పెద్ద రాష్ట్రాల్లో అత్యాచారాలు సహజం
వరుస అత్యాచార ఘటనలతో ఓ వైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అట్టుడికిపోతుంటే, మరోవైపు అక్కడి అధికార పార్టీ సమాజ్‌వాదీ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉంటున్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలోఅతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అలాంటి రాష్ట్రంలో అత్యాచారాలు సహజమేనంటూ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మొహిసిన్ ఖాన్ గురువారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సెలవిచ్చారు.
యువతీ యువకుల మధ్య సంబంధాలు చెడితే అత్యాచారం చేశారంటూ బాధిత మహిళలు ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు ఒక్క ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే జరగడం లేదని, దేశవ్యాప్తంగా ఉన్నాయని, కావాలంటే వెళ్లి గూగుల్ సెర్చ్‌లో వెతుక్కోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సెలవిచ్చారు.
బడౌన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, చెట్టుకు ఉరివేసి హత్య..అత్యాచారాన్ని అడ్డుకుందని కిరోసిన్ పోసి తగలబెట్టేశారు.. మహిళా జడ్జిపై ఆమె అధికారిక నివాసంలోనే అత్యాచారం.. తాజాగా పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం, ఉరి ఇలా రాష్ట్రంలో వారం పది రోజులుగా పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సందర్బంగా ఆ ఘటనలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఎం అఖిలేష్ యాదవ్ నిన్న పైవిధంగా స్పందించారు. అంతేకాకుండా యూపీలో జరిగిన సంఘటనలను మీడియానే అధికంగా చేసి చూపుతోందంటూ ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, సీం అఖిలేష్ యాదవ్‌లు మీడియాపై రుసరుసలాడిన సంగతి తెలిసిందే.