ఇక్కడ మందు తాగితే జైలుకే..!
పనాజీ: గోవా అనగానే గుర్తొచ్చేది బీచులు. చాలా మంది అక్కడికి వెళ్లి బీచ్ పక్కన కూర్చొని మందు తాగటానికి ఇష్టపడతారు. కాకపోతే దీనికి గోవా ప్రభుత్వం చెక్ పెట్టాలని మంగళవారం నిర్ణయం తీసుకుంది. బీచుల్లో మద్యం తాగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర శాసనసభ హెచ్చరించింది.
బీచులన్నీ శుభ్రంగా ఉంచాలని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి మనోహర్ అజ్గౌన్కర్ తెలిపారు. మద్యం తాగినా, ఎక్కడపడితే అక్కడ సీసాలు పడేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అవసరమైతే వారిని జైల్లో పెట్టడానికైనా వెనుకాడమని హెచ్చరించారు. దీనికోసం త్వరలో టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నామని తెలిపారు. మాదకద్రవ్యాల విషయంలోనూ టూరిస్ట్ గార్డులను నియమించామన్నారు. ఇప్పటికే పోలీసులు బీచుల్లో మద్యం తాగినవారిపై కొన్ని కేసులు నమోదు చేశారన్నారు. వారికి భారీగా జరిమానా విధిస్తామని చప్పారు.