ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ
=రూ. లక్ష తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
=అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు
నర్సీపట్నం, న్యూస్‌లైన్: ఏసీబీ వలకు భారీ తిమింగలం చిక్కింది. మద్యం దుకాణం యాజమాని నుంచి ఎక్సైజ్ సీఐ ఖలీమ్ రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఆశాఖ అధికారులు శుక్రవారం దాడిచేసి పట్టుకున్నా రు. వివరాలిలా ఉన్నాయి. గొలుగొండ మండలం చీడిగుమ్మలలో విజయ, పెదబొడ్డేపల్లిలో క్వాలిటీ వైన్ షాపుల నిర్వాహకుడు అయ్యపురెడ్డి రమణ అలియాస్ బాబ్జీ ప్రతి నెలా ఎక్సైజ్ అధికారులకు ఇచ్చే మామూళ్లను నిలిపేశాడు.
ఈమేరకు ఎక్సైజ్ సీఐ పలుమార్లు అతని పై ఒత్తిడి చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన సీఐ తరచూ షాపుల వద్దకు వెళ్లి గుమస్తాలను బెదిరించేవారు. దీంతో షాపుల యాజమాని కాళ్ల బేరానికి వచ్చా రు. సీఐ రూ. రెండు లక్షలు డిమాండ్ చే శారు. ఈ నెల 20, 21 తేదీల్లో విశాఖలో ఉంటానని, 22న నర్సీపట్నం వచ్చేసరికి మొ త్తాన్ని చెల్లించాలని షరతు విధించారు. అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేనని షాపు యాజమాని చెప్పడంతో చివరకు రూ. లక్షకు ఒప్పందం కుదిరింది. ఈమేరకు షాపు యాజ మాని రమణ ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు.
శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో సీఐకి రూ. లక్ష ఇస్తుండగా డీఎస్పీ నర్సింహరావు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు రమణమూర్తి, గణేష్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింహరావు మాట్లాడుతూ లంచం డిమాండ్ చేసే వారి వివరాలు తెలియజేస్తే దాడి చేసి పట్టుకుంటామన్నారు. వారి వివరాలు గోప్యం గా ఉంచుతామని, ప్రజలు స్వ చ్ఛందంగా సహకరించాలని కోరారు. సీఐ ఖలీమ్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు.
భారీ ఆక్రమార్జన : రెండేళ్ల క్రితం ఇక్కడ ఎక్సైజ్ సీఐగా బాధ్యతలు చేపట్టిన ఖలీమ్ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. వైన్ షాపుల సిండికేట్ల నుంచి భారీగా నెలవారీ మామూళ్లు తీసుకుంటారని,గంజాయి రవాణా దారుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా మామూళ్లు తీసుకుని సెటిల్మెంట్కు పాల్పడుతున్నట్టు వాదనలు ఉన్నా యి. రెండు రోజులకోసారి విశాఖ నుంచి వచ్చే ఈయన కేవలం మామూళ్ల వసూళ్లకే ప్రాధాన్యం ఇస్తారని ఇక్కడ చెప్పుకుంటున్నారు.