60 అకౌంట్లు.. రూ.2.86 కోట్లు
మిర్యాలగూడ : సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) కుంభకోణంలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తాళ్ల సంతోష్‌కుమార్, అతనికి సహకరించిన బంగారుగడ్డకు చెందిన బత్తిని సోమిదేవి, ఇందిరమ్మ కాలనీకి చెందిన మున్సిపాలిటీలో మెప్మా రిసోర్స్ పర్సన్‌గా పని చేస్తున్న ఆకారపు జానకి, షాబునగర్‌కు చెందిన మున్సిపాలిటీలో మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న కందిబండ రేవతి అరెస్టయిన వారిలో ఉన్నారు.
వీరితో పాటు మరికొంత మందిని కూడా అరెస్టు చేయనున్నారు. బుధవారం మిర్యాలగూడలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాస్ నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీజీవీబీ బ్యాంకులో డబ్బు కాజేసిన విషయంలో ఇన్చార్జ్ మేనేజర్ లావుడ్యా నర్సింహ ఫిర్యాదు మేరకు బ్యాంకు కుంభకోణంపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. 1997–98లో మహిళా సంఘాలు ఏపీజీవీబీలో తెరిచిన ఖాతాలు మూసివేయలేదు. వీటిలో 60 ఖాతాలను ఫీల్డ్ ఆఫీసర్‌గా ఉన్న సంతోష్ మెప్మా, మహిళా సంఘ నాయకురాలు సహకారంలో రీ ఓపెన్ చేశారు. రూ.5 నుంచి 7 లక్షల వరకు రుణం మంజూరు చేసే అధికారం ఫీల్డ్ ఆఫీసర్‌కు ఉండడంతో.. దీన్నే ఆసరాగా చేసుకుని రుణాలు మంజూరు చేశారు. వాటిని ఆయా మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేశాడు. ఆ డబ్బును డ్రా చేయడానికి అవసరమైన సంతకాల కోసం మహిళా సంఘాల నాయకురాలు, మెప్మా ఆర్పీ, సీఓ సంతోష్‌కు సహకరించారు. రుణాన్ని బ్యాంకు నుంచి డ్రాచేసి ఇచ్చినందుకు గాను మహిళా సంఘాలకు ఒక్కొక్కరికి రూ.5 నుంచి పది వేలు ఇచ్చారు. అందుకు గాను మెప్మా సీఓ రేవతికి రూ.40 లక్షలు, ఆర్పీకి రూ.28 లక్షలు, మహిళా సంఘం నాయకురాలు సోమిదేవికి రూ.3.30 లక్షలు ఇచ్చాడు. డబ్బులు డ్రా చేసినందుకు సహకరించిన బినామీ మహిళలకు రూ.3.70 లక్షలు చెల్లించి రూ.2,86,85,661 బ్యాంకు నుంచి స్వాహా చేశాడు. సంతోష్ 2016 అక్టోబర్ నుంచి 2017 అక్టోబర్ వరకు విడుతల వారీగా ఈ డబ్బును కాజేసినట్లు విచారణలో తేలింది.
ప్రత్యేక బృందంతో విచారణ..
బ్యాంకు కుంభకోణాన్ని బయటపెట్టేందుకు ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టితో విచారణకు బృందం ఏర్పాటు చేశాడు. కాగా బృందంలో డీఎస్పీ శ్రీనివాస్, టూటౌన్ సీఐ సాయీ ఈశ్వర్‌గౌడ్, హాలియా సీఐ ధనుంజయ, ఎస్ఐలు శేఖర్, వెంకట్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ మట్టయ్య, పీసీలు మట్టయ్య, నాగరాజు ఉన్నారు. కాగా నిందితుల్లోని జానకి నుంచి రూ.పది లక్షల విలువైన ప్లాటు, రేవతి నుంచి రూ.పది లక్షల విలువైన ప్లాటు, యాదగిరిగుట్ట ఎస్బీఐ బ్రాంచి నుంచి రూ.ఐదు లక్షలు ఫ్రీజ్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.
రైస్ పుల్లింగ్ కోసం చెల్లింపులు..
రైస్ పుల్లింగ్తో కోట్ల రూపాయలు గడించవచ్చునని పథకం వేశాడు. రైస్ పుల్లింగ్ పేరుతో విజయవాడకు చెందిన దుర్గతో పాటు వైజాక్‌లో ఉండే చిరంజీవి, వాసుకు సంతోష్ డబ్బులు చెల్లించాడు. 2016 నవంబర్‌లో ఖమ్మంలో సంతోష్ బావ వరప్రసాద్ ఇంటి వద్ద తన పాత స్నేహితుడైన అనంతరాములు పరిచయం కాగా ఆతని ద్వారా ఖాజామొహినొద్దీన్ను పరిచయం చేసుకున్నాడు. నోట్లరద్దు సమమంలో పాత నోట్లు చెలామణీ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చుననే ఉద్దేశంతో ఖాజామొహినొద్దీన్కు రూ.11 లక్షలు, గోపికృష్ణకు రూ.10లక్షలు ఇచ్చాడు. పాత నోట్ల మార్పిడీ విషయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని గోపికృష్ణను అడగ్గా విజయవాడకు చెందిన దుర్గ ద్వారా చెన్నైకి చెందిన కంపెనీలో పెట్టుబడి పెట్టామని చెప్పాడు. అలా దుర్గను కలిసిన సంతోష్ తన డబ్బులు ఇవ్వాలని అడిగాడు. కానీ దుర్గ తనవద్ద ఇతర వ్యాపారాలు ఉన్నాయని.. రైస్ పుల్లింగ్‌లో పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వస్తాయని చెప్పింది. రైస్ పుల్లింగ్ ద్వారా వంద కోట్ల రూపాయలు వస్తాయని నమ్మించింది. దీంతో సంతోష్ ఆమెకు రూ.51.30 లక్షలు, దుర్గ పరిచయం చేసిన చిరంజీవికి రూ.71.65 లక్షలు, వాసుకు రూ.57 లక్షలు ఇచ్చాడు.