భర్తను ఏమార్చి.. మరో రైలు ఎక్కేసింది
ధన్‌బాద్: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికకు తల్లిదండ్రులు ఆమె అభీష్టానికి భిన్నంగా 24 ఏళ్లు పెద్దవాడైన, గుజరాత్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లయిన తర్వాత అత్తవారింటి నుంచి తొలిసారి పుట్టింటికి వచ్చిన ఆ అమ్మాయి భర్తతో వెళ్లేందుకు నిరాకరించింది. తల్లిదండ్రులు నచ్చజెప్పి ఆమెను భర్తతో పంపారు. కాగా గుజరాత్‌కు తిరిగి వస్తుండగా ధన్‌బాద్ రైల్వే స్టేషన్లో ఆమె భర్తను ఏమార్చి మరో రైలు ఎక్కేసింది. ఆ రైలు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చేరింది.
రాయ్‌పూర్ రైల్వే పోలీసులు ఆమెను రాయ్‌పూర్ జిల్లా శిశు సంక్షేమ సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులకు అప్పగించారు. అక్కడే ఆ అమ్మాయి నెల రోజులు ఆశ్రయం పొందింది. అధికారులు ఆమెకు పునరావాసం కల్పించి, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ధన్‌బాద్ జిల్లా శిశు సంక్షేమ సంఘం అధికారులను సంప్రందించి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. మైనర్ బాలికకు పెళ్లి చేయడం చట్టవిరుద్ధమని, ఆమెను బలవంతంగా భర్తకు అప్పగిస్తే చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులను సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు. తాను చదువుకుంటానని, భర్తతో వెళ్లనని ఆ అమ్మాయి అధికారుల ఎదుట చెప్పింది. సీడబ్ల్యూసీ అధికారులు మైనర్ బాలిక భర్త షాకర్ ఖాన్‌కు సమన్లు పంపారు.