‘బ్రహ్మంసాగర్’లో యువకుడి మృతదేహం
బ్రహ్మంగారిమఠం: తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ ఎడమ కాలువలో మైదుకూరు - పోరుమామిళ్ల రహదారిలోని లింగాలదిన్నెపల్లె బ్రిడ్జి దగ్గర శుక్రవారం గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని ఆ గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయాన్ని వారు పో లీసులకు తెలిపారు. ఎస్ఐ రంగస్వామి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తుల సహకారంతో కాలువలో నుంచి యువకుడి మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుని వద్ద కొంత నగదు, సెల్‌ఫోన్, బైక్ తాళాలు ఉన్నాయి. అతను ధరించిన చొక్కాను పరిశీలించగా.. పామూరుకు చెందిన వెంగమాంబ టైలర్ పేరుతో లేబుల్ ఉంది. మృతదేహాన్ని పోలీసులు బి.మఠం పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకున్నారు.
మరో మృతదేహం..
బ్రహ్మంసాగర్ ఎడమ కాలువలోనే శుక్రవారం సాయంత్రం లింగాలదిన్నెపల్లె గ్రామస్తులు మరో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. అతనికి 45 ఏళ్లు ఉండవచ్చు. నీటి ప్రవాహంలో కొట్టుకునిపోతుండగా చూసినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించే లోపే కొట్టుకుపోయినట్లు వారు పేర్కొన్నారు.