్కువంటే మూడేళ్లు పడతాదని అంతా అనుకుంటాండారు.’
‘ఓర్నీ! మూడేళ్లు కళ్లముందు నీళ్లుపెట్టుకుని సూడడం తప్ప సేనుకు పారించుకోలేమా! కాదోయ్ సునీతమ్మ, రఘునాథరెడ్డి, కేశవా! పార్థసారథి, శీనప్ప... ఈళ్లన్నా సెంద్రబాబుకు సెప్పొచ్చుకదా!’
‘మామ! మనోళ్ల రాజకీయం ఎట్టా ఉందంటే..సెంద్రబాబుకు సెప్పే ధైర్యం సునీతమ్మకు, రఘునాథరెడ్డికి లేదు. ధైర్యం ఉన్న కేశవా, శీనప్ప, పార్థసారథి సెప్పరు. మంత్రులు జిల్లాకు ఏం సేయలేకపోయినారని సెడ్డపేరు రాని.. మంత్రివర్గం మార్పులో వాళ్ల బదులు మేం మంత్రులం కావొచ్చు! అని ఎవరికివారు రాజకీయం చేస్తాండారు. అందుకే మనకు ఈ గతి పట్టింది.’
‘'ఏందోయ్! విశ్వేశ్వరరెడ్డి కాకుండా ఎమ్మెల్యేలంతా టీడీపీవాళ్లే! ఇట్టాంటి జిల్లాకు ఎట్ట సేయాలా! ముఖ్యమంత్రే అట్టా ఆలోచన సేస్తే ఎట్టా! నీళ్లు ఇయ్యకుండా ఈ మూడేళ్లు ఇట్టనే ఉంటే టీడీపీ వాళ్లు ఓట్లప్పుడు శానా ఇబ్బంది పడతారే!’
‘ఏం ఇబ్బంది మామా! నీకు రుణమాఫీ అయిందా! నాకు అయిందా!లేదు...కానీ అందరికీ రుణమాఫీ సేసినాం అని సెపుతాండా! డ్వాక్రావాళ్లకు రుణమాఫీ సేసినాం అంటాండారు. ఒక్కరికైనా రుణమాఫీ అయిందా! పైగా నిన్న ఎంపీ కిష్టప్ప సెపుతాండాడు...రాజశేఖర్‌రెడ్డి హంద్రీ–నీవాకు రూ.2వేల కోట్లు ఇచ్చినాడంట! వీళ్లు 20వేల కోట్లు ఖర్సుపెట్టి నీళ్లు తెచ్చినారంట!...ఈ మొత్తం పథకానికి రూ.6వేలో...6,500 కోట్లో ఖర్చయితాది అని రాసినారు మామ! కానీ కిష్టప్ప పోలవరానికి అయ్యే ఖర్సు సెప్పా! ఇట్టా అన్ని అబద్దాలే సెబుతాండారు.’
‘అబద్ధాలు ఎన్ని రోజులు నమ్ముతాం ఓయ్..ఒకసారి మోసపోతాం...రెండుసార్లు మోసపోతాం..మూడోసారి.!’
‘అంతేగానీ! మన అనంతపురం రాజకీయం సెప్పుకుంటే తెల్లారుతాది! ఊరొచ్చినట్లుంది...ముందుకు పోదాంపా! టిక్కెట్టు వెనక కండెక్టర్ సిల్లరరాసినాడు..తీసుకుందాం పా...మొన్న ఇట్టనే నూరు కాయితం ఇస్తే...80 రాసిచ్చినాడు..మర్సిపోయి దిగిపోయినా..పా..పా!