జనాలను పిట్టల్లా తొక్కించేశాడు!
న్యూయార్క్: డ్రగ్స్ మత్తులో అమెరికా నేవీ మాజీ ఉద్యోగి రద్దీ రోడ్డుపై హల్చల్ చేశాడు. మనుషులను పిట్టల్లా తొక్కిస్తూ తన కారును నడిపి భయోత్పాతం సృష్టించిన ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ భయానక ఘటనలో ఓ యువతి మృతిచెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. న్యూయార్క్ సిటీలోని రద్దీ ప్రాంతం టైమ్స్ స్కేర్ సమీపంలోని 42 స్ట్రీట్‌లో మద్యం సేవించిన, డ్రగ్స్ తీసుకున్న యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి రిచర్డ్ రోజస్ కారు నడుపుతున్నాడు. సిగ్నల్ వద్ద యూ టర్న్ తీసుకున్నాడు. అంతవరకూ బాగానే ఉన్నా కొన్ని సెకన్లలో అక్కడ భీకర వాతావరణం సృష్టించాడు.
కారు ఛేజ్ బ్యాంకు వద్దకు రాగానే రోడ్డుపై వెళ్తున్న దాదాపు 10 మందిపైకి దూసుకెళ్లింది. ఇలా ఒక్కసారి కాదు.. మూడుసార్లు జనాలపైకి కారును నడిపిన నేవీ వెటరన్.. పిట్టాల్లా మనుషులను తొక్కించేశాడు. ఓవరాల్‌గా 30 మందిని ఢీకొడుతూ కారును తన ఇష్టరీతిన నడపడంతో పలువురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఓ 18 ఏళ్ల యువతి మృతిచెందగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పారిపోయేందుకు పరుగెత్తుతున్న నిందితుడిని కొందరు వ్యక్తుల సాయంతో న్యూయార్క్ పోలీసులు నిందితుడు రిచర్డ్‌ను అరెస్ట్ చేశారు.
గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. న్యూయార్క్ మేయర్ బిల్ డే బ్లాసియో ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇది ఉగ్రవాదల చర్య కాదని, మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన తప్పిదమన్నారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసు నమోదు చేసిన న్యూయార్క్ పోలీసులు రిచర్డ్‌పై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.