ఫాంటమ్.. పాక్‌కు వ్యతిరేకంకాదు
ఉగ్రవాదం ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న ఫాంటామ్ చలనచిత్రాన్ని పాకిస్థాన్ కోర్టు నిషేధించడంపై ఆ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ స్పందించారు. ఫాంటమ్ సినిమా.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసిందేతప్ప పాకిస్థాన్‌కు వ్యతిరేకం కాదని శుక్రవారం మీడియాతో అన్నారు.
ఫాంటమ్లో తనను ఉద్దేశించి అసత్యాలు చెప్పారని ఆరోపిస్తూ సినిమా విడుదలను అడ్డుకోవాల్సిందిగా లష్కరే తాయిబా నేత హఫీజ్ సయ్యద్ కోర్టును ఆశ్రయించడం.. విచారించిన కోర్టు పాకిస్థాన్‌లో ఫాంటమ్ సినిమాను నిషేధిస్తున్నట్లు గురువారం ప్రకటించడం తెలిసిందే.
'సినిమా విడుదల కాకముందే.. కనీసం అందులో ఏం చూపించానో తెలుసుకోకుండానే ఫాంటమ్ పై నిషేధం విధించారు. పాకిస్థాన్ కోర్టు నిర్ణయం నన్ను షాక్ కు గురిచేసింది. ఏ వ్యక్తిని కూడా కించపర్చే ఉద్దేశం నాకు లేదు. ఈ సినిమా ఉగ్రవాదానికి వ్యతిరేకమేకానీ, పాకిస్థాన్ కు కాదు' అని కబీర్ ఖాన్ చెప్పుకొచ్చారు.
26/11 ముంబై దాడులు, వాటి వెనకున్న అసలు వ్యక్తులు తదితర ఆసక్తికర అంశాల చుట్టూ తిరిగే ఫాంటమ్ కథలో సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. 50 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.