రాకేశ్, బిక్రమ్ లకు 'శౌర్యచక్ర'
శ్రీనగర్: పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ నవేద్ ను ప్రాణాలతో భద్రతా బలగాలను పట్టిచ్చిన ఇద్దరు జమ్మూకశ్మీర్ పౌరులు రాకేశ్ కుమార్ శర్మ, బిక్రమ్ జీత్ లకు ప్రతిష్టాత్మక 'శౌర్యచక్ర' పురస్కారం దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున వీరికి ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. దేశ సాహస పురస్కరాల్లో మూడో అత్యున్నత అవార్డుగా 'శౌర్యచక్ర'ను పరిగణిస్తారు.
అసమాన తెగువతో ఉగ్రవాదిని పట్టుకున్న వీరిద్దరికీ 'శౌర్యచక్ర' ఇవ్వాలని జమ్మూకశ్మీర్ పోలీసులు మంగళవారం ప్రతిపాదించారు. అంతేకాదు వీరిద్దరికీ జమ్ముకశ్మీర్ పోలీసు శాఖలో ఉద్యోగాలిస్తూ అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. రాకేశ్ ను ఆపరేషనల్ గ్రౌండ్ కానిస్టేబుల్ గా నియమించారు. పాకలాయ్ ప్రాంతానికి చెందిన శర్మ ఉధంపూర్ లోని సిమ్రోలిలో నివసిస్తున్నాడు. జమ్మూలోని నానక్ నగర్ కు చెందిన బిక్రమ్ జీత్ ను ఫాలోవర్ గా అపాయింట్ చేశారు.
ఈనెల 5న ఉధంపూర్ దగ్గర్లోని సిమ్రోలి గ్రామంలో నవేద్ ను పట్టుకున్నారు. తమను బందీలుగా పట్టుకున్న నవేద్ ఎదిరించి రాకేశ్, బిక్కమ్ అతడిని పట్టుకున్నారు. అతడితో పాటు వచ్చిన మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. అంతకు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. రాకేశ్, బిక్రమ్ చూపిన తెగువను జాతి యావత్తు ముక్తకంఠంతో కొనియాడింది.