‘నీట్’ ఆందోళనలు అరికట్టండి: సుప్రీం
న్యూఢిల్లీ: నీట్‌ను వ్యతిరేకిస్తూ తమిళనాడులో జరుగుతున్న ఆందోళనను అదుపుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆందోళనల పేరుతో జనజీవనాన్ని స్తంభించజేస్తున్న వారిపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఆదేశించింది. నీట్ పరీక్షను రద్దుచేయాలంటూ అనిత (17) అనే దళిత విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తర్వాత తమిళనాడు ఆందోళనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జనజీవనానికి ఇబ్బందులు కలుగుతున్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ‘నీట్ పరీక్షకు అమలు నిర్ణయంతో తలెత్తుతున్న ఆందోళలను అదుపుచేయాల్సిన బాధ్యత తమిళనాడు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలదే’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ 18న చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.