పదో తేదీలోగా తేల్చండి
ముంబై: సీట్ల సర్దుబాటు అంశంపై ఈ నెల పదో తేదీలోగా స్పష్టత ఇవ్వాలని ఆర్పీఐ అధికార ప్రతినిధి అర్జున్ డాంగ్లే డిమాండ్ చేశారు. లేకపోతే కూటమిలో కొనసాగే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ శాసనసభ ఎన్నికలకు సంబంధించి మాకు 14 లేదా 15 స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో కేటాయించాలని మహాకూటమిని ఎంతోకాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అయితే సీట్ల సర్దుబాటుపై పూర్తిగా అనిశ్చితి కొనసాగుతోంది.
ఈ నెల పదో తేదీలోగా ఈ అంశాన్ని ఓ కొలిక్కి తీసుకురాకపోయినట్టయితే మహాకూటమిలో కొనసాగే అంశాన్ని పునఃపరిశీలించాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ, శివసేన పార్టీల వైఖరి పట్ల కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక ్తమవుతోందన్నారు. మహాకూటమిలో కొనసాగే అంశంపై ఈ నెల పదో తేదీన జరగనున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆ తర్వాత భవిష్య కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. గెలుస్తామనే ధీమా ఉన్న స్థానాలను కేటాయించాలని మాత్రమే తాము కోరుతున్నామన్నారు. ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు తమ పార్టీ కార్యకర్తలకు సమయం కావాలన్నారు. ఆర్పీఐకి ఐదు స్థానాలే లభించే అవకాశముందనే వార్తలొస్తున్నాయి కదా అని ప్రశ్నించగా 14కు తగ్గితే సహించబోమన్నారు. అన్ని స్థానాలను మహాకూటమి కేటాయిస్తుందని భావిస్తున్నామన్నారు.
ఆరు లేదా ఏడు దక్కే అవకాశం
సాక్షి, ముంబై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)కు కేవలం ఆరు లేదా ఏడు స్థానాలు ఇచ్చేందుకు మాత్రమే శివసేన, బీజేపీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మహాకూటమి నాయకులు అప్పట్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోక పోవడమేగాకుండా ఆర్పీఐకి తగిన గౌరవం ఇవ్వడం లేదని వారంతా భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్పీఐ కార్యకర్తలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని అధిష్టానానికి దిగులు పట్టుకొంది.
గత వారం కిందట శివసేన నాయకుడు, ఎంపీ సంజయ్ రావుత్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే కలిసి ఆర్పీఐ నాయకులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. వారు ఎన్ని స్థానాలు కావాలనుకుంటున్నారు....? ఏ నియోజక వర్గాలు డిమాండ్ చేస్తున్నారు.? తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో రాందాస్ ఆఠవలే 59 స్థానాలకు సంబంధించిన జాబితా శివసేన, బీజేపీలకు సమర్పించారు. తర్వాత కచ్చితంగా 20 స్థానాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సీట్లయినా లభిస్తాయని ఆశతో ఉన్నారు. తాజాగా కేవలం ఏడు స్థానాలు ఇచ్చేందుకు మాత్రమే బీజేపీ, శివసేన పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఆఠవలే ఆందోళనలో పడిపోయారు.
ఈ విషయాన్ని ఆయా పార్టీలు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ముంబైలో ప్రస్తుతం కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న చాందివలి, వర్సోవా, అలాగే ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న ముంబ్రా వంటి విజయవకాశాలు లేని నియోజక వర్గాలను ఆర్పీఐకి ఇచ్చేందుకు శివసేన సంసిద్ధత వ్యక్తం చేసింది. బీజేపీ మాత్రం ముంబైలో ఒక్క స్థానాన్ని ఆర్పీఐకి వదులుకునేందుకు సిద్ధంగా లేదు. బీజేపీ కూడా తమకు విజయవకాశాలు లేని నియోజక వర్గాలు ఇస్తే అప్పుడు తమ పార్టీ పరిస్థితి ఏంటి...? అని ఆర్పీఐ నాయకులంతా అయోమయంలో పడిపోయారు.