హెచ్1బీ దుర్వినియోగం అడ్డుకుంటాం
వాషింగ్టన్: హెచ్1 బీ, ఎల్1 వీసాల దుర్వినియోగం అడ్డుకునేందుకు చట్టపరనమైనవి సహా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అమెరికా తదుపరి అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ స్పష్టం చేశారు. యూఎస్ అటార్నీ జనరల్ పదవికి ఇటీవలే జెఫ్ను డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. పదవికి లాంఛనప్రాయంగా ఎంపికయ్యే క్రమంలో గురువారం సెనేట్ జ్యుడిషియరీ కమిటీకి తన అభిప్రాయాల్ని వినిపించారు. ‘ప్రపంచంలో ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తులు తక్కువ జీతానికి పని చేసేందుకు సిద్ధంగా ఉంటే... ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న అమెరికన్లను తీసేయవచ్చు అనుకుంటే అది తప్పని’ అభ్యంతరం తెలిపారు. ‘మనకు హద్దులున్నాయి. మన పౌరుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దాని కోసం మీతో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తా’ అని కమిటీతో జెఫ్ అన్నారు.