విజయ్ చిత్రానికి బాహుబలి రైటర్?
ఒక స్టార్ హీరోకు మరో స్టార్ రైటర్ తోడైతే ఆ చిత్రాలు ఎంత సంచలన విజయాలు సొంతం చేసుకుంటాయోయన్నది చాలా సార్లు చూశాం. అలాంటి వాటిలో బాహుబలి చిత్రం ఒక ఉదాహరణ. ప్రపంచ సినిమాను అబ్బురపరచిన చిత్రం బాహుబలి.ఆ చిత్ర కథకుడు విజయేంద్రప్రసాద్. ఈయన నవ దర్శకేంద్రుడు రాజమౌళి తండ్రి అన్న విషయం తెలిసిందే. ఒక కథకుడిగా ఈయన సాధించిన విజయాలెన్నో. ఇటీవల చూసుకుంటే బాహుబలి, మగధీర, నాన్ఈ(ఈగ) హిందీలో భజరంగి భాయ్‌జాన్ చిత్రాలకు కథలు విజయేంద్రప్రసాద్ కలం నుంచి జాలువారినవే.
ఇక అసలు విషయానికి వస్తే విజయ్ తన 60వ చిత్రం భైరవను పూర్తి చేసే పనిలో ఉన్నారు.అయితే విజయ్ తదుపరి చిత్రం ఏమిటన్న విషయంలో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడా చిత్రం గురించి కొంత క్లారిటీ వచ్చింది. విజయ్‌తో తెరి వంచి బ్లాక్‌బ్లస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అట్లీ ఆయనతో మరో చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అవుతున్నారు. దీనికి బాహుబలి చిత్ర రచయిత కథను అందిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇదే కనుక నిజం అయితే విజయ్ నుంచి మరోసారి రికార్డులను బద్దలు కొట్టే చిత్రాన్ని ఆశించవచ్చునన్నమాట.