మహిళలు, పిల్లలకు ‘భరోసా’: నాయిని
సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు, పిల్లలకు ‘భరోసా’ చేయూతనిస్తుందని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హాకా భవన్లో ఏర్పాటుచేసిన భరోసా కేంద్రాన్ని డీజీపీ అనురాగ్ శర్మతో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహిళా భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. వేధింపులకు గురవుతున్న స్త్రీలు, పిల్లల్లో మనోస్థైర్యం నింపడానికి నగర పోలీసులు ‘భరోసా’ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఇది తొలి అడుగే..: అనురాగ్ శర్మ
మహిళలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంతో పాటు పోలీసు శాఖలోనూ మహిళా సిబ్బందిని పెంచాల్సిన అవసరముందని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. మహిళలకు ఆపన్న హస్తం అందించేందుకు ఏర్పాటుచేసిన ఏకీకృత కేంద్రం (వన్ స్టాప్ సెంటర్) ‘భరోసా’ తొలి అడుగేనని అన్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో విజయవంతమైతే ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని తెలిపారు. అంతేగాకుండా ప్రతి ఠాణాలో ఒక కౌన్సెలర్, లీగల్ అడ్వైజర్ ఉండాలనే ఆలోచన చేస్తున్నామని, వీరిని అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకురావాలని అనుకుంటున్నామని తెలిపారు.
భరోసా కేంద్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి బాధితులకు న్యాయం అందేంత వరకు తమ సహకారం ఉంటుందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, మహిళా, శిశు సంక్షేమ కార్యదర్శి జగదీశ్వర్, హైదరాబాద్ నగర క్రైమ్స్ అండ్ సిట్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతి లక్రా, తరుణి స్వచ్ఛంద సంస్థ స్థాపకురాలు మమతా రఘువీర్, నీలోఫర్ ఆస్పత్రి చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.