విల‘పింఛన్’
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆసరా పథకం లబ్ధిదారుల ఎంపిక జాబితాపై రెండో రోజు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిరస న తెలిపారు. పింఛన్ జాబితాలో పేరు లేక పోవడం తో చేర్యాల మండలం కిష్టంపేటలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. అధికారుల పొరపాట్లతో పేరు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు.
పాలకుర్తి : పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఆసరా పథకం పింఛన్ రాలేదని మనస్థాపంతో బైరపాక బచ్చమ్మ(80) ఆకస్మికంగా మరణించింది. ఇదే గ్రామం ఎర్రకుంట తండాకు చెందిన లకావత్ బుచ్చి(70) బమ్మెర గ్రామ పంచాయతీ దగ్గర పింఛన్ జాబితాలో తన పేరు లేదని అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. తొర్రూరు, రాయపర్తి, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లోని పలు గ్రామాల్లో పింఛన్లు పొందుతున్న గత లబ్ధిదారుల పేర్లు తొలగించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామాల్లో పింఛన్లు మంజూరు కానివారు తిరిగి దరఖాస్తు చేసుకున్నారు.
ములుగు : ఆసరా పింఛన్ జాబితాలో పేర్లులేని వికలాంగులు, వితంతువులు, వృద్ధులు మంగళవారం ఆయా మండలాల్లో ఆందోళనలు చేపట్టారు. రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. వీరికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. పత్తిపల్లి శివారు కొడిశలకుంట గ్రామానికి చెందిన భూక్య సింధల్ కుమారుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగిగా నమోదైంది. స్థానిక వీఆర్వోకు ఆమె వినతిపత్రం అందించారు. వినతిపపత్రం అందజేశారు.
భూపాలపల్లి : రేగొండ మండలంలో అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 200 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మంగళవారం పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. భూపాలపల్లి, గణపురం, శాయంపేట, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో ఆసరా పథకంలో పింఛన్లు మంజూరు చేయలేదంటూ ఎవరూ గోడవలు, ఘర్షణలు, ధర్నా, రాస్తారోకో, నిరసనలకు దిగలేదు. అర్హులైన వారి నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలంలో అర్హులై వారందరికి పింఛన్లు అందించాలని స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీ ఎదుట ధర్నా నిర్వహించారు. కమిషనర్ రాజలింగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లికుదురు మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పింఛన్లు అందించాలని ధర్నా నిర్వహించారు.
నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు వుండలాల్లో పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు 1415 వుంది దరఖాస్తులు చేసుకున్నారు. సోవువారం జరిగిన గ్రావుసభల్లో 1,342 వుంది, వుంగళవారం 73 వుంది దరఖాస్తు చేసుకున్నారు.
పరకాల : ఆసరా పథకం కోసం అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు జాబితాలో పేరు రాకపోవడంతో మంగళవారం కార్యాలయాల చుట్టూ బారులు తీరారు. జాబితాల్లో పేర్లు లేకపోవడంతో అధికారుల విజ్ఞప్తి మేరకు మారోమారు దరఖాస్తులను అందిస్తున్నారు. ఆత్మకూరు మండలంలోని గ్రామ పంచాయతీల్లో పెన్షన్‌దారుల జాబితాలు అందుబాటులో లేవు. కంప్యూటర్ తప్పులు, సమగ్ర కుటుంబ సర్వే(ఎస్కేఎస్) ఫారాలు లేవంటూ తిప్పి పంపుతున్నారు. అధికారులు దరఖాస్తులను స్వీకరించడానికి అందుబాటులో లేరు. గీసుకొండ మండలం వ్యాప్తంగా 450 మంది వరకు రెండోసారి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సంగెం మండలంలో జాబితాలో పేర్ల రాని వారు అక్కడక్కడ రెండోసారి దరఖాస్తులు చేసుకున్నారు.
జనగామ : జనగామ మునిసిపాలిటీ కార్యాలయం ఎదుట ఎస్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పింఛన్ల ఎగవేతపై మండిపడ్డారు. చేర్యాల మండలంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మండలంలోని కిష్టంపేటలో పింఛన్ రాకపోవడంతో నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
వరంగల్ తూర్పు : కాశిబుగ్గ చౌరస్తా ఐదో డివిజన్‌కు చెందిన అడుప వెంకట నర్సయ్య(80)కు సోమవారం ప్రకటించిన పింఛన్ల జాబితాలో పేరు లేకపోవడంతో మానసిక వేదనతో గుండెపోటుతో మంగళవారం నిద్రలోనే చనిపోయారు. పేర్లులేని అర్హులైనవారు మళ్ళీ ధరఖాస్తు చేసుకుంటున్నారు.
వరంగల్ పశ్చిమ : అర్హులైన వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలని కోరుతూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో లష్కర్సింగారంలోని నోడల్ ప్రభుత్వ ఉర్దూ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
డోర్నకల్ : డోర్నకల్ ఎంపీడీవో కార్యాలయంలో పింఛన్‌రాని వితంతువులు, వృద్ధులు, వికలాంగులు దరఖాస్తులు చేసుకోవడం కోసం భారీ ఎత్తున తరలివచ్చారు. కురవి మండలం నల్లెల్లలో పింఛన్ జాబితాలో పేర్లు లేకపోవడంతో భారీ సంఖ్యలో తరలివచ్చిఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంపీడీవోను అడ్డుకున్నారు. పింఛన్లు ఇస్తానని హామీ ఇచ్చారు. కాళ్లు చేతులు, నడుము పనిచేయని స్థితిలో ఉన్న ఎనిమిది ఏళ్ల చిన్నారి బాలిక పేరు పింఛన్ జాబితాలో లేక పోవడంతో నల్లెల్లకు చెందిన నక్క స్వరూప తన కుమార్తెను తీసుకొని వచ్చి ఎంపీడీవో కార్యాలయం మెట్లపై పడుకోబెట్టి నిరసన వ్యక్తం చేసింది.