ఆరంభం
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యూ యి. వేలాది మంది భక్తజనుల మధ్య ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. హరోంహర నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ ఉత్సవాలు పది రోజులు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉత్సవమూర్తులు మాడవీధుల్లో ఊరేగనున్నారు.
వేలూరు:తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధిగాంచాయి. ఉత్సవాలకు నాందిగా ఆలయంలో బుధవారం ఉదయం 6.40 గంటలకు ధ్వజారోహణం నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గం టలకు మూలవర్ సన్నిధిలో ప్రత్యేక అభిషేకం, ఆరాధన లు జరిగాయి. ఉత్సవమూర్తులు వినాయకుడు, మురుగన్, చంద్రశేఖరుడు, చండికేశ్వరుడు, అన్నామలై, ఉన్నామలై అమ్మవార్లను అలంకరించి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చి మకర దీపారాధన జరిపారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. ఈ వేడుకలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హరోం హరా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అనంతరం భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. చివరగా ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అగ్రి క్రిష్ణమూర్తి, కలెక్టర్ జ్ఞానశేఖరన్, డీఐజీ తమిళ్చంద్రన్, ఎస్పీ ముత్తరసి, ఎమ్మెల్యే అరంగనాథన్, ఆలయ జాయింట్ కమిషనర్ సెంథిల్వేలవన్, జడ్పీ చైర్మన్ నైనాకన్ను, మున్సిపల్ చైర్మన్ బాలచందర్, మాజీ మంత్రి పిచ్చాండి, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీధరన్ తదితరులు పాల్గొన్నారు.
వేడుకగా వాహనసేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన బుధవారం ఉదయం పంచమూర్తులను వెండి వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి హంస, నంది, చిన్న వృషభ వాహనాల్లో ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు. డిసెంబర్ 2న రథోత్సవం నిర్వహించనున్నారు. 5న ఉదయం 4 గంటలకు మూలవర్ సన్నధిలో భరణి దీపం, సాయంత్రం 6 గంటలకు కొండపై మహా దీపం వెలిగించనున్నారు. ఈ దీపాన్ని ద ర్శించుకునేందుకు విదేశాల నుంచి సైతం భక్తులు తరలిరానున్నారు.