బయ్యారంలో మారిన సరిహద్దులు
బయ్యారం : నూతన జిల్లాల ఏర్పాటులో బయ్యారం ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉన్నప్పుడు బయ్యారం మండలానికి దక్షిణం వైపున వరంగల్ జిల్లాలోని పాకాల వాగు, కొత్తగూడ మండలాలు సరిహద్దుగా ఉండేవి. ప్రస్తుతం బయ్యారం మండలం దక్షిణాన ఉన్న మహబూబాబాద్ జిల్లాలో కలువగా తూర్పున ఉన్న ఇల్లెందు మండలం భద్రాద్రి జిల్లాలో కలిసింది. దీంతో రెండు ప్రాంతాలు వేర్వురు జిల్లాల్లోకి వెళ్లాయి. మండలంలోని నామాలపాడు సమీపంతో పాటు పాఖాలకొత్తగూడ సరిహద్దులో ఉన్న మిర్యాలపెంట గ్రామం భద్రాద్రి జిల్లాకు హద్దుగా మారింది.
గతంలో ఉప్పలపాడు పంచాయతీలోని లకీ‡్ష్మనర్సింహపురం గ్రామంలో రహదారికి తూర్పు వైపున ఉన్న ఇళ్లు ఖమ్మం జిల్లాలో ఉండగా దక్షిణం వైపున ఉన్న ఇళ్లు వరంగల్ జిల్లాలో ఉండేవి. ప్రస్తుతం ఆ గ్రామానికి జిల్లా సరిహద్దులు మారగా మండల హద్దులు మాత్రం అలానే ఉన్నాయి. బయ్యారం మండలం నూతన జిల్లాలోకి మారినప్పటికీ పాత సంప్రదాయం ప్రకారం ఇతర జిల్లాకు హద్దుగా మారడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు