ఆ క్షణం నేనెంతో ఆనంద పడ్డాను
ఎనిమిదో ఏటనే సంగీతంపై ఇష్టం ఏర్పడిందని.. తల్లిదండ్రులు, భర్త, అత్తమామల ప్రోత్సాహంతో సినీ నేపథ్య గాయకురాలిగా ఎదిగానని గాయని అంజనాసౌమ్య పేర్కొన్నారు. పాటల ద్వారా వచ్చిన వచ్చిన పారితోషికంలో కొంత మొత్తం భక్తి ఆల్బమ్స్ కోసం ఖర్చు పెడుతున్నానని చెప్పారు. అయినవిల్లి సిద్ధివినాయక స్వామి సన్నిధిలో పాడాలని మొక్కుకున్నానని, అ మొక్కును తీర్చుకునేందుకే వచ్చానని శుక్రవారం ఇక్కడికి వచ్చిన సౌమ్య ‘న్యూస్‌లైన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆమె అభిప్రాయాలు ఆమె మాటల్లోనే..
చిన్నప్పటినుంచే పాడాలని ఉన్న కోరిక సంగీతం వైపు నడిపించింది. కాకినాడలో బీటెక్, వైజాగ్ గీతమ్ యూనివ ర్సిటీలో ఎంబీఏ చేశాను. కాకినాడలోని సంగీతోపాధ్యాయులు కాకరపర్తి వీరభద్రరావు, పెద్దాడ సూర్యకుమారి వద్ద సంగీతం నేర్చుకున్నాను. సంగీతంలో డిప్లొమో చేసి ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాను.
*చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఇష్టం. అదే జీవన పరమా వధి అనుకున్నా. అందుకే నా విద్యార్హతలతో వచ్చే ఉద్యోగం కోసం ఆలోచించ లేదు.
*రెండేళ్ల కిందట ఆమెరికా కాలిఫోల్నియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రవితేజను పెళ్లి చేసుకున్నాను. ఆయన స్వగ్రామం రావులపాలెం.
*పెళ్లికి ముందు నాన్న గోపాలకృష్ణ, అమ్మ విద్యల సుమతి నా సంగీత అభ్యాసానికి ప్రోత్సహించారు. ఇపుడు నా భర్త ప్రోత్సాహంతో గాయనిగా ప్రస్థానం సాగిస్తున్నాను.
*ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని జూనియర్స్ రౌండ్లో రన్నర్ గా నిలిచాను. సూపర్ సింగర్ 4లో విన్నర్‌గా, సూపర్ సింగర్ 7లో విన్నర్‌గా సంగీతాభిమానుల మన్ననలు పొందాను.
*నాకు లభించిన ఆదాయంలో కొంత భక్తి ఆల్బమ్స్ కోసం ఖర్చు చేస్తున్నాను. సదార్చన, సాయి సౌమ్యలహరి1,2, అన్నమయ్య సంకీర్తనామృతం, టీ సీరిస్‌లో భక్తితో అంజన సౌమ్య వంటి ఆల్బమ్స్ చేశాను.
*సుమారు 60 సినిమాల్లో పాటలు పాడాను. మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చాను. సూపర్ సింగర్స్ 7లో విన్నర్‌గా నిలిచిన క్షణం నేనెంతో ఆనందపడ్డాను.