బెజవాడ బస్టాండ్‌కు 5జీ వైఫై!
ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ సాంబశివరావు
తొలి 15 నిమిషాలే ఉచితం
విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు 5జీ వైఫై హంగులు అందివచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న 3జీ, 4జీ కన్నా అప్డేట్గా 5జీ వైఫై అందించడం విశేషం. ఈ సేవలను రానున్న 3 నెలల్లో జిల్లా కేంద్రాల్లో ఉన్న బస్టాండుల్లో అందుబాటులోకి తేనున్నారు. క్వాడ్జెన్, బీఎస్ఎన్ఎల్, ఏపీఎస్ ఆర్టీసీ సంయుక్త ఆధ్వర్యంలో క్యూఫై లైఫ్ ః 5జీ సేవలను ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు సోమవారం ప్రారంభించారు. విజయవాడ బస్‌స్టేషన్‌కు రోజుకు 1.50 లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 17 వైఫై ఆపరేట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో వైఫై పాయింట్ పరిధిలో 400 మంది సేవలు పొందేలా డిజైన్ చేశారు. బ్రౌజింగ్లోకి వెళ్లి యూజర్ నేమ్, మొబైల్ నంబర్ నమోదు చేసుకున్నాక వచ్చే పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఈ సేవలు పొందవచ్చు.
తొలి 15 నిమిషాలే ఉచితం..
బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన వైఫై సేవలు ఒక యూజర్‌కు తొలి 15 నిమిషాలే ఉచితంగా అందిస్తారు. అనంతరం ఈ సేవలను స్క్రాచ్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేయాలి. బస్టాండ్‌లోని అవుట్లెట్లలో రూ.30, 60, 90 స్క్రాచ్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు.
కనెక్ట్కాక తికమక
ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వైఫై సేవలను ప్రారంభించి.. నగర పోలీస్ కమిషనర్ వేంకటేశ్వరరావుతో 5జీ కాల్ మాట్లాడిన కొద్ది సేపటికే వినియోగదారులు వైఫై సేవలు అందక తికమకపడ్డారు. అదేమంటే వైఫై యూజర్ నేమ్, పాస్ట్‌వర్డ్ విషయంలో అవగాహన లేకపోవడమే కారణమని తెలిసింది. యూజర్ నేమ్, మొబైల్ నంబర్, పాస్ట్‌వర్డ్ ఎంటర్ చేసే అవగాహన లేకుంటే వైఫై సేవలు అందని ద్రాక్షే.
హైదరాబాద్‌లో రోజూ 3 వేల మంది యూజర్లు
హైదరాబాద్‌లోనూ తామే వైఫై సేవలందిస్తున్నామని, ఇటీవల నక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన వైఫై జోన్లో రోజుకు 3 వేల మంది యూజర్లు ఉపయోగించుకుంటున్నారని క్వాడ్జెన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో-బెంగళూరు) సతీష్ బెనర్జీ ‘సాక్షి’కి చెప్పారు. బీఎస్ఎన్ఎల్తో కలసి 9 రాష్ట్రాల్లో వైఫై సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. బస్టాండ్‌లో వైఫై సేవలు ఏపీలో మాత్రమే ఏర్పాటు చేశామన్నారు.