టాటా మోటార్స్ ఎండీ కార్ల్ సిమ్ ఆకస్మిక మృతి
బ్యాంకాక్/న్యూఢిల్లీ: టాటా మోటార్స్ ఎండీ కార్ల్ సిమ్(51) ఆదివారం బ్యాంకాక్‌లో ఆకస్మికంగా మరణించారు. ఒక హోటల్ బిల్డింగ్ 22వ అంతస్తు నుంచి నాలుగో అంతస్తులో పడి మృతి చెందినట్లు బ్యాంకాక్ పోలీసులు తెలిపారు. టాటా మోటార్స్ థాయ్‌లాండ్ విభాగం బోర్డ్ మీటింగ్‌కు హాజరవ్వడానికి బ్యాంకాక్ వచ్చినట్లు కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. కాగా ఆయన బసచేసిన హోటల్ గదిలో సూసైడ్ నోట్ దొరికినట్లు సమాచారం.
వాహన పరిశ్రమ సుదీర్ఘ మందగమనంలో ఉన్న తరుణంలో టాటా మోటార్స్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన కంపెనీని విజయబాటలో నడిపించారని, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ సంతాప సందేశంలో తెలిపారు. 2007-11 మధ్య కాలంలో జనరల్ మోటార్స్ ఇండియాకు ఎండీగా కార్ల్ సిమ్ పనిచేశారు. 2012లో టాటా మోటార్స్‌లో చేరారు. దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఆయన టయోటా, జనరల్ మోటార్స్‌లో వివిధ దేశాల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు.