నిరుద్యోగుల ఆశలపై నీళ్లు!
ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు ప్రభుత్వం అందజేస్తున్న రుణాలు పక్కదారి పడుతున్నాయి. స్వయంశక్తితో ఎదగాలనుకున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లుజల్లుతూ అధికార పార్టీ నాయకులు తమ బంధు గణానికే రుణాలందజేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. కేవలం కమిటీల ముసుగులో తమ వారికే టీడీపీ నాయకులు రుణాలందిస్తున్నారంటూ అర్హులైన లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇంటర్వ్యూలు సైతం మొక్కుబడిగానే ముగిస్తున్నారని వాపోతున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్ : అర్హులైన నిరుద్యోగులకు రుణాలిచ్చి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇటీవలజిల్లా యంత్రాంగం దరఖాస్తుల్ని ఆహ్వానించింది. దీంతో రుణాలు పొంది స్వయంశక్తితో ఎదగాలనే లక్ష్యంతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఈ ఏడాది బీసీ నిరుద్యోగ యువతకు రూ.51.78 కోట్లుతో 9,426 యూనిట్లు, ఎస్సీలకు రూ.14.51 కోట్లుతో 1250 యూనిట్లు, ఎస్టీలకు(ైటైకార్ పథకం)రూ.11.64 కోట్లుతో 1194 యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి కోసం అందిన దరఖాస్తులను నాలుగు రోజులుగా మండలాల్లో అధికారులు పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రక్రియ ఈ నెల 28వ తేదీతోనే ముగియాల్సి ఉండగా జిల్లా యంత్రాంగం మరో రెండు రోజులు పొడిగించింది. అది కూడా మంత్రి సొంత నియోజకవర్గం పరిధిలోని నందిగామ, టెక్కలి మండలాల నుంచి పూర్తిస్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతోనే గడువును అధికారులు పొడిగించారనే విమర్శలున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీ నాటికి గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి రుణాల జారీకి సిద్ధం కావాలని జిల్లా యంత్రాంగం ఆదేశించడంతో టీడీపీ నాయకుల్లో ఉత్సాహం నెలకొంది.
మొక్కుబడిగానే ఇంటర్వ్యూలు
ఇంటర్వ్యూలు జరుగుతున్న తీరును పరిశీలిస్తే అధికార పార్టీ నాయకుల హవా ఇట్టే అర్థమవుతోంది. కమిటీల పేరుతో నలుగురు సభ్యులు ఇంటర్వ్యూల్లో ఉంటున్నారు. వీరు గ్రామస్థాయిలో ఆ పార్టీ నాయకులు ప్రతిపాదించిన జాబితాను ముందుగానే గుర్తించి పెట్టుకుంటున్నారు. ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకొని పంపిస్తున్నారు. అనంతరం వీరి అనునాయులకే తుది జాబితాల్లో చోటు కల్పిస్తున్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీ, మండల స్థాయిలోనూ ఇదే స్థాయిలో ఎంపికలు సాగుతుండడంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోంది. జన్మభూమి కమిటీల పేరిట ప్రభుత్వం ఓ జీవో జారీ చేయడం.. అన్ని ఎంపికలకూ వీరి ఆమోదం తప్పనిసరి చేయడంతో వీరు ఆడింది ఆట..పాడింది పాటగా మారుతోంది.
ఆది నుంచీ అంతే..
నిరుద్యోగ యువకులు ఇంటర్వ్యూల ఎంపిక ప్రక్రియను ముందస్తుగానే గ్రహించి తొలుత దరఖాస్తులు చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. అయితే పదే పదే 50 శాతం సబ్సిడీ అంటూ గ్రామస్థాయిలో అధికారులు ప్రచారం చేసి వారిలో ఆశలు రేకెత్తించారు. దీంతో పొడిగించిన సమయంలోనే ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు సుమారు రూ.300 వరకు ఖర్చు చేసి మరీ బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. అరుుతే ఎంపిక ప్రక్రియ చూసి ఆందోళన చెందుతున్నారు.
బ్యాంకర్లదీ అదే దారి
రుణలు పొందేందుకు అనుమతి పత్రాలపై సంతకాలు చేయాల్సిన బ్యాంకర్లు కూడా అధికార పార్టీకే కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వస్తున్నారుు. స్వతాహాగా అనుమతులు ఇవ్వకుండా కమిటీ ఎంపిక చేసిన వారికే రుణాలు పొందేందుకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. వాస్తవానికి రుణం పొందేందుకు అర్హత సాధించిన అభ్యర్థులకు బ్యాంకు అనుమతి తప్పనిసరి. ఈ నిబంధనను ఎక్కడా పాటించడం లేదు. దీంతో పాటు పలుకుబడి ఉన్నవారికే బ్యాంకర్లు సహకారమందిస్తూ రుణాల ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
మీకింత..నాకెంత?
మరోవైపు కమిటీలు ప్రత్యక్ష అవినీతికి తెరతీశాయి. మీకు రుణం మంజూరు చేయిస్తాం..సబ్సిడీలో మాకెంత ఇస్తారంటూ పలువురితో బేరసారాలు కుదుర్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. రుణాల పేరిట జాతర జరుగుతుండడంతో లబ్ధిదారులు కూడా నాయకులకు డబ్బులిచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. యూనిట్లు నెలకొల్పకుండానే రుణం పొందేందుకు, లేకుంటే పాత యూనిట్లను చూపించే రుణాలు పొందేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
నామమాత్రంగానే అధికారులు
ఇంత జరుగుతున్నా అధికారుల్లో కదలిక లేదు. రుణాల ఎంపిక ప్రక్రియలో వీరే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో జరిగిన ఎంపికల్లో ఇదే ప్రామాణికంగా ఉండేది. ప్రస్తుతం ఈ విధానం కనిపించడం లేదు. అధికారులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని రుణాల మంజూరీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ అధికారి వాపోయూరు.