ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ ముఠా అరెస్ట్!
సిడ్నీ: దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను అక్రమ సరఫరా చేస్తున్న ముఠాను ఆస్ట్రేలియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 360 మిలియన్ డాలర్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్రిస్మస్ వేడుకలలో భాగంగా దేశంలో విస్తృత తనిఖీలు చేపట్టిన అధికారులు తమ నిఘా పటిష్టం చేశారు. ఇందులో భాగంగా మత్తుపదార్థాలను సరఫరా చేస్తున్న 15 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. ఇందులో మాజీ రగ్బీ ఆటగాడు ఉన్నట్లు స్థానిక మీడియా 9 న్యూస్ పేర్కొంది.
ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు, న్యూ సౌత్‌వెల్స్ పోలీసులతో పాటు తాహిటి, ఫిజీ బృందాలు సమష్టిగా దాడిచేసి బ్రూక్లిన్ లో 500 కిలోల కొకైన్‌ను, తాహిటిలో మరో 600 కిలోల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దేశ చరిత్రలోనే ఇది పట్టుబడ్డ పెద్ద డ్రగ్స్ ముఠా అని ఏసీపీ క్రిస్ హీహాన్ అన్నారు. దక్షిణ అమెరికా దేశాల నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ అక్రమ రవాణా అవుతున్నాయని, 29-63 ఏళ్ల వయసున్న వారు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని వివరించారు. అరెస్టయిన వారిలో ఏ ఒక్కరికి బెయిల్ ఇచ్చే అవకాశం లేదని ఏసీపీ తెలిపారు.