ఉత్తమ అనువాదకులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు
చెన్నై, న్యూస్‌లైన్: ఉత్తమ అనువాదకులుగా ఎంపిక చేసిన 24 మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ ‘ఉత్తమ అనువాదకుల అవార్డు-2012’ను అందజేసింది. అవార్డుల ప్రదానోత్సవం చెన్నైలో శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ మాట్లాడుతూ, అనువాదాలు పాఠకులకు ఇతర భాషా రచయితలతో పరిచయూలు పెంచుతాయన్నారు.
గ్రహీతలకు తామ్రపత్రం, రూ.50 వేల చొప్పున నగదును అందజేశారు. అవార్డుకు ఎంపికైన వారిలో తెలుగు వ్యక్తి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లాలోని పెద్దేవం. క్రీ.పూ 500 నుంచి క్రీ.శ 624 సంవత్సరం వరకు ‘తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్’ అనే ఇంగ్లిష్ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ‘పనికొచ్చే ముక్క’ అనే శీర్షికను విశాలాంధ్ర దినపత్రికలో చాలా కాలం నడిపారు. గత డిసెంబర్లో వెంకటేశ్వరరావు కన్నుమూశారు. అవార్డును వెంకటేశ్వరరావు తరపున ఆయన బంధువులు స్వీకరించారు.