సీఎంకు గాజులు కొరియర్
ఐద్వా వినూత్న నిరసన
మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ...
అనంతపురం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ, జనవాసాల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటుని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రికి పసుపు, కుంకుమ, గాజులు, పూలను బుధవారం కొరియర్ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలుత ఆ శాఖ నాయకురాళ్లు ఒక కంచంలో పసుపు, కుంకుమ, గాజులు, పూలను ఉంచుకుని అనంతపురంలోని నడిమి వంక నుంచి ర్యాలీగా టవర్‌క్లాక్ వద్ద ఉన్న ప్రధాన తపాలా కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి ముఖ్యమంత్రికి కొరియర్ చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీదేవి, సావిత్రి మాట్లాడుతూ.. మద్యపానాన్ని విచ్చలవిడి చేసి ప్రజల ఆరోగ్యాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు.
మద్యం నియంత్రించాలని ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆందోళన చేస్తున్నా.. కనీస స్పందన కూడా ప్రభుత్వం లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమంపై కంటే మద్యం వ్యాపారంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని విమర్శించారు. ప్రజాందోళనలను పరిగణలోకి తీసుకుఏని మద్యం వ్యాపారాన్ని నియంత్రించాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు యమున, చంద్రిక, కార్పొరేటర్ భూలక్ష్మి, నాయకురాళ్లు విజయ, కవిత, ఉమ, రామాంజినమ్మ, భాగ్య, తదితరులు పాల్గొన్నారు.