బక్రీద్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు
హైదరాబాద్ : త్యాగనిరతిని చాటి చెప్పే బక్రీద్(ఈద్-ఉల్-జుహా) పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకొంటున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు ఈద్గాహ్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలనాడు ఇబ్రహీం అలైసలాం తన కుమారున్ని దైవమార్గంలో బలి ఇచ్చేందుకు ఉపక్రమించటం ఆయన త్యాగానికి పరాకాష్ట.
ఆ త్యాగాన్ని మననం చేసుకోవడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం. నగరంలోని ఈద్గా మీరాలం, మాదన్న పేట, గోల్కొండ, మక్కా మసీదు, నాంపల్లిలోని షాహీ మస్జీద్, బాగేమా, హజ్ హౌస్ మస్జీద్లతో పాటు సుమారు 120 మసీదులు బక్రీదు కోసం ముస్తాబు అయ్యాయి. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకూ ఈద్-ఉల్-అజ్హా ప్రార్థనలు జరిగాయి.
పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మరోవైపు బక్రీదు సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.