భగ్గుమన్న భూ తగాదాలు
ధారూరు: భూతగాదాలు భగ్గుమన్నాయి. ఇరువర్గాల వారు రాళ్లు, కట్టెలతో దాడులకు దిగడంతో మండల పరిధిలోని రాళ్లచిట్టెంపల్లిలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణలో ఇరవై మంది గాయపడగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాళ్లచిట్టెంపల్లి గ్రామానికి చెందిన బాబుమియాకు కొడుకు గోరెమియా, కూతుళ్లు మహబూబ్‌బీ, ఆలంబీ, ఖాజాబీ, షహదా, ఘోరీ, అప్సర ఉన్నారు.
బాబుమియా తన చిన్న కూతురు అప్సరకు ఇల్లరికం అల్లుడిని తీసుకురావాలని తనకున్న పొలంలో మూడెకరాలను దానపత్రం ఇచ్చాడు. పొలం గిరిగిట్‌పల్లి గ్రామంలో ఉంది. కొన్నాళ్ల క్రితం బాబుమియా చనిపోయాడు. అప్సరను సోదరుడు గోరెమియా పట్టించుకోకపోవడంతో ఆమె తన భూమిని అమ్మకానికి పెట్టింది.
అదే గ్రామానికి చెందిన సిరాజుద్దీన్ రూ. 5 లక్షలకు బేరం కుదుర్చుకుని రూ. 2 లక్షలు అడ్వాన్సుగా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మిగతా డబ్బును కొన్నాళ్ల తర్వాత అప్సర పెళ్లికి వినియోగించాడు. తను కొన్న భూమిని సిరాజుద్దీన్ గోరెమియా దాయాదులైన సులేమాన్, ఉస్మాన్‌లకు రూ. 7 లక్షలకు విక్రయించాడు.
ఈక్రమంలో కొంతకాలంగా గోరెమియా తన దాయాదులతో పాటు సిరాజుద్దీన్‌తో గొడవపడుతున్నాడు. ఈ విషయమై శనివారం ఉదయం గ్రామంలో పంచాయితీ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఈక్రమంలో వాగ్వాదం జరిగి గోరెమియా, సిరాజుద్దీన్ వర్గీయులు ఘర్షణకు దిగారు. కట్టెలు, రాళ్లు, కారంపొడితో దాడి చేసుకున్నారు.
గోరెమియా వర్గానికి చెందిన కావలి రాములమ్మ, వెంకట్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో పాటు మరో వర్గానికి చెందిన ఆకుల ఉస్మాన్, ఖాజా మైనొద్దీన్‌లతో పాటు మొత్తం 20 మందికి గాయాలయ్యాయి. కావలి రాములమ్మ, వెంకట్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఆకుల ఉస్మాన్‌ల పరిస్థితి విషమింగా ఉండడంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా గొడవకు కారణమైన ఇరువర్గాలకు చెందిన వారిని పోలీసులు ఠాణాకు తరలిస్తుండగా కొందరు మహిళలు అడ్డుకున్నారు.
తమ వారిని వదిలి పెట్టాలని డిమాండు చేయగా పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం అప్సరను డీఎస్పీ నర్సింలు విచారించి వాంగ్మూలం సేకరించారు. ఇరువర్గాలకు చెందిన వారిని అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. రాళ్లచిట్టెంపల్లిలో డీఎస్పీ నర్సింలుతో పాటు ఇద్దరు సీఐలు, ఐదుమంది ఎస్ఐలు, 30 మంది పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు.
గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ
రాళ్లచిట్టెంపల్లిలో ఉద్రిక్తత నె లకొనడంతో ఎస్పీ రాజకుమారి శనివారం రాత్రి గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఘటనకు దారి తీసిన అంశాలపై ఇరువర్గాలతో మాట్లాడారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పికెట్ ఏర్పాటు చేశారు. రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజకుమారి డీఎస్పీ నర్సింలుకు సూచించారు.