రూ. 5 కోట్లకు ఉద్యోగాలను అమ్ముకున్నారు..
హన్మకొండ, న్యూస్‌లైన్ : ఒక్కటి, రెండు కాదు... 130కిపైగా ఉద్యోగాలను బేరం పెట్టారు. ట్రాన్స్‌కోలోని ఓ ఉన్నతాధికారి ‘నాయక’త్వంలో వీటిని అమ్మకానికి పెట్టగా... యూనియన్ నేత ఒకరు వసూళ్ల దందా నిర్వహించారు. రూ.ఐదు లక్షలకో ఉద్యోగం చొప్పున మొత్తం రూ. 5 కోట్ల మేర దండుకున్నారు. ఔట్సోర్సింగ్ పద్ధతిన ట్రాన్స్‌కోలో ఇటీవల చేపట్టిన ఉద్యోగాల నియూమకంలో వెలుగుచూసిన విక్రయ దందా ఇది.
అన్ని అర్హతలున్నా... తమకు కొలువు ఇవ్వడం లేదని, మార్కులు తక్కువగా ఉన్న వారికి అవకాశం కల్పించారంటూ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న పలువురు ఇటీవల విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్‌కో ఉన్నతాధికారితో సహా ఓ ఎస్ఈ స్థాయి అధికారి.. వారి అనుకూల వర్గానికి ప్రాధాన్యమిస్తూ అక్రమ పద్ధతుల్లో భర్తీ చేస్తున్నారని.. పలువురు యూనియన్ నేతల మధ్యవర్తిత్వంతో నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ మేరకు విజిలెన్స్ పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో సుమారు ఏడాది నుంచి విడతల వారీగా ఉద్యోగులను నియమించినట్లు, ఇప్పటివరకు మొత్తం 130 మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిన తీసుకున్నట్లు గుర్తించారు. వారి నుంచి సుమారు రూ. 5 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు తేలింది. ట్రాన్స్‌కో సబ్స్టేషన్లలో కూడా ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకున్న ఉద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టేందుకు ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం అడిషనల్ ఎస్పీ రంగంలోకి దిగడం ట్రాన్స్‌కోలో కలకలం రేపుతోంది.
బయటకు తెల్వకుండానే...
ట్రాన్స్‌కో కార్యాలయూల నిర్వహణ, లైన్ వర్క్స్, కంప్యూటర్ ఆపరేటర్లు, ట్రాన్స్ఫార్మర్స్ వింగ్, లైన్స్ మెరుుంటనెన్స్ వింగ్ వంటి విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగులను నియమించుకోవాలని ట్రాన్స్ కో ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. వారి నియామక బాధ్యతలను జిల్లా అధికారులకే కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉద్యోగుల నియామకాన్ని ఇక్కడి అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఎక్కడా బయటకు పొక్కకుండా... వారి బంధువర్గం, యూనియన్ నేతల పైరవీలతో ఉద్యోగాల నియూమక ప్రక్రియ పూర్తి చేశారు. యూనియన్ నేతలే స్వయంగా దరఖాస్తులు తీసుకుని, వారే ఎంపిక చేశారని విచారణలో తేలినట్లు సమాచారం. ట్రాన్స్‌కో పరిధిలోని ఓ సబ్‌స్టేషన్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయనే విషయంలో విచారణ చేస్తున్నామని ట్రాన్స్‌కో విజిలెన్స్ వరంగల్ సీఐ జితేందర్‌రెడ్డి తెలిపారు.
మరో 20 మందికి...
క్షేత్రస్థాయిలో మరో 20 మంది ఉద్యోగులు కావాలని, వారిని కూడా ఔట్ సోర్సింగ్‌లో తీసుకునేందుకు సదరు అధికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వీటిని కొనుక్కునేందుకు ఐటీఐ చేసిన నిరుద్యోగులు బేరసారాలకు దిగుతున్నారు. ఇప్పటికే సుమారు 40 మంది నిరుద్యోగ యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు వినికిడి. వీరిలో ఎంత మందికి ఉద్యోగం ఇస్తారనేప్రచారం జరుగుతుండగానే... అర్హులకు అన్యాయం చేశారంటూ ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగానికి కొంతమంది ఉప్పందించినట్లు గుసగుసలు వినిపిస్తున్నారుు.