ఆంధ్రా బ్యాంకు నుంచి త్వరలో భారత్ బిల్ పేమెంట్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రకాల సేవలకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు ఉపయోగపడేలా త్వరలో భారత్ బిల్ పేమెంట్ సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు ఆంధ్రా బ్యాంక్ ఎండీ సురేశ్ ఎన్ పటేల్ వెల్లడించారు. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే అనుమతులు ఇచ్చిందని తెలిపారు. సెప్టెంబర్ కల్లా ఈ సర్వీస్ అందుబాటులోకి రాగలదని ఆయన వివరించారు. అలాగే ఖాతాదారులు తమ మొబైల్స్ ద్వారా నగదు బదిలీ లావాదేవీలు జరిపేలా యూజర్ పేమెంట్ ఇంటర్ఫేస్ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు పటేల్ తెలిపారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును కూడా కలిసిన పటేల్.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. అమరావతిలో వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు రుణాలిచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు.