రాజీవ్‌ని చంపిన బాంబు ఎక్కడిది?
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్నలు సంధించింది. కేసు విచారణ పురోగతితోపాటు, ఆయన్ను చంపటానికి ఉపయోగించిన బాంబు ఎక్కడి నుంచి వచ్చిందన్న ఆరాలు తీసింది.
26 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో పలు దర్యాప్తు సంస్థలు చేపట్టిన విచారణ పారదర్శకంగా లేదంటూ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న దోషి ఏజీ పెరరివలన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు గురువారం పిటిషన్ పై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. " రాజీవ్ ను చంపడానికి ఉపయోగించిన బాంబు ఎక్కడిది? దానిని ఎవరు తయారు చేశారు? అసలు దానిని ఎవరు తీసుకొచ్చారు? అని ప్రశ్నలు సంధించింది. ఈ అంశంపై సోలిసిటర్ జనరల్ లేదా అదనపు సోలిసిటర్ జనరల్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడుతూ వచ్చే బుధవారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది.
బాంబు ఎక్కడి నుంచి వచ్చిందోనన్న అంశంపై స్పష్టత వస్తే తన క్లయింట్ నిర్దోషితత్వం నిరూపించుకునే అవకాశం లభిస్తుందని పెరరివలన్ తరపు న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణ్ తెలిపారు. మే 21, 1991 లో శ్రీపెరంబదూర్ లో రాజీవ్ గాంధీ హత్యకు గురికాగా, 1998 డిసెంబర్ 2 లో అప్పటి ప్రభుత్వం ఎండీఎంఏ(మల్టీ డిసిప్లినరీ మానిటరింగ్ ఏజెన్సీ) అంటూ ఢిల్లీ, చెన్నైకి చెందిన సీబీఐ, మరికొన్ని పరిశోధనల సంస్థలతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బాంబుకు సంబంధించి రెండుబ్యాటరీలు తయారు చేశాడన్న ఆరోపణలపై పెరరివలన్‌కు ఉరిశిక్ష పడగా, తర్వాత అప్పీల్ తో అది యావజ్జీవ శిక్షగా కోర్టు మార్చేసింది.