జగన్ లేఖతో వీడిన సస్పెన్స్
బొట్టెంతోగు ఎన్కౌంటర్ మృతులు తొమ్మిదిమంది
చర్ల : తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పత్రికలకు విడుదల చేసిన లేఖతో బొట్టెంతోగు ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులపై సస్పెన్స్ వీడింది. సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మార్చి 1న జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసలు ప్రకటించారకు. వారి మృతదేహాలను కూడా అక్కడి నుంచి తరలించారు. అనంతరం రెండోరోజు కాల్పు లు జరిగిన ప్రాంతానికి సమీపంలో మరో మావోయిస్టు మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారని, మావోయిస్టులు ఆ మృతదేహాన్ని ఖననం చేసి నివాళులర్పిం చినట్లు జోరుగా ప్రచారం సాగింది.
అయితే అవి పుకార్లేనని కొందరు.. నిజమని మరికొందరు వాదించారు. కాల్పులు జరిగిన ప్రాంతం చర్లకు 40 కిలోమీటర్ల దట్టమైన అటవీప్రాంతంలో ఉంది. అక్కడకు వెళ్లి వివరాలు సేకరిం చడం కష్టంగా మారడంతో మూడు రోజుల పాటు తొమ్మిదో మృతదేహంపై సస్పెన్స్ కొనసాగింది. అయితే కాల్పుల ఘటనను వివరిస్తూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పత్రికలకు ఒక లేఖను విడుదల చేసి అందులో మృతి చెం దిన తొమ్మిది మంది పేర్లను ప్రకటించడంతో తొమ్మిదో మృతదేహంపై క్లారిటీ వచ్చింది.
కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఎనిమిది మంది మృతదేహాలను పోలీసులు తీసుకువచ్చి భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పంచనామా నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తొమ్మిదో మృతదేహం గడ్చిరోలి జిల్లా మావోయిస్టు కమాండర్ నక్కోటి సంకయ్య అలియాస్ మోన్కోదని, మృతదేహాన్ని గ్రామస్తులు, మావోయిస్టులు ఖననం చేశారని తెలుస్తోంది.