కార్లు తగ్గించినా.. కాలుష్యం తగ్గలేదు
న్యూఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో 'సరి - బేసి' కార్ల ప్రయోగాన్ని ఢిల్లీ సర్కారు ప్రవేశపెట్టినా కాలుష్యం మాత్రం పెద్దగా తగ్గలేదు. ఈ పథకాన్ని శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చినా... వాహన కాలుష్యం మాత్రం గతంలో మాదిరిగానే ఉంది. వాతావరణంలో కాలుష్యం అలాగే ఉందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ (సఫర్)కు చెందిన ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. అయితే శుక్రవారం ఉదయం కంటే సాయంత్రానికి కాలుష్యం చాలా తగ్గిందని ఆప్ వర్గాలు చెప్పడం విశేషం.
నగరంలో వాయు కాలుష్యం తగ్గలేదని వివిధ ప్రదేశాల్లోని సఫర్ స్టేషన్లల్లో ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడించిందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ పేర్కొంది. గురువారంతో పోలిస్తే... శుక్రవారం కూడా వాయుకాలుష్యంలో అదే స్థాయిలో ఉందని చెప్పింది. న్యూఢిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం సరి - బేసి కార్ల ప్రయోగాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
జనవరి 1-15 తేదీల మధ్య ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. తొలిరోజు చాలావరకు బేసి సంఖ్య వాహనాలే రోడ్లపైకి వచ్చాయి. అయితే.. అక్కడక్కడ సరి సంఖ్య నంబరు వాహనాలు కూడా వచ్చాయి. దీంతో ఢిల్లీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం సదరు వాహనాలకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించారు.