ముగ్గురు టీచర్ల సస్పెన్షన్
పాడేరు, న్యూస్‌లైన్ : విశాఖ ఏజెన్సీలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ముంచంగిపుట్టు మండలం బాబుశాల పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచే స్తున్న బి.శంకరరావు తన పరిధిలోని మొండిగుమ్మ, ఏడుకొండలబంద పాఠశాలకు సంబంధించి భవన నిర్మాణ పనులు పూర్తి చేయకుండా రూ.9.96 లక్షల నిధులను సొంతానికి వాడుకున్నారు. అరకులోయ మండలం నంద గ్రామంలోని పాఠశాలలో 2011 నుంచి టీచర్‌గా పనిచేస్తున్న పి.మాలతి గత ఆక్టోబర్ వరకూ విధులకు రానేలేదు.
అయినా ఓ వాలంటీర్‌ను ఏర్పాటు చేసి పాఠశాల ను నడిపించారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యవహారంపై విచారణ చేపట్టగా అది నిజమని తేలింది. అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ బంగారుపేట పాఠశాలలో పనిచేస్తున్న రొబ్బా రామకృష్ణ విధులకు హాజరుకాకుండా రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జునరెడ్డి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.