రేసింగ్ చాంపియన్ సుందర్ దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరి సజీవ దహనం
సాక్షి ప్రతినిధి, చెన్నై: జాతీయ రేసింగ్ చాంపియన్ అశ్విన్ సుందర్, ఆయన భార్య నివేదిత దుర్మరణం పాలయ్యారు. ఎంఆర్సీ నగర్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ సజీవ దహనమయ్యారు. మిత్రుని ఇంటి నుంచి బయల్దేరిన అశ్విన్, నివేదితలు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దంపతులిద్దరూ అగ్నికి ఆహుతయ్యారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు.
31 ఏళ్ల ఈ జాతీయ చాంపియన్ టూ వీలర్, కార్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లలో పలుమార్లు టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. 2006లో చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ అవార్డును దక్కించుకున్నాడు. జర్మనీకి చెందిన రేసింగ్ టీమ్ మాకాన్ మోటార్‌స్పోర్ట్స్‌తో ఒప్పందం చేసుకున్న అశ్విన్ 2008లో జర్మన్ ఫార్ములా ఏడీఏసీ చాంపియన్‌షిప్‌లోనూ పాల్గొన్నాడు. వరుసగా 2012, 2013 లలో జాతీయ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. కాగా ఆయన భార్య నివేదిత చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్. సుందర్ మృతి పట్ల ఫెడరేషన్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అక్బర్ ఇబ్రహీమ్, చైర్మన్ సుజీత్ కుమార్, భారత ఫార్ములా వన్ డ్రైవర్ కరుణ్ చందోక్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.