విచిత్రవిహారం
కస్టమైజ్డ్గా తీర్చిదిద్దిన మోటార్ సైకిల్స్‌లో బెస్ట్ కస్టమైజ్డ్ని ఎంపిక చేసేందుకు హార్లీ డేవిడ్సన్ కంపెనీ ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే రాక్ రైడర్స్ కాంటెస్ట్‌కు సౌత్ ఇండియా నుంచి కొచ్చిన్ తర్వాత ఎంపికైన బైక్ మన సిటీదే కావడం విశేషం. దీంతో ఈ బైక్‌ని డిజైన్ చేసిన ఇద్దరు యువకులు అకస్మాత్తుగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ముంబయిలో అక్టోబరు 30 నుంచి 2రోజులు కొనసాగే ఈ పోటీకి ఎంపికైన లేటెస్ట్ హార్లీ డేవిడ్సన్ బైక్‌ను కస్టమైజ్ చేసిన వీరిద్దరూ.. మోటార్ సైకిల్స్, హెల్మెట్స్ తమకు కాన్వాస్ అంటున్నారు.
లుక్ కాదు వర్క్ బాగుండాలి...
వీరు ఇంజినీర్లు మాత్రమే కాదు రైడర్స్ కూడా. అందుకే బైక్ లుక్ అదిరిపోవడం అంటే... దాని పనితీరు మందగించడం కాదంటారీ ఫ్రెండ్స్. హార్లీ బైక్స్‌లో అవార్డులు గెలుచుకున్న దాదాపు డజను బైక్స్‌కు వీరు పెయింట్ చేశారు. ‘ఒక బైక్ ఓనర్ హైదరాబాద్ మీద తన ఇష్టాన్ని బైక్ ద్వారా ప్రదర్శించాలనుకున్నాడు. మేం దాన్ని పుల్‌ఫిల్ చేశాం. బైకర్స్ తమ అభిరుచుల్ని, ఇష్టాఇష్టాల్ని బైక్స్ ద్వారా ప్రదర్శించుకునేందుకు సహకరించడమే మా ధ్యేయం. ఇప్పటికి దాదాపు 120 బైక్స్‌కి ఆర్ట్‌వర్క్ చేశాం. దేశవ్యాప్తంగా పంజాబ్, దిల్లీ, జమ్మూ కశ్మీర్‌ల నుంచి కూడా మాకు కస్టమర్స్ వస్తుంటారు’ అని చెప్పారీ ద్వయం. బాడీ మీద టాటూ వేయించుకోవడం బైక్ మీద పెయింటింగ్ సేమ్ అంటున్న వీరు.. కస్టమైజేషన్‌కు కనీసం 3వారాల సమయం, రూ.50 వేల పైనా వ్యయం అవుతుందంటున్నారు. ఏదేమైనా వైవిధ్యమైన రంగాన్ని ఎంచుకుని రాణిస్తున్న ఈ యువత మన సిటీ తరఫున విన్నర్స్‌గా తిరిగి రావాలని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్.
కాంటెస్ట్‌కు ఎంపికైన బైక్‌కు మేం అమర్చిన హంగులివే...
కస్టమైజేషన్‌కు వీలయ్యే బైక్స్‌లో స్ట్రీట్ 750 హార్లీ డేవిడ్సన్ బైక్ ది బెస్ట్. మేం చాలా బైక్స్ మోడిఫై చేశాం. కాని పూర్తిస్థాయిలో మోడిఫికేషన్ చేసిన హార్లీ బైక్ ఇదే. గ్లాస్ ఊల్‌తో చేసిన హ్యాండ్‌మేడ్ మఫ్లర్స్ ద్వారా దీని సౌండ్‌ని ఫ్యాబ్యులస్గా మార్చాం. ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అమర్చాం. విండ్ షీల్డ్ జత చేశాం. డిటచబుల్ లెదర్ బెల్ట్స్‌తో ఎంత లగేజీ అయినా క్యారీ చేసేందుకు వీలు కల్పించాం. క్రేజీగా అనిపించే ఎల్ఈడీ లైటింగ్స్ చేర్చాం. వీటన్నింటితో పాటు మాకే ప్రత్యేకమైన పెయింటింగ్‌ను అద్దాం.
‘ఒకప్పుడు ఐటీ ఉద్యోగులం. ఆఫీస్ నాలుగ్గోడలను మించి లైఫ్ ఎదగాలనే ఆశ. దాంతో పాటే మోటార్ బైక్ ప్రియత్వం కూడా ఉంది. యూకే, యూఎస్‌లలో కన పడే హై ఎండ్ బైక్స్లా మా బైక్స్‌ను కూడా కస్టమైజ్ చేసుకోవాలని ట్రై చేశాం’’ అంటూ గుర్తు చేసుకున్నారు ఈస్ట్ ఇండియా మోటార్ సైకిల్ రెవల్యూషన్(ఐమోర్ కస్టమ్స్) నిర్వాహకులు మృత్యుంజయ్, సైకత్ బసు. వీరిలో మృత్యుంజయ ఒడిశా, సైకత్ కోల్‌కతా నుంచి వచ్చి సిటీలో స్థిరపడ్డారు.
పెయింట్‌కు పేటెంట్...
వీళ్లిద్దరికీ ఫైనార్ట్స్‌లో చిన్నప్పటి నుంచి ప్రవేశముంది. తమ బైక్స్‌ని కొత్తగా కనిపించేలా చేయాలనే ఆరాటంతో నచ్చిన బొమ్మలు దాని మీద పెయింట్ చేశారు. దీంతో ఎక్కడ వీళ్ల మోటార్ సైకిల్ ఆపినా... జనం కాంప్లిమెంట్స్ ఇవ్వడం, ఫొటోలు తీయడం, తమ బైక్స్పైన కూడా ఆర్ట్ వర్క్ చేయమని అడగడం చేసేవారు. ‘ఆ తర్వాత అదే మమ్మల్ని ఈ ప్రొఫెషన్లోకి తీసుకొచ్చింది. బైక్స్‌తో పాటు హెల్మెట్స్‌పై కూడా పెయింటింగ్ చేయడం ప్రారంభించాం. ఉద్యోగాలు వదిలేసి ఐదేళ్ల క్రితం దీనిని పూర్తిస్థాయి ప్రొఫెషన్‌గా మార్చుకున్నాం. పూర్తి కస్టమైజేషన్‌కు విస్తరించాం’’అంటూ చెప్పారీ యువ చిత్రకారులు. మాదాపూర్‌లోని సర్వే ఆఫ్ ఇండియా కాలనీలో విశాలమైన షెడ్‌ని వీరు తమ ఆర్ట్ వర్క్‌కు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు.